జ్యూస్ అని యాసిడ్ తాగించిన చిన్నమ్మ
-బాలుడికి చికిత్స చేయించిన తల్లిదండ్రులు
మేడిపల్లి, ఏప్రిల్ 16 (విజయక్రాంతి): మామ ఆదరణ తమ బిడ్డ కంటే తోడికోడలు కొడుకుపై ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని, అక్కసుతో నాలుగేళ్ల పసివాడికి యాసిడ్ తాగించిన ఘటన మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బోడుప్పల్ శ్రీనివా స కాలనీలో ఉండే పర్వతం సతీష్ కుమార్, అంజమ్మ దంపతులకు ఇద్దరు కుమారులు నాగరాజు, జగదీష్ ఉన్నారు.
వారిద్దరికీ వివాహాలై, పిల్లలు ఉన్నారు. వీరంతా కలిసి ఒకే ఇంట్లో నివసిస్తున్నారు. పెద్ద కుమారుని కొడుకు కార్తీక్ వాసు(4)పై తాత ఎక్కువ ప్రేమ చూపిస్తున్నాడని తన బిడ్డను పట్టించుకోవడం లేదని చిన్న కోడలు మంజుల కక్ష పెంచుకొని, తరచు గొడవలకు దిగేది. ఈ క్రమంలో బాలుడు పై కక్ష పెంచుకొని పలుమార్లు అత్యాయత్నం చేసింది.
ఒకసారి బెడ్ రూమ్‌లో బాలుడి ముక్కు, నోరు, మూసి ఊపిరాడకుండా చేయబోగా తల్లి చూసి అడ్డుకుంది. మరోసారి భవనం పైకి తీసుకెళ్లి ప్రమాదకరంగా రేలింగ్ పై కూర్చోబెట్టగా మామ గమనించి మందలించారు. ఈనెల 9న మంజుల బాలుడుని కిచెన్‌లోకి తీసుకెళ్లి జ్యూస్ తాగితే చాక్లెట్ ఇస్తానని చెప్పి యాసిడ్ తాగించింది. బాలుడి పరిస్థితి గమనించిన తల్లిదండ్రులు సమీపంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించారు. బుధవారం రాత్రి బాలుడి తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.






