calender_icon.png 9 July, 2025 | 11:18 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సకల జనులను కదిలించిన నిర్మల్ పోరు

08-08-2024 12:00:00 AM

 నిర్మల్, విజయక్రాంతి : ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనకోసం ౪౨ రోజులపాటు సకల జనుల సమ్మె ఒక పెద్ద ఉద్యమంలా నడిచింది. రాజ్యాంగబద్ధమైన కోరికతో, నాలుగున్నర కోట్ల తెలంగాణ ప్రజల ప్రత్యేక రాష్ట్రం ఆకాంక్షకు అనుగుణంగా.. మన వనరులు మనకు కావాలని.. మన ఉద్యోగాలు మనకు కావాలని.. మన భాష, మన యాస, మన సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకోవాలని పెద్ద ఎత్తున నిర్మల్ జిల్లాలో ఉద్యమపోరు నడిచింది. సీమాంధ్ర నాయకుల పాలన నుంచి విముక్తి పొందేందుకు చేపట్టిన పోరాటమే సకల జనుల సమ్మె. ఆనాటి ఉద్యమ పరిస్థితులను తెలంగాణ ఉద్యమ కారుడు కొట్టె శేఖర్ విజయక్రాంతితో ముచ్చటించారు. 

కుల సంఘాలు, కార్మిక సంఘాలు కలిసి నిర్మల్‌లో సమావేశం నిర్వహించారు. సకల జనుల సమ్మెలో భాగస్వాములను చేయాలని ప్రజల మద్దతుగా నిర్మల్ ఆర్డీవో కార్యాలయం ఎదుట సెపెంబర్ 13న 2011లో ఉద్యోగ జేఏసీ ద్వారా నిరసనలు వ్యక్తపరిచాం. అప్పటి ఉద్యోగ జేఏసీ కన్వీనర్ మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో ఉమ్మడి ఆదిలాబాదు జేఏసీ కన్వీనర్‌గా నాకు బాధ్యతలు అప్పగించారు. నిర్మల్ అటవి శాఖలో ఉద్యోగం చేస్తున్న నేను ఉద్యమంలో పాల్గొనాలని నిర్ణయం తీసుకొన్నాను.

జిల్లా కేంద్రంలో ప్రారంభమైన సకల జనుల సమ్మె జిల్లా వ్యాప్తంగా అన్ని పట్టణాల్లో, గ్రామాల్లో జేఏసీలను ఏర్పాటు చేశాం. ఉమ్మడి ఆదిలాబాదు జిల్లా వ్యాప్తంగా తిరుగుతూ తెలంగాణ వస్తే ఉద్యోగాలు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని తెలియజేస్తూ, ఉద్యమ ప్రాధాన్యత వివరిస్తూ ప్రజలను చైతన్య పరిచాం. దాంతో ప్రజలనుంచి పెద్ద ఎత్తున ఉద్యమానికి సంపూర్ణ సహకారం అందింది. ఈ మహా ఉద్యమంలో ఉద్యమకారులకు ఇప్పటివరకూ గుర్తింపు లభించకపోవడం బాధాకరం.