ఆవిరియనా అందాలు

19-04-2024 01:28:47 AM

రంగనాయకసాగర్‌లో అడుగంటిన జలాలు

3 టీఎంసీలకు గాను ప్రస్తుతం 0.79టీఎంల నీటి నిల్వల

వృథాగా అతిథిగృహాలు

సిద్దిపేట, ఏప్రిల్ 18 (విజయక్రాంతి) : గత ప్రభుత్వంలో నిండుకుండలా కనిపించిన సిద్దిపేట రంగనాయకసాగర్ రిజర్వాయర్ ప్రస్తుతం నీరులేక భూమి బీటలు వారి కనిపిస్తున్నది. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలంలోని రంగనాయకసాగర్ అందాలు ఆవిరైపోయాయి. 3 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో సాగునీటి అవసరాల కోసం 2300ల ఎకరాల విస్తీర్ణంలో రూ. 3,300ల కోట్ల వ్యయంతో నిర్మించి గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం 2020లో ప్రారంభించారు. 1,14000ల ఎకరాల ఆయకట్టుకు నీరందించడమే లక్ష్యంగా ఈ ప్రాజెక్టును నిర్మించారు. సిద్దిపేట జిల్లా పరిధిలోని తిప్పాపూర్, అనంతగిరి వద్దనున్న అన్నపూర్ణ రిజర్వాయర్ నుంచి సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం ఎల్లాయిపల్లి హెడ్‌రెగ్యులేటర్‌కు, అక్కడి నుంచి గ్రావిటీ కెనాల్ ద్వారా, ఆ తర్వాత సొరంగం ద్వారా రంగనాయకసాగర్ సర్జ్‌పూల్(చంద్లాపూర్)కు జలాలు వస్తాయి. చంద్లాపూర్ పంప్‌హౌజ్ నుంచి 490 మీటర్ల ఎత్తులో ఉన్న రంగనాయకసాగర్ జలాశయంలోకి గోదావరి జలాలు చేరుకుంటాయి.

ఈ రంగనాయకసాగర్ రిజర్వాయర్‌లోకి అన్నపూర్ణ రిజర్వాయర్‌లోంచి నీరు రావాల్సి ఉండగా ప్రస్తుతం అన్నపూర్ణ రిజర్వాయర్‌లోనూ నీటి నిల్వలు నామమాత్రంగానే ఉన్నాయి. సిద్దిపేట జిల్లాలోని పలు మండలాలతో పాటు సిరిసిల్ల జిల్లాలోని కొన్ని గ్రామాల పంటపొలాలు ఎండిపోతున్నాయని సాగుజలాలు అందించాలని గతంలో మాజీ మంత్రి హరీశ్‌రావు అధికారులను కోరారు. అన్నపూర్ణ రిజర్వాయర్ నుంచి గత ఫిబ్రవరిలో రంగనాయకసాగర్‌లోకి అధికారులు 2.90 టీఎంసీల నీటిని నింపినా, వాటిని పంటపొలాలకు కాలువల ద్వారా విడుదల చేశారు. ప్రస్తుతం రంగనాయకసాగర్‌లో 0.79టీఎంసీల నీరు మాత్రమే ఉన్నది. ఓ వైపు పంటలకు నీరు విడుదల చేయడంతో పాటు మరోవైపు ఎండ తీవ్రతతో నీరు ఆవిరవుతుండడంతో రంగనాయకసాగర్ రాళ్లు తేలి, భూమి బీటలు వారి కనబడుతున్నది.

ఒక్కప్పుడు గొప్ప పిక్నిక్ స్పాట్‌గా అందరికీ పరిచయం అయిన ఈ ప్రాంతం నీరు లేక వెలవెలబోతుంది. గడిచిన రెండుమూడేండ్లలో వానాకాలంతో పాటు మార్చి, ఏప్రిల్‌లోనూ వర్షాలు కురవడం వల్ల రిజర్వాయర్లలో నీటి సమస్యలు తలెత్తలేదు. ప్రస్తుతం వర్షాలు లేకపోవడంతో పాటు అన్నపూర్ణ రిజర్వాయర్ నుంచి కూడా రంగనాయకసాగర్‌లోకి నీరు రాకపోవడంతో పూర్తిగా కళ తప్పినట్టయ్యింది. అన్నపూర్ణ రిజర్వాయర్‌లోనూ నీటి నిల్వలు నామమాత్రంగా ఉండడంతో రంగనాయక సాగర్‌లోకి జలాలను విడుదల చేయలేకపోతున్నట్లు అధికారవర్గాలు వెల్లడిస్తున్నాయి. పై ప్రాజెక్టు నుంచి నీళ్లు విడుదల చేయడమా లేదా వర్షాలు కురిస్తేనో గానీ రంగనాయకసాగర్‌కు మళ్లీ జలకళ సంతరించుకునేటట్టు లేదు.

వృథాగా అతిథి గృహాలు

రంగనాయకసాగర్‌లో నీటి నిల్వ లు తగ్గి కళాహీనంగా మారడంతో ఇక్కడి అతిథి గృహాలు వృథాగానే ఉంటున్నాయి. రంగనాయకసాగర్‌లో నీటినిల్వలు పుష్కలంగా ఉన్న సమయంలో ఇక్కడ బోటింగ్ నిర్వహించడంతో పాటు సందర్శకులు ఇక్కడే విడిది చేయడానికి రంగనాయకసాగర్ మధ్యలో ఇరిగేషన్ శాఖ కోట్ల రూపాయల వెచ్చించి అతిథిగృహాలు కూడా నిర్మించింది. ప్రస్తుతం ఇవన్నీ వృథాగా ఉండిపోయాయి. నీటి నిల్వలు లేకపోవ డంతో దూరప్రాంత ప్రజలే కాకుండా పరిసరప్రాంతాల ప్రజలు కూడా ప్రాజెక్టును సందర్శించడానికి రావడం లేదు.