7 March, 2026 | 6:35 AM

బెల్ట్ జోరు.. జనం బేజారు!

07-03-2026 01:42 AM

మత్తులో జోగుతున్న పల్లెలు

కిరాణా షాపుల్లో విచ్చలవిడిగా అమ్మకాలు

పెడదారి పడుతున్న యువత

పచ్చని సంసారాలను పాడు చేస్తున్న మద్యం

పట్టించుకోని ప్రజాప్రతినిధులు, ఎక్సైజ్ అధికారులు

మెదక్, మార్చి 6 (విజయక్రాంతి): మెదక్ జిల్లాలో బెల్ట్ షాపుల దందా జోరుగా సాగుతోంది. పల్లెలు.. పట్టణాలని తేడా లేకుండా ఎక్కడికక్కడ దుణాలు నిర్వహిస్తున్నారు. కొన్నిచోట్ల ధరలు పెంచి బహి రంగంగా విక్రయాలు చేపడుతున్నారు. అ యినా సంబంధిత అధికారులు పట్టించుకోక పోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బెల్ట్ షాపులు నిర్వహిస్తే బెల్ట్ తీస్తా మని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హెచ్చరించినా.. క్షేత్రస్థాయిలో మాత్రం భిన్న పరిస్థి తులు నెలకొన్నాయి. పలు గ్రామాల్లో కిరా ణా దుకాణాల్లోనూ మద్యం విక్రయాలు జరుగుతున్నాయి. అధికారులు చూసీచూడనట్లు వ్యవహరించడం.. తదితర కారణాలతో మెదక్ జిల్లాలో బెల్ట్ వ్యాపారం మూడు పూలు.. ఆరు కాయలు అన్న చందంగా సాగుతోంది.

జిల్లాలో ఇలా.. 

మెదక్ జిల్లాలో 49 మద్యం దుకాణాలు ఉన్నాయి. ఇందులో సుమారుగా రెండు వేల వరకు బెల్ట్ షాపుల్లో దందా జోరుగా సాగుతోంది. దీంతో మారుమూల గ్రామా లు మత్తులో జోగుతున్నాయి. గ్రామాలు, తండాల్లో పుట్టగొడుగుల్లా బెల్ట్ దుకాణాలు వెలుస్తున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా షాపులు ఏర్పాటు చేసి అధిక ధరలకు విక్రయిస్తూ వ్యాపారులు సొమ్ము చేసుకుం టున్నారు. అనేక మంది బెల్టుషాపుల్లో మ ద్యం కొనుగోలు చేసి జేబులు గుల్ల చేసుకుంటున్నారు. అప్పులు చేసి తాగడంతో కాపు రాలు వీధి పాలవుతున్నాయి.

పట్టించుకోని అధికారులు 

బెల్టు షాపుల ద్వారా ప్రభుత్వానికి అత్యధిక ఆదాయం సమకూరుతోంది. మరింత ఆదాయాన్ని పెంచుకోవాలనే ఉద్దేశంతో ప్రభుత్వం బెల్టుషాపులను అంతర్గతంగా ప్రో త్సహిస్తోందన్న ఆరోపణలు వస్తున్నాయి. ఈ విషయంలో మహిళల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నా.. ఎవరూ పట్టించు కోవడం లేదు. అటు ఎక్సైజ్ శాఖ అధికారులు కానీ.. ఇటు పోలీసులు కానీ చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

అధికారులు కనుసన్నల్లోనే.. 

మెదక్ జిల్లాలో మద్యం అమ్మకాలు కోట్ల రూపాయల్లో జరుగుతున్నాయి. జిల్లాలో 49 వైన్స్ షాపులు, 5 బార్లు నడుస్తున్నాయి. ఈ మద్యం దుకాణాలు, బార్లలో ప్రతీనెల కోట్ల రూపాయల్లో మద్యం విక్రయాలు జరుగుతున్నాయి. వైన్స్ యజమానులు, ఎక్సైజ్ అధికారుల అండదండలతో మెదక్ జి ల్లా వ్యాప్తంగా ఊరూరా బెల్టుషాపులు నడుస్తున్నాయి. మద్యం అమ్మకాలు పెంచాలని ప్రభుత్వం ఎక్సైజ్ అధికారుల నుంచి ఒత్తిడి వస్తుండటంతో వ్యాపారులు సిండికేట్గా మా రి ఎక్కువ ధరలకు ఊరూరా బెల్ట్షాపులు పెట్టి అనధికారికంగా మద్యం అమ్ముతున్న ట్లు జిల్లా ప్రజలు ఆరోపిస్తున్నారు.

పేరుకు కిరాణం... లోపల మద్యం... 

గ్రామాల్లో పేరుకు కిరాణా దుకాణాలు నిర్వహిస్తూ లోపల మాత్రం మద్యం వ్యాపారం చేస్తున్నారు. సొంత ఇళ్లలో పెద్ద ప్రిజ్జులు ఏర్పాటు చేసుకుని బీర్లు విక్రయిస్తున్నారు. వైన్షాపుల యజమానులు ఆటోల ద్వారా మద్యాన్ని ఊరూరా సరఫరా చేస్తున్నారు. తమకు కేటాయించిన గ్రామాలకు నిత్యం ఆటోల ద్వారా పంపించి అమ్ముతున్నారు. మద్యం తాగి చాలామంది ఇళ్ల మ ధ్యలో గొడవలు పడుతూ అర్ధరాత్రి వరకు నానా రభస చేస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ప్రతి గ్రామంలో బెల్ట్ షాపుల కారణంగా మద్యం ఏరులై పారుతోంది.

నెలవారీ మామూళ్లు.. 

నిబంధనల ప్రకారం మద్యం దుకాణాల్లో చీప్ లిక్కర్ క్వార్టర్ మద్యం రూ.110 కు విక్రయించాలి. కానీ, రూ.20 అదనంగా పెంచి అమ్ముతున్నారు. బెల్టుషాపు నిర్వాహకులు రూ.110 ధర ఉన్న క్వార్టర్ బాటిల్ను రూ.150కు విక్రయిస్తున్నారు. ఆయా మద్యం దుకాణాలకు సంబంధించిన పరిధిని నిర్ణయించి బెల్టుషాపులకు మద్యం విక్రయిస్తుండటంతో పాటు ముందస్తు సమాచా రంతో ఎక్సైజ్శాఖ అధికారులు బెల్టుషాపులవైపు కన్నెత్తి చూడట్లేదనే విమర్శలు ఉన్నాయి. ఇటీవల మద్యం దుకాణాల వద్ద పర్మిట్ రూమ్లకు అనుమతి ఇచ్చారు. దీంతో ఎకైû్సజ్, పోలీస్ శాఖల పేరుతో ఒక్కో మద్యం దుకాణం నుంచి నెలకు కనీసం రూ.50 వేలకు తగ్గకుండా మామూళ్లు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.