లెక్కలు తలకిందులు
లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ సాధించిన విజయాలకన్నా ఎదురుదెబ్బలే ఎక్కువని ఫలితాలను విశ్లేషిస్తే అర్థమవుతుంది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో సొంతంగా 303 స్థ్థానాలు గెలుచుకున్న ఆ పార్టీ ఇప్పుడు 240 స్థానాలకే పరిమితమైంది. అంటే గతంలో సాధించిన స్థానాల్లో 63 సీట్లు కోల్పోయింది. అయితే ఒడిశా, హిమాచల్‌ప్రదేశ్, తెలంగాణ వంటి రాష్ట్రాల్లో బలాన్ని పెంచుకోవడం కారణంగా స్పష్టమైన మెజారిటీకి 30 స్థానాలు తక్కువగా నిలిచింది. తెలుగుదేశం , జేడీ(యూ)లాంటి మిత్రపక్షాల తోడ్పాటుతో తిరిగి అధికారం దక్కినా కమలం పార్టీకి ఈ ఫలితాలు పెద్ద షాకేనని చెప్పాలి.
400కు పైగా స్థానాలు గెలుచుకుంటామని చెప్పుకొంటూ వచ్చిన పార్టీ ఇప్పుడు ఈ స్థితిలో ఉండడానికి కారణాలేమిటి? నిజానికి బీజేపీ బలమంతా ‘హిందీ హార్ట్‌ల్యాండ్’గా చెప్పుకొనే పది రాష్ట్రాలే. ఉత్తరప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, హర్యానా, ఢిల్లీ,హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్, జార్ఖండ్, చత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో కలిపి మొత్తం 225 లోక్‌సభ స్థానాలుంటే, 2019లో బీజేపీ 176 చోట్ల గెలిచింది. అయితే ఈ సారి 125 స్థానాలను మాత్రమే దక్కించుకుంది. ప్రధానంగా యూపీలోని 80 సీట్లకుగాను 32 సీట్లకే పరిమితమైంది. అంటే గతంకన్నా సగం సీట్లలో మాత్రమే గెలుపొందింది. గత ఎన్నికల్లో రాజస్థాన్‌లో మొత్తం 25 స్థానాలు, హర్యానాలో 10 స్థానాలతో క్లీన్‌స్వీప్ చేయగా, ఈ సారి రాజస్థాన్‌లో 14, హర్యానాలో 5 సీట్లను మాత్రమే దక్కించుకుంది. ఈ రాష్ట్రాలన్నిటిలో అధికారంలో ఉన్నది బీజేపీయే. మధ్యప్రదేశ్, ఢిల్లీ, హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లలో క్లీన్‌స్వీప్ చేయడం వల్ల ఆ నష్టంలో కొంత భర్తీ చేసుకోకపోయి ఉంటే అధికారం దూరమయి ఉండేదేమో!
ఇక మహారాష్ట్రలో కూడా కాషాయ పార్టీకి గట్టి ఎదురుదెబ్బే తగిలింది. 48 స్థానాలున్న రాష్ట్రంలో గత లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ 23,దాని మిత్రపక్షంగా ఉండిన అవిభక్త శివసేన 18 సీట్లు గెలుచున్నాయి. అయితే ఈ సారి బీజేపీ 9 చోట్ల మాత్రమే గెలుపొందింది. ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన 7 సీట్లు, అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్‌సీపీ ఒక్క సీటు మాత్రమే గెలుచుకున్నాయి. మరోవైపు కాంగ్రెస్ 13, ఉద్ధవ్ థాక్రే శివసేన 9, శరద్‌పవార్ ఎన్‌సీపీ 8 చోట్ల విజయం సాధించాయి. ఇక పశ్చిమ బెంగాల్‌లో మమతా బెనర్జీని దెబ్బతీయడానికి కమలనాథులు అన్ని విధాలుగా ప్రయత్నించారు.
తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నేతలు అనేక మందిపై ఈడీ, సీబీఐ దాడులు జరిగాయి. సందేశ్ ఖలి ఘర్షణలు సాకుగా ఆ పార్టీపై పెద్ద ఎత్తున వ్యతిరేక ప్రచారం సాగింది. అయినప్పటికీ ఎన్నికల్లో దీదీనే పైచేయి సాధించారు. రాష్ట్రంలోని 42 స్థానాలకుగాను 29 చోట్ల ఆ పార్టీ విజయం సాధించింది. గతంకన్నా ఏడు సీట్లు ఎక్కువ దక్కించుకుంది. బీజేపీ గతంలో 18 సీట్లు గెలుచుకో గా ఈ సారి దక్కింది 12 సీట్లే. మరోవైపు ముస్లింల ప్రభావం ఎక్కువగా ఉన్న 103 స్థానాల్లో కూడా బీజేపీకి ఈ సారి ఎదురుదెబ్బే తగిలింది.
గత ఎన్నికల్లో ఈ మొత్తం సీట్లలో బీజేపీ 45 సీట్లు గెలుచుకోగా, కాంగ్రెస్ 12, ఇతరులు 47 చోట్ల విజయం సాధించారు. అయితే ఈ సారి బీజేపీ 35 సీట్లతోనే సరిపెట్టుకోగా, కాంగ్రెస్ 12 చోట్ల, ఇతరులు 55 చోట్ల విజయం సాధించారు. వీటిలో యూపీలో అఖిలేశ్ యాదవ్ నేతృత్వంలోని ఎస్పీ గెలుచుకున్న సీట్లే ఎక్కువ. అయితే నవీన్ పట్నాయక్ కంచుకోట అయిన ఒడిశాలో అధికారాన్ని చేజిక్కించుకోవడంతో పాటు అత్యధిక లోక్‌సభ స్థానాలను దక్కించుకోగలగడం, అలాగే ఢిల్లీలో మొత్తం ఏడు సీట్లు గెలుచుకుని ఆమ్ ఆద్మీపార్టీని చావుదెబ్బ కొట్టడం, కాంగ్రెస్ అధికారంలో ఉన్న హిమాచల్‌ప్రదేశ్‌లో క్లీన్‌స్వీప్ చేయడం లాంటివి ఆ పార్టీ కొత్తగా సాధించిన విజయాలు. అలాగే దక్షిణాదిన తన ఓటుశాతాన్ని పెంచుకోగలి గామన్న సంతృప్తి దక్కింది. ఆయా రాష్ట్రాల్లో విస్తరణకు ఇది దోహద పడుతుందేమో చూడాలి.






