మొబైల్ మోజులో యువత
దూరప్రాంతాల్లో ఉన్న బంధుమిత్రుల యోగక్షేమాలు తెలుసుకోవడానికి, తక్షణ సమాచారానికి ఉపయోగపడే మొబైల్ ఇప్పుడు యువత పెడతోవ పట్టడానికి కారణమవుతోంది. దీనిమాయలో పడి యువతీ యువకులు పరిసరాలను మరిచిపోతు న్నారు. గంటలకొద్దీ అనవసర విషయాలను మొబైల్స్‌లో వెతుకుతూ ఆనందిస్తున్నారు. ఈ క్రమంలో విద్వేషపూరితమైన, అసందర్భమైన కామెంట్లు పెడుతూ వికృత ఆనందం పొందుతున్నారు. ఎంతో విలువైన సమయాన్ని మొబైల్ మోజులో వృథా చేసుకుంటున్నారు. ఫలితంగా చదువులు, కెరీర్‌పైన దృష్టి పెట్టకుండా భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారు. ఒకే ఇంట్లోనే ఎవరికి వారుగా బతికేస్తున్నారు. అందువల్ల యువత, విద్యార్థులు మొబైల్ వాడడంపై నియంత్రణ ఉండాలి. తమ అవసరాలకు పనికొచ్చే విషయాలను మాత్రమే తెలుసుకునే వీలుగా మొబైల్ ఫోన్స్ టెక్నాలజీ ఉండాలి. మిగతా వాటిని ఉపయోగించుకునే వీలు లేకుండా చేసిన తర్వాతే పెద్దలు పిల్లలకు ఫోన్స్ ఇవ్వాలి. అలాగే పరిమితికి మించి వాడకుండా చూడాలి. వారంలో కనీసం ఒకరోజు పూర్తిగా మొబైల్ ఫోన్ వాడకుండా కట్టడి చేయాలి. పెద్దలు సైతం మొబైల్ ఫోన్ వాడకంలో తమ పిల్లలకు ఆదర్శంగా నిలవాలి.అప్పుడే దాని ప్రయోజనం నెరవేరుతుంది.
-కామిడి సతీశ్ నెడ్డి, జయశంకర్ భూపాల్‌పల్లి జిల్లా






