calender_icon.png 10 February, 2026 | 2:16 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ముగిసిన ప్రచారం.. ముదిరిన యవ్వారం!

10-02-2026 12:23:36 AM

  1. చివరిరోజు హోరెత్తించిన ప్రచారాలు
  2. మున్సిపాలిటీలను చుట్టేసిన ముఖ్యనేతలు
  3. రోడ్ షోలు, కార్నర్ మీటింగ్ లతో బిజీ బిజీ
  4. మొదలైన తెరచాటు రాజకీయాలు

సూర్యాపేట, పిబ్రవరి 9 (విజయక్రాంతి) : దాదాపు వారం పాటు హోరెత్తిన మున్సిపల్ ఎన్నికల ప్రచారం సోమవారం సాయంత్రం ఐదు గంటలకు ముగిసింది. అన్ని పార్టీలకు అభ్యర్థులు ఖరారైనప్పటి నుంచి ప్రచారం మొదలుపెట్టగా కార్యకర్తలు, నేతల ప్రదర్శనలు, మైకుల హోరుతో జిల్లాలోని అన్ని మున్సిపాలిటీలు దద్దరిల్లాయి. దీంతో జిల్లాలోని సూర్యాపేట కోదాడ, హుజూర్ నగర్, నేరేడుచర్ల, తిరుమలగిరి మున్సిపాలిటీలు ప్రచార జడివానలో తడిసి ముద్దయ్యాయి అనడంలో ఎటువంటి సందేహం లేదు. 

ఇక నల్లగొండ  జిల్లాలోని నల్లగొండ కార్పొరేషన్ తో పాటు మిగిలిన ఏడు మునిసిపాలిటీలు, యాదాద్రి భువనగిరి జిల్లాలోని మొత్తం ఆరు మున్సిపాలిటీలలో సైతం ప్రచారంను ఆయా పార్టీల నాయకులు పెద్ద ఎత్తున నిర్వహించారు.  అయితే సోమవారమే ఎన్నికల ప్రచారం ముగియగా ఇక ప్రలోభాల యవ్వారం ముదిరినట్లు తెలుస్తుంది.                  

 విస్తృత ప్రచారం..  

ఈనెల 3వ తేదీన నామినేషన్ల ఉపసంహరణ ముగిశాక ప్రచారం ఊపందుకుంది. అభ్యర్థులు వార్డుల్లో ఇంటింటి ప్రచారంతోపాటు పోస్టర్లు, ఫ్లెక్సీలు, వాహనాలకు మైకులు అమర్చి ప్రచారాన్ని వేడెక్కించారు. ఇక రాజకీయ పార్టీల నుంచి ప్రధాన నేతలు సైతం ప్రచారంలో పాలు పంచుకున్నారు. జిల్లా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు  ఎమ్మెల్యేలు పద్మావతి, మందుల సామెల్ తో పాటు ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డిలు స్థానిక నాయకులతో కలిసి ఆయా మున్సిపాలిటీల్లో విస్తృతంగా ప్రచారం చేశారు.

బీఆర్‌ఎస్ నుంచి మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. మాజీ ఎమ్మెల్యేలు గాధారి కిషోర్, బొల్లం మల్లయ్య తదితరులు ప్రచారంలో పాల్గొన్నారు. ఇక బీజేపీ కోసం ఏకంగా ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్ర రావు కోదాడలో ప్రచారం చేశారు. వివిధ పార్టీల ఆధ్వర్యంలో రోడ్ షోలు, కార్నర్ మీటింగ్ లు పెట్టీ ఓట్లు రాబట్టేందుకు ఎవరికి వారు విశ్వ ప్రయత్నాలు చేశారు. 

చివరిరోజు చెమటోడ్చిన ముఖ్యనేతలు

సోమవారమే ప్రచారానికి చివరిరోజు కావడంతో తమ వార్డుల్లో ప్రచారం చేయాలని అభ్యర్థులు ఆయా పార్టీల ముఖ్య నేతలను కోరడంతో వారు కూడా వీలైనన్ని ఎక్కువ ప్రాంతాల్లో ప్రచారం చేశారు. అభివృద్ధిని ఆయుధంగా చేసుకుని కాంగ్రెస్ నేతలు, ప్రభుత్వ వైఫల్యాలను ప్రచారం చేసేలా బీఆర్‌ఎస్.. మరోపక్క బీజేపీ, ఇతర పార్టీల నేతలు కూడా చివరి రోజున ప్రచారాన్ని రక్తికట్టించే ప్రయత్నం చేశారు.

కాంగ్రెస్ తరపున మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదివారం రాత్రి సూర్యాపేటలో భారీ ఎత్తున ప్రచారం నిర్వహించగా సోమవారం చివరి రోజు కావడంతో గాలి మోటార్ పై జిల్లాలోని మిగిలిన నాలుగు చోట్లకు క్షణం తీరికలేకుండా తిరుగుతూ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ ప్రచారం చేశాడు.  అలాగే బీఆర్‌ఎస్ తరఫున మాజీ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి తన సొంత నియోజకవర్గమైన సూర్యాపేట మున్సిపాలిటీని ప్రతిష్టాత్మకంగా తీసుకొని పార్టీని గెలిపించేందుకు ఛాయ శక్తుల కృషి చేశాడు.

చివరి రోజు సూర్యాపేటలోని అన్ని ప్రాంతాలను కవర్ చేస్తూ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడతూ ప్రచారం చేశారు. ఇక మిగిలిన చోట స్థానిక నాయకులతో కలిసి ప్రచారం చేశారు. బిజెపి సైతం రాష్ట్ర ఉపాధ్యక్షులు సంకినేని వెంకటేశ్వరరావు, జిల్లా అధ్యక్షురాలు చల్ల శ్రీలత రెడ్డిలు పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. అలాగే తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఒట్టే జానయ్య యాదవ్ సూర్యాపేట మున్సిపాలిటీ పరిధిలో ప్రచారం చేశారు.                                   

పంపిణీకి సమాయత్తం..! 

బహిరంగ ప్రచారం గడువు ముగియగానే అభ్యర్థులు, రాజకీయ పార్టీల నేతలు తమ వ్యూహాలకు పదును పెడతున్నారు. ఓటు మేనేజ్మెంట్ ఎలా చేయాలనే అంశంపై ఇప్పటికే దృష్టి సారించగా.. రహస్యంగా ఓటర్లను కలిసేందుకు సమాయత్తం అవుతున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల రోజు వరకు మద్యం, నగదు పంపిణీపై రాజకీయ పార్టీలు దృష్టి పెట్టినట్లు సమాచారం.

ఏ వార్డులో పరిస్థితి ఎలా ఉంది.. ఎందరికి ఎంత మొత్తంలో పంపిణీ చేయాలనే లెక్కలను ముందుగానే వేసుకుంటున్నట్లు తెలుస్తుంది. దీనికి తోడు సోషల్ మీడియాను మంచి వేదికగా చేసుకుని ఓటర్లతో టచ్ లోకి వెళ్లేందుకు సిద్ధం కాగా ఇప్పటికే కొందరికి టచ్ లోకి తీసుకున్నట్లు వినికిడి.

ఉమ్మడి జిల్లాలో ఇది పరిస్థితి 

ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని నల్లగొండ కార్పొరేషన్ తో పాటు 18 మున్సిపాలిటీల్లో సోమవారం సాయంత్రం 5గంటలకు మైకుల మోత నిలిచిపోయింది. చివరి రోజును పూర్తిగా సద్వినియోగం చేసుకునేలా అభ్యర్థులు తమ డివిజన్లు, వార్డుల్లో భారీ ఎత్తున ర్యాలీలు, రోడ్ షో లను నిర్వహించారు. ఓవైపు అభ్యర్థులు, మరోవైపు కార్యకర్తలతో ప్రదర్శనలు, వాహనాల్లో మైక్ లు, ఫ్లెక్సీల ద్వారా ఎన్నికల గుర్తును ఓటర్లకు చూపుతూ ప్రచారంను హోరెత్తించారు.