23 May, 2026 | 2:56 AM

గిఫ్ట్ డీడ్‌ల ‘కలెక్టర్’!

23-05-2026 01:45 AM
  1. ఏసీబీ వలలో మేడ్చల్ డిప్యూటీ కలెక్టర్ వంశీమోహన్ 
  2. వందల కోట్ల అక్రమాస్తుల గుర్తింపు 
  3. నివాసాలతో పాటు 8 చోట్ల ఏకకాలంలో దాడులు
  4. ప్రభుత్వ  భూముల గిల్లుడు.. మామ పేరిట రిజిస్ట్రేషన్ చేసిన అల్లుడు 
  5. లంచంగా తీసుకున్న 10 ఓపెన్ ప్లాట్లన్నీ గిఫ్ట్ డీడ్‌లే

రంగారెడ్డి /అబ్దుల్లాపూర్‌మెట్, మే 22 (విజయక్రాంతి): తెలంగాణ రెవెన్యూ శాఖలో మరో భారీ అవినీతి తిమింగలం అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) వలలో చిక్కింది. మేడ్చల్--మల్కాజ్‌గిరి, రంగారెడ్డి జిల్లాల అర్బన్ ల్యాండ్ సీలింగ్ (యూఎల్సీ) స్పెషల్ డిప్యూటీ కలెక్టర్‌గా పనిచేస్తున్న వంశీమోహన్ ఇళ్లపై శుక్రవా రం తెల్లవారుజాము నుంచి ఏసీబీ అధికారులు మెరుపుదాడులు నిర్వహించారు.

ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారన్న పక్కా సమాచారంతో రంగంలోకి దిగిన అధికారులు.. వంశీమోహన్ నివాసంతో పాటు ఆయన బంధువులు, బినామీలకు చెందిన మొత్తం 8 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు చేపట్టారు. ఈ తనిఖీల్లో బహిరంగ మార్కెట్‌లో వందల కోట్ల విలువైన అక్రమాస్తులు, కీలక భూ పత్రాలు, నగదు, బంగారాన్ని అధికారులు గుర్తించారు. సోదాలు పూర్తున తర్వాత ఏసీబీ అధికారులు వంశీమోహన్‌ను అరెస్టు చేశారు.

ప్రభుత్వ భూములు ఫట్..

గతంలో అత్యంత కీలకమైన, కమర్షియల్ హబ్‌గా ఉన్న శేరిలింగంపల్లితో పాటు పలు ప్రాం తాల్లో ఆర్డీవో, తహసీల్దార్‌గా పనిచేసిన సమయంలో తన అధికారాన్ని దుర్వినియోగం చేసినట్లు ఏసీబీ ప్రాథమిక విచారణలో తేలింది. అత్యంత ఖరీదైన ప్రభుత్వ భూములను ప్రైవేట్ వ్యక్తులకు మళ్లించడం, రెవె న్యూ రికార్డుల్లో మార్పులు చేయించడం, బినామీల పేర్లతో రిజిస్ట్రేషన్లు జరిపించడం వంటి అక్రమాలకు పాల్పడినట్లు బలమైన ఆధారాలు లభ్యమయ్యాయి.

రంగారెడ్డి జి ల్లా అబ్దుల్లాపూర్‌మెట్ మండలం, పిగ్లీపురం గ్రామ రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 17లో ఉన్న సీలింగ్, అసైన్డ్, భూదాన్ ప్రభు త్వ భూముల్లోంచి సుమారు 8 ఎకరాల విలువైన భూమిని వంశీమోహన్ నిబంధనలకు విరుద్ధంగా నకిలీ రికార్డులతో తన మా మ పేరుతో రిజిస్ట్రేషన్ చేయించినట్లు ఏసీబీ గుర్తించింది. ఆ భూమిని ఒక ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపారికి డెవలప్‌మెంట్‌కు ఇచ్చారు.

ఈ క్విడ్ ప్రోకో వ్యవహారానికి ప్రతిఫలంగా సదరు రియల్టర్ నుంచి ఏకంగా 10 విలాసవంతమైన ఓపెన్ ప్లాట్లను తన కు టుంబ సభ్యుల పేరిట ‘గిఫ్ట్ డీడ్’ రూపంలో లంచంగా తీసుకున్నట్లు స్పష్టమైన ఆధారాలు దొరికాయి. వంశీమోహన్‌పై ఆదా యానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేసినట్లు ఏసీబీ ఉన్నతాధికారులు తెలిపారు. వనస్థలిపురంలోని వంశీమోహన్ నివాసంలో లభించిన పత్రాల ఆధారంగా హైద రాబాద్ పరిసర ప్రాంతాల్లో ఫ్లాట్లు, విల్లాలు, ఫామ్‌హౌస్, భారీగా వ్యవసాయ భూములు ఉన్నట్లు అధికారులు గుర్తించారు.

బ్యాంక్ అకౌంట్స్ చెక్ చేస్తున్నాం..

‘వంశీమోహన్ ప్రస్తుతం మేడ్చల్-మల్కాజ్‌గిరి యూఎల్సీ డిపార్ట్‌మెంట్‌లో డిప్యూటీ కలెక్టర్‌గా పనిచేస్తున్నారు. ఈయన 2019--23 మధ్య శేరిలింగంపల్లి తహసీల్దార్‌గా పనిచేసిన నాలుగేళ్లలో భూ లావాదే వీలపై భారీగా ఫిర్యాదులు వచ్చాయి. హైదరాబాద్‌తోపాటు ఆయన మామఉండే ఇతర జిల్లాల్లోనూ ఏకకాలంలో సోదాలు చేస్తు న్నాం. బ్యాంక్ అకౌంట్లు, లాకర్లు, థర్డ్ పార్టీల నుంచి రావాల్సిన సమాచారాన్ని సేకరిస్తున్నాం.

ఈ అవినీతి నెట్‌వర్క్‌లో ఇంకా ఎవరెవరి ప్రమేయం ఉందనే కోణంలో విచారణ జరుపుతున్నాం’ అని ఏసీబీ (సీఐయూ) డీఎస్పీ లక్ష్మీకాంత్‌రెడ్డి తెలిపారు. ఈ భారీ స్కాంలో మరికొందరు రెవెన్యూ అధికారులు, రాజకీయ నాయకులు, రియల్టర్ల పాత్రపైనా ఏసీబీ దృష్టిసారిం చింది. బ్యాంక్ లాకర్ల పరిశీలన అనంతరం అక్రమాస్తుల పూర్తి అధికారిక విలువను ప్రకటి స్తామని అధికారులు వెల్లడించారు. ఇంకా అబ్దుల్లాపూర్‌మెట్ తహసీల్దార్ కార్యాలయంలో తనిఖీలు కొనసాగుతున్నాయి. 

అబ్దుల్లాపూర్‌మెట్ తహసీల్దార్ కార్యాలయం రికార్డులు స్వాధీనం

డిప్యూటీ కలెక్టర్ వంశీమోహన్ అక్రమా ల మూలాలు వెలికితీసే క్రమంలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఇన్ ఛార్జ్ ఏసీబీ డీఎస్పీ ఆనంద్ కుమార్ ఆధ్వర్యంలో అధికారులు అబ్దుల్లాపూర్మెట్ తహసీల్దార్ కార్యాలయంలోనూ విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. పిగ్లీపూర్ పరిధిలోని 8 ఎకరాలు కొనుగో లు, రిజిస్ట్రేషన్లకు సంబంధించిన రికార్డులు, మ్యుటేషన్ ఫైళ్లను స్వాధీనం చేసుకున్నారు.