23 May, 2026 | 2:19 AM

ప్రైవేట్ పాఠశాలల ఫీజుల మోత!

23-05-2026 01:11 AM

చదువుల పేరుతో నిలువు దోపిడీ

పాఠ్యపుస్తకాలు, నోట్ బుక్స్ వారివద్దే కొనాలనే రూల్..?

పటాన్‌చెరు, మే 22: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలు అన్న తీరుగా కార్పొరేట్ పాఠశాలలు పనిచేస్తున్నాయి. సామాన్య జనాలకు ప్రైవేటు విద్య భారంగా మారింది. 15 రోజుల్లో పాఠశాలలు పునర్ ప్రారంభం కానున్నాయి. ఇప్పటి నుంచే ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు అడ్మిషన్ల పేరుతో హడావుడి చేస్తున్నాయి. పుస్తకాలు, స్కూల్ బ్యాగులు ఇలా విద్యార్థులకు అవసరమైన సామగ్రిని ప్రైవేట్ స్కూల్స్లో విక్రయించరాదని ప్రభుత్వం హుకూం జారీ చేసింది.

అయితే అందుకు విరుద్ధంగా ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు కొత్త ప్రణాళికలు రచిస్తున్నాయి. పాఠశాలల్లోనే పుస్తకాలు, నోట్ బుక్స్ ఇలా విద్యార్థులకు కావాల్సిన సామగ్రిని విక్రయిస్తున్నారు. నర్సరీ మొదలుకొని 10వ తరగతి వరకు పదుల సంఖ్యలో స్టడీ మెటీరియల్ అంటూ 3000 నుంచి 10,000 రూపాయలకు విక్రయిస్తూ ప్రతియేటా లక్షలాది రూపాయలు ఆర్జిస్తున్నారు.

ప్రభుత్వ నిబంధనలను భేఖాతరు చేస్తూ యథేచ్ఛగా పాఠశాలల్లోనే పుస్తకాలను విక్రయిస్తున్నప్పటికీ సంబంధిత అధికారులు అటువైపు కన్నెత్తి చూడకపోవటం గమనార్హం. పటాన్ చెరు, రామచంద్రాపురం, అమీన్ పూర్, బొల్లారం మండలాల్లో 100కు పైగా ప్రైవేట్ పాఠశాలలుండగా వాటిల్లో సుమారు 40 వేలకు పైగా విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు.

అధిక ఫీజులను నియంత్రించాల్సిన అధికారులు సైతం తమకేమి సంబంధం లేనట్లుగా వ్యవహరిస్తూ పాఠశాలల వైపు కన్నెత్తి చూడకపోవడంతో యాజమాన్యాలు ఫీజుల మోత మోగిస్తున్నారు. సంబంధిత అధికారులు ప్రైవేట్ పాఠశాల ల్లో అధిక ఫీజుల వసూళ్లపై దృష్టి సారించి నియంత్రించాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. 

కార్పొరేట్ దోపిడీని అరికట్టాలి

విద్యను ప్రైవేటు పాఠశాలలు వ్యాపారం చేస్తున్నాయి. పుస్తకాలు, ఫీజుల పేరుతో అడ్డుగోలుగా దోపిడీకి పాల్పడుతున్నాయి. ఎల్కేజీ రూ.30-50 వేల వరకు వసూలు చేయడమే కాకుండా పాఠ్యపుస్తకాలు, నోట్బుక్స్, దుస్తులు ఇలా విద్యార్థులకు అవసరమైన వాటిని విక్రయిస్తూ రూ.వేలకు వేలు సొమ్ము చేసుకుంటున్న ప్రైవేటు స్కూళ్లపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. నిబంధనలు పాటించని పాఠశాలల అనుమతులను వెంటనే రద్దు చేయాలని, అవసరమైతే సదరు పాఠశాలల యాజమాన్యాలపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.