కుట్రలు కూలాయి
- మేడిగడ్డ అంటే తెలంగాణకు మేటిగడ్డ, నీటిగడ్డ
- కాళేశ్వరంపై రేవంత్‌రెడ్డి అడ్డగోలు, అబద్ధపు ప్రచారాలకు చెంప చెల్లుమనిపించే తీర్పు
- అది పీసీ ఘోష్ కమిషన్ నివేదిక కాదు, పీసీసీ నివేదిక
- కాంగ్రెస్, బీజేపీ దొందుదొందే..
- కాళేశ్వరం పూర్తిగా కూలిపోయేలా కాంగ్రెస్ పార్టీ కుట్ర
- యాక్టింగ్ బంద్ చేసి వాటర్ లిఫ్టింగ్ మొదలు పెట్టాలి
- బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
హైదరాబాద్, ఏప్రిల్ 22 (విజయక్రాంతి): కాంగ్రెస్ పార్టీ ఇన్ని రోజుల పాటు కాళేశ్వరం ప్రాజెక్టుపైన చేసిన అన్ని కుట్రలకు హైకోర్టు ఇచ్చిన తీర్పుతో ముగింపు పడిందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. మేడిగడ్డ అంటే కుంగిన గడ్డ కాదు.. అది తెలంగాణకు ‘మేటిగడ్డ’, ‘నీటిగడ్డ’ అని ఆయన అభి వర్ణించారు. కాళేశ్వరాన్ని ‘కూలేశ్వరం’ అంటూ పిట్టల దొరల మాదిరి అడ్డగోలుగా అబద్ధపు ప్రచారాలు చేసిన కాంగ్రెస్ పార్టీ నేతలకు, సీఎం రేవంత్‌రెడ్డికి హైకోర్టు చెంప చెల్లుమనిపించే తీర్పు ఇచ్చిందన్నారు.
కూలింది కాళేశ్వరం కాదు అని, కాంగ్రెస్ పార్టీ గారడీ మాట లు, హస్తం పార్టీ చేసిన కుట్రలు కూలిపోయాయని కేటీఆర్ అన్నారు. పీసీ ఘోష్ కమిషన్ నివేదిక కాదు అది, పీసీసీ నివేదిక అని ఎప్పటి నుంచో చెబుతున్నామని, కాంగ్రెస్ పార్టీ కావాలనే కాలేశ్వరం ప్రాజెక్టు పైన కుట్రలు చేస్తున్నదని ముందు నుంచి తాము చెబుతున్న మాటలకు హైకోర్టు తీర్పు సాక్ష్యంగా నిలిచిందన్నారు. కాంగ్రెస్, బీజేపీ కలిసి ఆడిన కుట్రకు హైకోర్టు ఇచ్చిన తీర్పుతో సమాధానం దొరికిందన్నారు.
కాంగ్రెస్, బీజేపీ దొందుదొందేనని, ఆ రెండు పార్టీల మధ్య ఫెవికాల్ బంధం కొనసాగుతోందని విమర్శించారు. బుధవారం తెలంగాణ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు. కాళేశ్వరం పైన కాంగ్రెస్ చేసిన దుష్ప్రచారం హైకోర్టు ఇచ్చిన తీర్పుతో పటాపంచలైందన్నారు.
అబద్ధాలతో అద్భుతాల నిజాన్ని చాలాకాలం దాచలేరని, కాళేశ్వరం మహాత్మ్యాన్ని కూడా కనిపించకుండా చేయలేరని మళ్లీ తేలిపోయిందన్నారు. అంతిమ విజయం సత్యానిదే అని రుజువైంది. గోబెల్స్‌ను మించి దుష్ప్రచారం చేసిన ధూర్తులం దరికీ గుణపాఠం చెప్పే తీర్పును మన రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిందన్నారు. హైకోర్టుకు మా పార్టీ పక్షాన, మా అందరి పక్షాన, తెలంగాణ రైతాంగం పక్షాన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు.
కేసీఆర్ చరిత్రను ఎవరూ చెరిపేయలేరు
60 ఏళ్ల పాటు తెలంగాణ కరువుతో, సాగునీటి కొరతతో ఇబ్బందులు పడిన విషయాన్ని గుర్తించి, అయినా, కాళేశ్వరంపైన రాజకీయ రాబందుల మాదిరి వ్యవహరించిన కాంగ్రెస్ పార్టీ నేతలు ఈ తీర్పుతో సిగ్గు తెచ్చుకొని జ్ఞానోదయం కలిగి వెంటనే దానికి మరమ్మతులు చేయాలని కేటీఆర్ అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపైన కాంగ్రెస్ దుర్మార్గులే ఏ దో కుట్ర చేసి ఉంటారని, ఆ విషయం కూడా నిలకడగా తెలుస్తుందన్నారు.
రూ. 94,000 కోట్ల కాళేశ్వరం ప్రాజెక్టులో రెండు పిల్లర్లు కూలి రూ.400 కోట్ల మరమ్మతులు అవసరమయ్యాయని, వాటిని స్వయంగా కాంట్రా క్టింగ్ ఏజెన్సీ సంస్థనే తిరిగి కడతామన్నా వారిని బెదిరించి మరీ అడ్డుకొని కాళేశ్వరం పూర్తిగా కూలిపోయేలా కాంగ్రెస్ పార్టీ కుట్ర చేసిందన్నారు. కాంగ్రెస్, బీజేపీ కలిసి ఇన్ని రోజుల పాటు కాళేశ్వరం ప్రాజెక్టుపైన అడ్డగోలుగా కుట్రలు చేశాయని మండిపడ్డారు.
కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడి తెలంగాణ సాగునీటి పైన, రైతాంగ భవిష్యత్తు పైన కాంగ్రెస్, బీజేపీ కలిసి ఆడిన కుట్రలను హైకోర్టు తీర్పు బయటపెట్టిందన్నారు. గోదావరి నది ఉన్నం త కాలం కాళేశ్వరం ప్రాజెక్టు ఉంటుందని, కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిన చరిత్ర కేసీఆర్‌దే అని అన్నారు.
కాంగ్రెస్, బీజేపీది ఫెవికాల్ బంధం
తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీలు కలిసి పనిచేస్తున్నాయని, వారి మధ్య ఉన్నది ‘ఫెవికాల్ బంధం’ అని కేటీఆర్ విమర్శించారు. బండి సంజయ్ కాంగ్రెస్ పెద్దలకు మూటలు అందుతున్నాయని ఆరోపిస్తుంటే, ఆ మూటలను పట్టుకోవాల్సిన బాధ్యత కేంద్ర హోం మంత్రిది కాదా అని కేటీఆర్ ప్రశ్నించారు. ఇప్పటికైనా బండి సంజయ్ తాను ఒక కేంద్ర మంత్రిని అనే విషయాన్ని గుర్తించాలని, కరీంనగర్ గల్లీల్లో కార్పొరేటర్ లా మాట్లాడటం మానేసి, తన పదవికి తగ్గట్టుగా వ్యవహరించాలని హితవు పలికారు.
కేంద్రానికి దమ్ముంటే తెలంగాణ నుంచి ఏఐసీసీకి వెళ్తున్న ప్రతి పైసాను పట్టుకోవాలని సవాల్ విసిరారు. తెలంగాణలో అమలవుతున్న ‘ఆర్‌ఆర్ టాక్స్’ ఢిల్లీ పెద్దలకు చేరుతుంటే బీజేపీ నేతలు గాడిదలు కాస్తున్నారా? అని నిలదీశారు. కేంద్ర సహాయ మంత్రిగా ఉంటూ రేవంత్‌రెడ్డికి సహాయం చేయడం తప్ప, తెలంగాణ రాష్ట్రానికి బండి సంజయ్ ఒక్క రూపా యి అయినా తెచ్చారా? అని ప్రశ్నించారు.
కాంగ్రెస్ కుట్రలకు చెంపపెట్టు..
‘తెలంగాణ వరప్రదాయిని కాళేశ్వరం ప్రాజెక్టుపై కక్షగట్టిన కాంగ్రెస్ ప్రభుత్వానికి, సీఎం రేవంత్‌రెడ్డికి హైకోర్టు తీర్పు ఒక గట్టి చెంపపెట్టు’ అని కేటీఆర్ అభివర్ణించారు. భారత రాజ్యాంగానికి, చట్టాలకు విరుద్ధంగా ఎవరు వ్యవహరించినా దేశంలోని గౌరవ న్యాయస్థానాలు చూస్తూ ఊరుకోవని ఈ తీర్పుతో మరోసారి రుజువైందని పేర్కొన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న ఆర్టీసీ కార్మికు ల సమ్మెకు బీఆర్‌ఎస్ నైతిక మద్దతు తెలుపుతోందని కేటీఆర్ ప్రకటించారు. ఆర్టీసీ కార్మికు లు సమస్యలను పరిష్కరించాలన్నారు.






