అత్యంత ప్రాధాన్యతతో అంధుల పాఠశాల నిర్మాణాన్ని పూర్తి చేయాలి
ఖమ్మం, డిసెంబర్ 5 (విజయక్రాంతి): అంధుల విద్యాభివృద్ధి కోసం అత్యున్నత ప్ర మాణాలతో ప్రత్యేక పాఠశాలను ఏర్పాటు చేస్తున్నామని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు. శుక్రవారం జెడ్పీ సెంటర్ లోని ని జాంపేట్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఆవరణలో నూతనంగా ఏర్పాటు చేస్తున్న ప్రత్యే క అంధుల పాఠశాల నిర్మాణ పనులను జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ని ర్మాణ పనులను క్షుణ్ణంగా పరిశీలించి భవన నిర్మాణ నాణ్యత, ప్రహారీ గోడ గేట్, ప్రవేశ మార్గాలు, అంతర్గత గదుల రూపకల్పన, ఆర్కిటెక్చర్ ఆకృతిని విషయ నిర్ధారణతో మానిటర్ చేశారు.
తరగతి గదులు, నైపుణ్యాభివృద్ధి కోసం ఏర్పాట్లు, మ్యూజికల్ పార్క్, సదుపాయాల నమూనా మ్యాప్లు, డిజైన్ ఫో టోలను పరిశీలించి కలెక్టర్ పలు సూచనలు చేశారు. అంధులు పాఠశాలలో ప్రవేశించిన క్షణం నుంచి బయటికి వెళ్లే వరకు పూర్తిస్థా యి భద్రత, సౌలభ్యం లభించేలా నిర్మాణంలో ప్రతిదీ ఖచ్చితత్వంలో ఉండాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అంధుల వి ద్యా అవకాశం దృష్ట్యా ప్రత్యేక పాఠశాల ని ర్మాణానికి ప్రాధాన్యత ఇస్తూ, పనులను వేగవంతం చేసి అత్యుత్తమ నాణ్యతతో పూర్తి చే యాలని అన్నారు.
అంధ విద్యార్థులు స్వతంత్రంగా కదలాడేందుకు వీలుగా పాఠశాలను పూర్తిగా బారియర్ ఫ్రీ విధానంలో నిర్మించాల్సిన అవసరం ఉందని అన్నారు. పాఠశాల అంతటా టాక్టైల్ పాత్లు, గైడింగ్ రైలింగ్స్, రఫ్-సర్ఫేస్ మార్గాలు ఏర్పాటు చేయాలని సూచించారు.పాఠశాలలో ఏర్పాటు చేయనున్న సెన్సరీ రూమ్, సెన్సరీ గార్డెన్ అంధ విద్యార్థులలో స్పర్శ, శబ్దం, వాసన, దిశ అవగాహన వంటి సామర్థ్యాలను పెంచుతాయ ని కలెక్టర్ వివరించారు. హైదరాబాద్ లాం టి ప్రత్యేక విద్యా మోడళ్లను ఆధారంగా తీసుకుని ఈ సదుపాయాలు ఏర్పాటు చేయాల ని సూచించారు.అంధ విద్యార్థులకు పాఠశాలలో బ్రెయిల్ లిపి పుస్తకాలు, ఆడియో బుక్స్, లెర్నింగ్ డివైజ్లు తప్పనిసరిగా అందుబాటులో ఉండాలని అన్నారు.
నేటితరానికి అనుగుణంగా అంధుల్లో ముఖ్యమైన నైపుణ్యం, కంప్యూటర్ స్కిల్స్ కోసం ల్యాబ్ను స్మార్ట్ టెక్నాలజీతో ఏర్పాటు చేయాలని తెలిపారు. విద్యార్థులు సాఫ్ట్వేర్ స్క్రీన్ రీడర్లు, డిజిటల్ లెర్నింగ్ మాడ్యూల్స్ ద్వారా పాఠాలు నేర్చుకునేలా వాతావరణం ఉండాలన్నారు.విద్యుత్ సరఫరా విషయంలో ప్రమాదావకాశం లేకుండా చైల్ట్-సేఫ్ స్విచ్లు, హై క్వాలిటీ వైరింగ్, అనుకూలమైన లైటింగ్ సిస్టమ్ ఏర్పాటు చేయాలని అన్నారు.
అంధ విద్యార్థుల కోసం ప్రత్యేకమైన డెస్కులు, కుర్చీలు, నేర్చుకునే పరికరాలు వినియోగించాలన్నారు.అంధుల పాఠశాల పూర్తయిన తర్వాత ఖమ్మం జిల్లాలోని అంధ విద్యార్థులకు ఇది ఒక ఆధునిక విద్యా కేంద్రంగా నిలువాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఆశాభావం వ్యక్తం చేశారు.కలెక్టర్ వెంట జెడ్పీ సీఈఓ దీక్షా రైనా, పంచాయతీరాజ్ ఇఇ మహేష్ బాబు, ఏఈ చిరంజీవి, సంబంధిత విభాగాల అధికారులు తదితరులు పాల్గొన్నారు.






