బీసీ ఎమ్మెల్యే ఎదుగుదలను ఓర్వలేకే విమర్శలు
ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య
యాదగిరిగుట్ట, ఏప్రిల్ 19 : బీసీ ఎమ్మెల్యే ఎదుగుదలను చూసి ఓర్వలేక కొందరు స్థాయిని మరిచి విమర్శలు చేస్తున్నారని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య అన్నారు. ఆదివారం తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈమధ్య కొందరు వార్డు మెంబర్ గా కూడా గెలవని వారు, కులాలను అడ్డం పెట్టుకొని కొందరు, స్థాయిని మరిచి మరి కొందరు తనపై అసత్య ఆరోపణలు చేస్తున్నారన్నారు.
కొందరు అగ్రవర్ణాల వారు తనపై కుట్ర పన్నుతున్నారని, బీసీ నాయకుడిగా, ఎమ్మెల్యేగా, ప్రభుత్వ విప్ గా, డీసీసీ అధ్యక్షుడిగా ప్రతినిత్యం ప్రజలతో మమేకమై వారి సమస్యలను తెలుసుకుని పరిష్కరిస్తున్నాడని రాబోయే రోజుల్లో తమ ఉనికిని కోల్పోవాల్సి వస్తుందనే అక్కసుతోనే ఇటువంటి కుట్రలు చేస్తున్నారన్నారు.
ఇప్పటికైనా కుటిల రాజకీయాన్ని మరచి ఆలేరు నియోజకవర్గ అభివృద్ధిపై దృష్టి పెట్టాలని ఎన్నికల అప్పుడు మాత్రమే రాజకీయాలు చేయాలన్నారు. నా లక్ష్యం ఆలేరు అభివృద్ధి అని దీనికి అందరూ సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మదర్ డైరీ చైర్మన్ మధుసూదన్ రెడ్డి, మాజీ డిసిసిపి చైర్మన్ సంజీవరెడ్డి, మున్సిపల్ చైర్మన్ గుండ్లపల్లి వాణి భరత్ గౌడ్, వైస్ చైర్మన్ పరిగ రమ్య రామచందర్, కాంగ్రెస్ పార్టీ నాయకులు గుండ్లపల్లి భరత్ గౌడ్, బంధారపు బిక్షపతి గౌడ్, ఎరుకల హేమేందర్ గౌడ్, పెలిమెల్లి శ్రీధర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.






