31 August, 2026 | 6:58 PM

చేప ప్రసాదానికి పోటెత్తిన జనం

09-06-2024 12:46 AM
  • బత్తిని సోదరులతో కలిసి ప్రారంభించిన స్పీకర్, మంత్రి పొన్నం

చేప ప్రసాదం పంపిణీకి సకల సౌకర్యాలు

మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడి

లైన్లలో నిలబడి నిజామాబాద్ వాసి మృతి

ట్రాఫిక్ జాం, పోలీసుల భారీ బందోబస్తు

హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 8 (విజయక్రాంతి): ఏటా సంవత్సరం మృగశిర కార్తె రోజున బత్తిని కుటుంబసభ్యుల ఆధ్వర్యంలో జరిగే చేప ప్రసాదం పంపిణీ కార్యక్రమం హైదరాబాద్‌లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో శనివారం ప్రారంభమైంది. చేప ప్రసాదం తెలంగాణ నుంచే కాకుండా పొరుగు రాష్ట్రాల నుంచి కూడా ప్రజలు భారీగా పోటెత్తారు. గంటలకొద్ది లైన్లలో వేచి ఉన్నారు. శనివారం ఉదయం ఈ కార్యక్రమాన్ని బత్తిని సోదరులు హరినాథ్‌గౌడ్, అమర్నాథ్‌గౌడ్‌తో కలిసి శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్, మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారభించారు.

ఈ సందర్భంగా మంత్రి పొన్నం మాట్లాడుతూ 150 ఏండ్లుగా బత్తిని కుటుంబం ఏటా మృగశిర కార్తె రోజున చేప ప్రసాదం పంపిణీ చేస్తున్నదని తెలిపారు. చేప ప్రసాదంపై విశ్వాసంతో వివిధ రాష్ట్రాల నుంచి ప్రజలు తరలి వస్తున్నారని చెప్పారు. చేప ప్రసాదం కోసం వచ్చే ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం సకల ఏర్పాట్లు చేస్తున్నదని వెల్లడించారు. చేప పిల్లలను సరఫరా చేశామని, శానిటేషన్ పనులు చేయిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమానికి పలు స్వచ్ఛంద సంస్థలు చేస్తున్న కృషి అభినందనీయమని కొనియాడారు.

చేప ప్రసాదంపై విశ్వాసంతో సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలందరికీ మంచి జరగాలని శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ పేర్కొన్నారు. ఎన్నో ఏళ్లుగా దేశ, విదేశాల నుంచి ప్రజలు విశ్వాసంతో చేప ప్రసాదం కోసం వస్తున్నారని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అ న్నారు. అనంతరం మంత్రి పొన్నంకు బత్తిని హరినాథ్‌గౌడ్ చేప ప్రసాదం వేశారు. ఈ కార్యక్రమంలో జీహెచ్‌ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, రాజ్యసభ సభ్యుడు అనిల్‌కుమార్‌యాదవ్, ఎమ్మెల్సీ మహేష్‌కుమార్‌గౌడ్, ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మె ట్టు సాయికుమార్, బత్తిని కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

‘ప్రసాదం’.. విషాదం..

ప్రసాదం పంపిణీలో విషాదం చోటు చేసుకుంది. ప్రసాదం కోసం లైన్లలో నిలబడిన ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. నిజామాబాద్ జిల్లా సిరికొండ గ్రామానికి చెందిన రాజన్న (57) ఉదయం 7 గంటల నుంచే క్యూలైన్లో నిలబడ్డాడు. లైన్లో జరిగిన తోపులాటలో కిందపడిపోవడంతో స్పృహతప్పి పడిపోయాడు. స్థానికులు అతన్ని ఓ ప్రైవేటు దవాఖానకు తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు.

భారీ బందోబస్తు 

చేప ప్రసాదం కార్యక్రమానికి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో 1200 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటుచేశారు. ప్రజల రద్దీ ఎక్కువ కావడంతో నాంపల్లి మెయిన్‌రోడ్‌లో వాహనాలు కిలోమీటర్ మేర మెల్లగా సాగాయి. ట్రాఫిక్ పోలీసులు తీవ్రంగా శ్రమించినప్పటికీ పలు చోట్ల ట్రాఫిక్‌జాం అయింది. ఎగ్జిబిషన్ గ్రౌండ్‌కు వచ్చే ప్రజల కోసం హైదరాబాద్ జలమండలి ఆధ్వర్యంలో 5 సెంటర్లలో తాగునీటి వసతి కల్పించింది. 5 లక్షల వాటర్ ప్యాకెట్లను అందుబాటులో ఉంచారు. చేప పిల్లల కోసం 20 ట్యాంకర్ల ద్వారా నీటిని తీసుకువచ్చారు. జిల్లా వైద్య శాఖ ఆధ్వర్యంలో 6 సెంటర్లలో ప్రథమ చికిత్స కేంద్రాలను ఏర్పాటు చేశారు. సంత్ నిరంకారీ మిషన్ సేవాదళ్ ఆధ్వర్యంలో 400 మంది కార్యకర్తలు చేపమందు వేసేందుకు వాలంటరీ సేవలందించారు.