23 July, 2026 | 2:42 AM

అవుట్‌సోర్సింగ్ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి

23-07-2026 01:34 AM

నిజామాబాద్ జులై 22 (విజయ క్రాంతి): టీజీజీఈఎన్ సీఓ పరిధిలోని యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ (వైటీపీఎస్) లోని సీహెచ్ పి, ఏహెచ్ పి విభాగాల నిర్వహణ (ఓ&ఎం)ను కాంప్రహెన్సివ్ అవుట్సోర్సింగ్కు అప్పగించాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని తెలంగాణ పవర్ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ (టీజీపీఈజెఎసీ) తీవ్రంగా వ్యతిరేకించింది. వైటీపీఎస్ ఉద్యోగుల పోరాటానికి సంఘీభావం తెలుపుతూ రాష్ట్ర టీజీపీఈజెఎసీ పిలుపు మేరకు నిజామాబాద్ ఎస్‌ఈ కార్యాలయం పరిధిలో నిరసన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి.

ఉద్యమంలో భాగంగా 12వ రోజు ఎన్ పిడిసీఎల్ పరిధిలోని కార్యాలయాల్లో ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరయ్యారు. అలాగే ప్రతిరోజూమధ్యాహ్నం 1:00 గంటల నుంచి 2:00 గంటల వరకు డిస్కమ్, సర్కిల్, డివిజన్, సబ్-డివిజన్ కార్యాలయాల ముందు భోజన విరామ సమయంలో నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు.

ఈ సందర్భంగా పవర్ హౌస్ ఎస్సి కార్యాలయం ముందు నిర్వహించిన నిరసనలో టీజీపీఈజెఎసీ నాయకులు మాట్లాడుతూ, వైటీపీఎస్ లో సిహెచ్ పి, ఎహెచ్ పి విభాగాల అవుట్సోర్సింగ్ నిర్ణయాన్ని ప్రభుత్వం తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ నిర్ణయం ఉద్యోగుల భవిష్యత్తుకు, ప్రభుత్వ విద్యుత్ సంస్థల మనుగడకు గొడ్డలిపెట్టుగా మారుతుందని టీజీపీఈజెఎసీ చైర్మన్ రఘునందన్ పేర్కొన్నారు.

ఈ నిరసన కార్యక్రమంలో టీజీపీఈజెఎసీ జనరల్ సెక్రటరీ పి.గంగాధర్, కో-కన్వీనర్ తోట రాజశేఖర్, గంగారాం నాయక్, కాశీనాథ్, శ్రీధర్, రాజేందర్, చెన్నయ్య, పి. రాజి నాయక్తోతో పాటు మహిళా ఉద్యోగులు, విద్యుత్ శాఖ సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నిరసన సందర్భంగా ఉద్యోగులు ‘అవుట్సోర్సింగ్ వద్దు - ఉద్యోగ భద్రత ముద్దు,  టీజీపీఈజెఎసీ వర్ధిల్లాలి, ‘కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేశారు. టీజీపీఈజెఎసీ ఆధ్వర్యంలో ఈ ఆందోళనలు ప్రభుత్వం నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే వరకు కొనసాగుతాయని పేర్కొన్నారు