డంప్‌యార్డును ఆపాల్సిందే
- కొనసాగిన ప్రజల నిరసనలు, ధర్నాలు
- టవర్ ఎక్కి నిరసన తెలిపిన ప్రజలు
- బీజేపీ నేతల ముందస్తు అరెస్టు
- గుమ్మడిదల బంద్ విజయవంతం
సంగారెడ్డి, ఫిబ్రవరి 6 (విజయక్రాంతి)/పటాన్‌చెరు: సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం ప్యారానగర్‌లో డంప్‌యార్డు ఏర్పాటుకు వ్యతిరేకంగా గుమ్మడిదల, నల్లవల్లిలో ప్రజలు చేపట్టిన నిరనసలు ఉధృతంగా కొనసాగుతున్నాయి. గురువారం డంప్‌యార్డుకు వ్యతిరేకంగా వివిధ పార్టీలు, ప్రజలు గుమ్మడిదల బంద్‌కు పిలుపునివ్వడంతో వ్యాపార సముదాయాలు, పాఠశాలలు స్వచ్ఛందంగా ముసివేశారు.
గుమ్మడిదల పట్టణ ప్రజలు స్థానిక నాయకులతో కలిసి జాతీయ రహదారిపై నిరసన వ్యక్తం చేశారు. తహసీల్దార్ కార్యాలయం నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. నర్సాపూర్ ఎమ్మెల్యే సునితారెడ్డి ర్యాలీలో పాల్గొని అంబేద్కర్ విగ్రహానికి, రైతు సంఘం భవనంలో గాంధీ విగ్రహాలకు వినతి పత్రాలు అందజేశారు.
గుమ్మడిదల మండల బీజేపీ నాయకులు జాతీయ రహదారిపై బైఠాయించేందుకు ప్రయత్నం చేయగా పోలీసులు అరెస్టు చేసి చిద్రుప్పలోని జిల్లా పోలీస్ శిక్షణ కేంద్రానికి తరలించారు. జిన్నారం మండలానికి చెందిన బీజేపీ నాయకులను ఇండ్ల వద్దకు, పొలాల వద్దకు వెళ్లి ముందస్తు అరెస్టు చేశారు. గుమ్మడిదలలో పలువురు సెల్ టవర్ ఎక్కి నిరసన తెలిపారు.
నల్లవల్లిలో ఉదయం నుంచి సాయంత్రం వరకు రోడ్డుపై బైఠాయించారు. కొంత మంది యువకులు నల్లవల్లిలో సెల్ టవర్ ఎక్కి సాయంత్రం వరకు దిగలేదు. నిరసనల నేపథ్యంలో పోలీసులు గుమ్మడిదల, నల్లవల్లి గ్రామాలతో పాటు జాతీయ రహదారి వెంట భారీగా మొహరించారు. గుమ్మడిదల నర్సాపూర్ రహదారిపై నలవల్లి చౌరస్తాలో వందల మంది పోలీసులు పహారా కాస్తున్నారు.
నల్లవల్లి, ప్యారానగర్ వైపు వెళ్లే వారిని విచారిస్తున్నారు. డంప్‌యార్డు నిర్మాణం వైపు ఎవ్వరు వెళ్లకుండా పోలీసులు అడ్డుకుంటున్నారు. నర్సాపూర్ ఎమ్మెల్యే సునితారెడ్డి, సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, జిన్నారం మాజీ జడ్పీటీసీ కొలను బాల్‌రెడ్డి, బీఆర్‌ఎస్ జిల్లా నాయకులు గోవర్దన్‌రెడ్డి, వెంకటేశంగౌడ్, ఆదర్శ్‌రెడ్డి, గుమ్మడిదల బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు కొత్తపల్లి ప్రభాకర్‌రెడ్డి ఆందోళనలో పాల్గొన్నారు.
సంగారెడ్డి కలెక్టరేట్ ఎదుట ఎమ్మెల్యేల ధర్నా
డంపింగ్ యార్డు ఏర్పాటును నిలిపివేయలని నర్సాపూర్, సంగారెడ్డి ఎమ్మెల్యేలు సునీతారెడ్డి, చింతా ప్రభాకర్ డిమాండ్ చేశారు. గురువారం సంగారెడ్డి కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించి డీఆర్‌వో పద్మజారాణికి వినతిపత్రం అందచేశారు. అనంతరం క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు.
జీహెచ్‌ఎంసీ అధికారులు హైదరాబాద్ చెత్తను తీసుకువచ్చి వేయడంతో అటవీ ప్రాంతంలో పర్యావరణం దెబ్బతింటుందన్నారు. ప్రజలు తీవ్రంగా నష్టపోతారని ఆవేదన వ్యక్తం చేశారు. దుర్వాసన, కాలుష్యంతో చుట్టపక్కల గ్రామాల ప్రజలు అనారోగ్యానికి గురవుతారని చెప్పారు. భూముల ధరలు తగ్గిపోయి రైతులకు తీవ్ర నష్టం జరిగే అవకాశం ఉందన్నారు.
కాగా ప్యారానగర్‌లో డంపింగ్ ఏర్పాటు స్థలంలో సర్వే చేసి సరిహద్దులు చూపాలని కోర్టులో రిట్ పిటిషన్ దాఖలైందన్నారు. కోర్టు స్టే ఆర్డర్ ఉన్నా అధికారులు డంపింగ్ యార్డు పనులు ప్రారంభించారని చెప్పారు. కోర్టు అదేశాలను ధిక్కరించి పనులు చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
డంపింగ్ యార్డు ఏర్పాటు చేయడంతో నర్సాపూర్ సమీపంలో ఉన్న అర్బన్ పార్కు పక్కన ఉన్న రాయరావ్ చెరువు , పంట పొలాలు కాలుష్యతం కావడం ఖాయన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పందించి డంపింగ్ యార్డు పనులు నిలిపివేసేందుకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వారివెంట బీఆర్‌ఎస్ నాయకులు దేవేందర్‌రెడ్డి, బుచ్చిరెడ్డి, అదర్శరెడ్డి, బాల్‌రెడ్డి ఉన్నారు.






