22 April, 2026 | 9:31 AM

తల్లీ కొడుకులపై కత్తులతో దాడి

07-02-2025 12:10 AM

హైదరాబాద్ సిటీబ్యూరో, ఫిబ్రవరి 6 (విజయక్రాంతి): సికింద్రాబాద్ చిలకలగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం ఉదయం తల్లీ కొడుకులపై గుర్తు తెలియని దుండగులు కత్తులతో దాడి చేసి పరారయ్యారు. రక్తపు మడుగులో ఉన్న బాధితులను పోలీసులు గాంధీ ఆసుపత్రికి తరలించారు. వారి విషమంగా ఉన్నట్టు వైద్యులు చెపుతున్నారు.

చిలకలగూడ సీఐ బీ అనుదీప్ తెలిపిన వివరాల ప్రకారం.. మెట్టుగూడలో నివసించే రేణుక (50), యశ్వంత్ (30) తల్లీకొడుకులు. గురువారం ఉదయం 11 గంటలకు ఇంట్లో ఉన్న సమయంలో గుర్తు తెలియని దుండగులు ఇంట్లోకి చొరబడి ఇద్దరిపై కత్తులతో దాడి చేసి, పరారయ్యారు. స్థానికులు అందించిన సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని బాధితులను గాంధీ ఆసుపత్రికి తరలించారు.

రేణుక ఆరోగ్యం కొంత నిలకడగా ఉండగా, యశ్వంత్ ఆరోగ్యం విషమంగా ఉన్నట్టు వైద్యులు పేర్కొన్నారు. కాగా యశ్వంత్ రైల్వే కాంట్రాక్టర్‌గా పనిచేస్తున్నట్టుగా తెలుస్తుంది. దాడికి గల కారణాలను తెలియాల్సి ఉందని సీఐ అనుదీప్ తెలిపారు.