డ్యూటీ మారదు.. లూటీ ఆగదు!
మహాముదుర్లు.. వరంగల్ ఆర్‌ఎస్సైలు
- వసూళ్లే వారి డ్యూటీ?
ట్రాఫిక్‌లో తాత్కాలికంగా పోస్టింగ్
రెండేళ్లుగా పాతుకుపోయిన ఆరుగురు
ఉన్నతాధికారుల నిర్లక్ష్యం
బదిలీలు లేక అస్తవ్యస్తం
హనుమకొండ, జూన్ ౨౦ (విజయక్రాంతి) : ఆ పోలీస్ అధికారులు ఏఆర్ విభా గానికి చెందినవారు. పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో ఆర్‌ఎస్సైలుగా విధులు నిర్వర్తిస్తున్నారు. నక్సల్ కార్యకలాపాలు తగ్గుముఖం పట్టడంతో వారికి పెద్దగా పనిలేకుండా పోయిం ది. నగరంలో ట్రాఫిక్ సమస్య ఎక్కువగా ఉండటం, సరిపడా అధికారులు లేని కారణంగా ట్రాఫిక్ నియంత్రణకు వీరి సేవలు వినియోగించాలని ఉన్నతాధికారులు నిర్ణయించారు. రెండేళ్ల కిందట అప్పటి పోలీస్ కమిషనర్ ఆర్‌ఎస్సైల్లో కొందరిని ట్రాఫిక్ విభాగంలో నియమించారు.
మూడు నెలలకొకసారి ఆర్‌ఎస్సైలను మార్చుతూ ట్రాఫిక్ విభాగాన్ని చక్కదిద్దే ప్రయత్నాలు ప్రారంభించారు. ఇంకేముంది ట్రాఫిక్ విభాగంలో బాధ్యతలు చేపట్టిన కొందరు అధికారులు రెచ్చిపోయారు. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనే సామెతను ఒంట పట్టించు కున్నారు. ఏదైతే అదైంది. ఇది రెగ్యులర్ పోస్ట్ కాదు. ఒకవేళ మనం చేసే అవినీతి దందాల గురించి బాస్‌కు తెలిస్తే తిరిగి ఏఆర్ విభాగానికే పంపిస్తారు. నష్టం లేదుగా అనే ధోరణితో ఆర్‌ఎస్సైలు అందిన కాడికి దండుకుంటున్నట్లు సమాచారం. ప్రస్తుతం ట్రాఫిక్ విభాగంలో పనిచేస్తున్న ఆర్‌ఎస్సైలు బాధ్యతలు చేపట్టి రెండేళ్లు కావస్తుండగా బదిలీలు లేకపోవడం ఆందోళన కలిగిస్తోంది.
వసూల్ రాజాలు!
ఏఆర్ విభాగంలో ఆర్‌ఎస్సైలు ఎక్కువ సంఖ్యలో ఉండటం, వీరికి అక్కడ అంతగా పనిలేని కారణంగా కొందరిని ట్రాఫిక్ విభాగానికి పంపడంతో కొత్త సమస్యలు తలెత్తిన ట్లు తెలుస్తోంది. వాస్తవానికి ఆర్‌ఎస్సైలకు ట్రాఫిక్ విధులతో సంబంధం లేనప్పటికీ కమిషనర్ ఆదేశాల మేరకు బాధ్యతలు చేపట్టిన కొందరు అధికారులు ముదిరిపోయి నట్లు ఆరోపణలున్నాయి. ట్రాఫిక్ లో చలానాలు, డ్రంకెన్ డ్రైవ్‌ల పేరిట వసూళ్లకు అలవాటు పడిన కొందరు ఆర్‌ఎస్సైలు ఉన్నతాధికారులను మచ్చిక చేసుకుని రెండేళ్లుగా ఇక్కడే కొనసాగుతున్నారు. ఇసుక ట్రాక్టర్లు, లారీలు, వైన్‌షాపులు, బార్లు, బిర్యానీ హోటళ్లు, ఫుట్‌పాత్‌లపై షాపులు నిర్వహిస్తున్న చిరువ్యాపారుల నుంచి నెలవారీగా మామూళ్లు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి.
డ్రంకెన్ డ్రైవ్‌లో పట్టుబడిన వారి నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకుని కేసులు లేకుండానే వదిలిపెడుతున్నట్లు సమాచారం. బిర్యానీ హోటళ్ల ఎదుట ఇష్టారాజ్యంగా వాహనాలు పార్కిం గ్ చేస్తున్నప్పటికీ వారిచ్చే మామూళ్లు, బిర్యానీ ప్యాకెట్లకు అలవాటు పడి చూసీ చూడనట్లుగా వవ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. అంతేగాకుండా కరీంనగర్ నుంచి ఖమ్మం వైపు వెళ్లే భారీ వాహనాలకు నేరుగా వెళ్లనివ్వకుండా డైవర్షన్ పేరిట డబ్బులిచ్చిన వాహనాలను మాత్ర మే వదిలేస్తున్నట్లు సమాచారం. వీళ్లకు నచ్చిన సిబ్బందిని నియమించుకుని వాళ్ల చేత డబ్బులు వసూలు చేయిస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
ఉన్నతాధికారుల నిర్లక్ష్యం?
తాత్కాలికంగా ట్రాఫిక్ విభాగంలో చేరిన ఆర్‌ఎస్సైలు వ్యవస్థను భ్రష్టు పట్టిస్తుంటే ఉన్నతాధికారులు నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్న తీరు అనుమానాలకు తావిస్తోంది. కమిషనరేట్ పరిధిలో వరంగల్, హనుమకొండ, కాజీపేట కలుపుకుని మూడు సర్కిళ్లు ఉన్నాయి. ఈ మూడు సర్కిళ్లకు ముగ్గురు ఇన్‌స్పెక్టర్లు ఉన్నారు. వీరి పరిధిలో ముగ్గురు ఇద్దరు చొప్పున మొత్తం ఆరుగురు ఆర్‌ఎస్సైలు విధుల్లో ఉన్నారు. ట్రైసిటీని మానిటరింగ్ చేసేందుకు ఒక ఏసీపీ స్థాయి అధికారి ఉన్నాడు. నగరంలో ఇంత పెద్ద వ్యవస్థ ఉన్నప్పటికీ నిత్యం పలు సమస్యలు తలెత్తుతూనే ఉన్నాయి.
ప్రధానంగా పెద్దపెద్ద షాపింగ్ మాల్స్, వాణిజ్య వ్యాపార సముదాయాల ముందు ఇష్టారాజ్యంగా వాహనాలు పార్కింగ్ చేస్తున్నప్పటికీ పట్టించుకునే నాథుడే కరువయ్యాడనే విమర్శలు లేకపోలేదు. కానీ చిరువ్యాపారాలు నిర్వహించే వారి పట్ల మాత్రం జులుం ప్రదర్శిస్తున్న ఆర్‌ఎస్సైలు ట్రాఫిక్ ఆంక్షల పేరిట వసూళ్లకు దిగుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి ఆర్‌ఎస్సైల పనితీరుపై నిఘా పెట్టి ట్రాఫిక్ విభాగం నుంచి వారిని తొలగించాలనే డిమాండ్లు వ్యక్తమవుతున్నాయి.






