బీజేపీ బలప్రదర్శన
- కాషాయ మయమైన జంటనగరాలు
సెల్యూట్ తెలంగాణ పేరుతో భారీ ర్యాలీ
కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి ఘన స్వాగతం
బేగంపేట నుంచి నాంపల్లి వరకు సాగిన ర్యాలీ
హైదరాబాద్, జూన్ 20 (విజయక్రాంతి): తెలంగాణలో 8 ఎంపీ సీట్లు గెలిచిన బీజేపీ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో గురువారం బలప్రదర్శన చేసింది. కేంద్ర మంత్రులుగా అధికారం చేపట్టిన తర్వాత తొలిసారి రాష్ట్రానికి వచ్చిన కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌కి స్వాగతం పలికేందుకు సెల్యూట్ తెలంగాణ పేరుతో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి బీజేపీ శ్రేణులు భారీగా తరలివచ్చారు. బేగంపేట విమానాశ్రయం నుంచి సాయంత్ర 5.15 గంటలకు ప్రారంభమైన ర్యాలీ, రాత్రి ౯ గంటలకు నాంపల్లిలోని పార్టీ ప్రధాన కార్యాలయానికి చేరుకొన్నది. దారి పొడవునా నేతలు ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు.
కళాకారుల ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అభిమానులు, కార్యకర్తలు తమ నేతల కటౌట్లు పట్టుకుని ర్యాలీలో హల్‌చల్ చేశారు. బేగంపేట, రసూల్‌పుర, ప్యారడైజ్ సర్కిల్, రాణిగంజ్, ముషీరాబాద్, ఆర్టీసీ ఎక్స్‌రోడ్స్, హిమాయత్ నగర్, అబిడ్స్ మీదుగా సుమారు 3 గంటల పాటు సాగిన ర్యాలీ రాత్రి 9 గంటలకు పార్టీ రాష్ట్ర కార్యాలయానికి చేరుకుంది. పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలు శిల్పారెడ్డి ఆధ్వర్యంలో మహిళా నేతలు, కార్యకర్తలు బతుకమ్మలతో తరలివచ్చి నేతలకు స్వాగతం పలికారు.
ఎంపీలకు ఘన సన్మానం
బీజేపీ రాష్ట్ర ఎంపీలను కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్ ఘనంగా సన్మానించారు. వారికి ప్రధాని మోదీ పేరిట తీర్చిదిద్దిన మెమెంటోలను అందించారు. ఎంపీలు కొండా విశ్వేశ్వర్ రెడ్డి, ఈటల రాజేందర్, గోడం నగేష్, ధర్మపురి అర్వింద్, రఘునందన్ రావు, డీకే అరుణను సన్మానించారు. ఎమ్మెల్యేలు వెంకటరమణా రెడ్డి, రాకేష్ పటేల్, పాల్వాయి హరీష్, సూర్యనారాయణ, రామారావు పటేల్, రాజ్యసభ ఎంపీ కె లక్ష్మణ్‌ను సైతం సన్మానించారు. ఈ కార్యక్రమానికి బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యే రాజాసింగ్ హాజరు కాలేదు. బేగంపేట విమానాశ్రయం నుంచి కేంద్ర మంత్రుల ర్యాలీలో పాల్గొన్న ఎమ్మెల్యే పాయల్ శంకర్ సన్మాన కార్యక్రమంలో కనిపించలేదు.






