2 May, 2026 | 1:06 PM

కుదిపేస్తున్న యూరియా కొరత

30-08-2025 12:00 AM

మేకల ఎల్లయ్య :

యూరియా కొరత తెలంగాణను కుదిపేస్తుం ది. రాష్ట్రంలో యూరియా సంక్షోభం కేవలం ఆర్థికపరమైన సమస్యకు పరిమితం కాకుండా వ్యవసాయం నుంచి సామాజిక సంక్షోభం వైపు అడుగులు వేయిస్తోంది. ఈ పరిస్థితికి ప్రత్యక్ష ఉదాహరణ సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గం. వర్షా లు సమృద్ధిగా కురవడంతో ఆశగా పంట లు వేసిన రైతులు, ఇప్పుడు పంటలకు అత్యంత కీలకమైన యూరియా దొరక్క దిక్కుతోచని స్థితిలో పడ్డారు.

నియోజకవర్గంలోని దాదాపు 64,200 హెక్టార్ల సాగు విస్తీర్ణానికి ఈ సీజన్‌లో 15,800 టన్నుల యూరియా అవసరం కాగా, కేవలం 9,450 టన్నులు మాత్రమే లభించింది. ఇది సుమారు 40 శాతం లోటును సూచిస్తోంది. యూరియా కొరత కారణంగా పం టలు పసుపు రంగులోకి మారిపోతున్నాయి. దీంతో దిగుబడిపై రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఈ సంక్షోభం హుస్నాబాద్‌కే పరిమితం కాలేదు.

కరీంనగర్, నల్గొండ, రాజన్న- సిరిసిల్ల, మహ బూబాబాద్ జిల్లాలకూ విస్తరించింది. రైతులు తెల్లవారుజాము నుంచే ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (పీఏసీఎస్) వద్ద, ఇతర విక్రయ కేంద్రాల వద్ద క్యూలో నిలబడుతున్నారు. అన్ని ప్రాంతా ల్లో రైతులు తమ క్యూ స్థానాలను కోల్పోకుండా, చెప్పులు, ఆధార్ కార్డులు, పాస్ బుక్‌లను ఉంచి వెళ్లడం యూరియా కొరతను స్పష్టం చేస్తుంది.

ఇది వ్యవసాయ సరఫరా లోపం మాత్రమే కాదు, డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థపై రైతుల విశ్వాసం కోల్పోయేలా వ్యవస్థాగత వైఫల్యం నుంచి సామాజిక సంక్షోభంగా మారుతున్న తీరు ను ప్రతిబింబిస్తోంది. పొలాల్లో పంటలు పసుపు రంగులోకి మారడం వలన దిగుబడి 10 నుంచి -15 శాతం తగ్గుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇది రైతుల ఆదాయానికి భారీ నష్టాన్ని కలిగించడమే కాకుండా, దీర్ఘకాలంలో రాష్ర్ట ఆహార భద్రతపై కూడా ప్రతికూల ప్రభావాన్ని చూపే అవకాశముంది.

కొరతకు కారణాలేంటి?

తెలంగాణలో యూరియా సంక్షోభానికి అనేక కారణాలున్నాయి. ఈ సీజన్‌లో అసాధారణంగా పెరిగిన సాగు విస్తీర్ణం ప్ర ధాన కారణం. ఆగస్టు 13, 2025 నాటికి, రాష్ర్టంలో వరి సాగు విస్తీర్ణం 4,520,974 ఎకరాలుగా నమోదైంది. గత ఏడాది ఇదే సమయానికి ఇది 3,160,699 ఎకరాలు మాత్రమే. అంటే, సాగు విస్తీర్ణం ఒక ఏడాదిలోనే 72.36 శాతానికి పెరిగింది. వర్షా లు సకాలంలో కురవడం, ప్రాజెక్టుల నుం చి నీటిని విడుదల చేయడం వంటి కారణాల వల్ల సాగు పెరిగినప్పటికీ, ఊహించ ని డిమాండ్‌ను ముందుగానే అంచనా వేసి సరఫరాను పెంచడంలో కేం ద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు విఫలమయ్యాయి.

సాగు విస్తీర్ణంలో ఈ పెరుగుదల, యూరియా సరఫ రా వ్యవస్థపై తీవ్ర ఒత్తిడిని తెచ్చింది. రాష్ర్ట స్థాయిలో అధికారిక గణాంకాల్లో కూడా ఈ లోపం స్పష్టంగా కనిపిస్తోంది. రాష్ర్ట వ్యవసాయ శాఖ ప్రకారం, ఖరీఫ్ 2025 సీజన్‌కు రాష్ర్ట అవసరం 10.48 లక్షల మె ట్రిక్ టన్నులు (ఎల్‌ఎంటీ). దీనికి కేంద్రం కేటాయించింది 9.8 ఎల్‌ఎంటీ మాత్రమే. అయితే వాస్తవ సరఫరాలో పెద్ద లోటు ఉంది. రాష్ర్ట వ్యవసాయ మంత్రిత్వ శాఖ ప్రకారం ఏప్రిల్ మధ్య కాలంలో 8.30 ఎల్‌ఎంటీ పంపిణీ చేయాల్సి ఉండ గా.. 5.62 ఎల్‌ఎంటీ మాత్రమే రాష్ట్రానికి చేరింది.

ఇది 2.69 ఎల్‌ఎంటీ లోటును సూచిస్తోంది. మరోవైపు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఈ ఆరోపణలను ఖండిస్తూ.. సీజన్ ప్రారంభంలో తెలంగాణలో 2.04 ఎల్‌ఎంటీ యూరియా నిల్వలు ఉన్నాయ ని, రాష్ర్ట ప్రభుత్వం అనవసరమైన భయా న్ని సృష్టించిందన్నారు. సంక్షోభానికి మ రో ప్రధాన కారణం రామగుండం ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ (ఆర్‌ఎఫ్ సీఎల్) ప్లాంట్ తాత్కాలికంగా మూత పడ డమే.

ఈ ప్లాంటును ఆగస్టు 14 నుంచి వ చ్చే నెల 1 వరకు సాంకేతిక సమస్యల కారణంగా మూసివేశారు. దీంతో ఆగస్టు నెల లో రావాల్సిన 65 వేల టన్నుల్లో 41 వేల టన్నుల యూరియా సరఫరాకు అంతరాయం ఏర్పడింది. దీనికి తోడు అంత ర్జాతీయ సరఫరా ఆలస్యం కూడా సంక్షో భాన్ని మరింత తీవ్రతరం చేసింది. రష్యా యుద్ధం, ఇరాన్ ఘర్షణలు, ఎర్ర సముద్రంలో షిప్పింగ్ అంతరాయాల వంటి సమస్యల వల్ల దిగుమతులు ఆలస్యమయ్యాయి. 

వ్యాపారుల బ్లాక్ దందా

ఒకవైపు రైతులు యూరియా కోసం గంటల తరబడి క్యూలలో నిలబడి నిరాశతో వెనుదిరుగుతుంటే.. మరోవైపు బ్లాక్ మార్కెట్ వ్యాపారులు అదే యూరియాను భారీ ధరలకు అమ్ముకుంటూ లాభాలు ఆర్జిస్తున్నారు. ప్రభుత్వం సబ్సిడీపై రైతులకు రూ.268కి ఇచ్చే 50 కిలోల యూ రియా బస్తా, బ్లాక్ మార్కెట్‌లో రూ.500 నుంచి రూ.700 వరకు అమ్ముడవుతోందనే ఆరోపణలు వస్తున్నాయి. రైతులు, రైతు సంఘాల నాయకులు దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఈ అక్రమ వ్యాపారానికి స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారుల అండ దండలు ఉన్నాయని ఆరోపిస్తున్నారు. యూరియా బ్లాక్ మార్కె ట్ దందాను అరికట్టడానికి కేంద్ర ప్రభు త్వం ‘నీమ్ కోటెడ్’ యూరియాను ప్రవేశపెట్టింది. నీమ్ కోటింగ్ చేయడం వల్ల యూరియా వ్యవసాయేతర వినియోగానికి పనికిరాదని భావించినప్పటికీ, బ్లాక్ దందా కొనసాగుతోంది.

ఈ సాంకేతిక పరిష్కారం పూర్తి స్థాయిలో విజయం సాధించలేదనేది వాస్తవం. సబ్సిడీ విధానంలోనే లోపం ఉందనే విషయాన్ని సూచిస్తోంది. దీని ఫలితంగా యూరియా నిల్వలను, సరఫరాను పర్యవేక్షించడంలో అధికారులు వైఫల్యం చెందుతున్నారు. ఇది కేవలం సాంకేతిక లోపం మాత్రమే కాదు.. పర్యవేక్షణ, అమల్లో ఉన్న అంతరాయాలకు అద్దం పడుతోంది.

పరిష్కార మార్గాలు

ప్రస్తుత యూరియా సంక్షోభానికి పరిష్కార మార్గాలు అవసరమైనప్పటికీ.. దీర్ఘ కాలిక విధానపరమైన మార్పులు అవస రం. యూరియాపై రైతులు అధికంగా ఆధారపడడంతో నేల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. పంటలను తెగుళ్లకు గురిచేస్తుంది. దీనికి ప్రత్యామ్నాయంగా, వ్యవసాయ నిపుణులు నానో యూరియా, సమగ్ర పోషక నిర్వహణ పద్ధతులను ప్రోత్సహించాలని సూచిస్తున్నారు. నానో యూరియా సంప్రదాయ యూరియాకు ఒక సమర్థవంతమైన ప్రత్యామ్నాయం.

కేవలం రూ. 225కే లభించే అర లీటరు నానో యూరి యా బాటిల్ ఒక ఎకరానికి సరిపోతుంది. దీనిని వ్యవసాయ డ్రోన్‌లు, స్ప్రేయర్‌ల ద్వారా పంటపై నేరుగా పిచికారీ చేయవచ్చు. దీని వల్ల యూరియా సామర్థ్యం పెరగడమే కాకుండా, నేల ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. నానో యూరియా వినియోగాన్ని ప్రోత్సహించడానికి కేంద్రం దేశవ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు, క్షేత్రస్థాయి ప్రదర్శనలు నిర్వహిస్తోంది. 

యూరియా ధర రూ.268కు, కాంప్లెక్స్ ఎరువుల ధర రూ.1500కు మధ్య ఉన్న భారీ వ్యత్యాసం కూడా యూరియాపై రైతులు అధికంగా ఆధారపడటానికి మరో ముఖ్య కారణం. తక్షణ చర్యల కింద కేంద్ర ప్రభుత్వం వెంటనే ఆర్‌ఎఫ్‌సీఎల్ ప్లాంట్ పనితీరును సమీక్షించి, సరఫరాను సాధారణ స్థితికి తీసుకురావాలి. అవసరమైతే ఇతర రాష్ట్రాల నుంచి అదనపు యూరియాను కేటాయించాలి.

రాష్ర్ట ప్రభుత్వం బ్లాక్ మార్కెటింగ్‌ను నివారించడానికి కఠినమైన చర్యలు తీసుకోవాలి. అధికారిక దుకాణాల్లో సరఫరాను పెంచాలి. దీర్ఘకాలికంగా యూరియా సబ్సిడీ విధానాన్ని సమీక్షించాలి. కేవలం యూరియాపైనే సబ్సిడీ ఇవ్వడం వల్ల కలిగే దుష్ర్పభావాలను పరిగణనలోకి తీసుకుని, సమగ్ర పోషక నిర్వహణ (ఐఎన్‌ఎం) పద్ధతులను, నానో యూరియా వంటి ప్రత్యామ్నాయాలను ప్రోత్సహించాలి.

రైతుల భవిష్యత్తును కాపాడాలంటే ప్రభుత్వాలు.. రాజకీయాలను పక్కన పెట్టి, శాస్త్రీయ దృక్పథంతో, దీర్ఘకాలిక ప్రణాళికలతో వ్యవసాయ విధానంలో సమూల మార్పులు తీసుకురా వాలి. లేదంటే రైతుల ఆశల పంటలు పసుపు రంగులోకి మారడం అనివార్యం.

 వ్యాసకర్త సెల్ : 9912178129