ఎర్లీ బర్డ్ టార్గెట్ రూ. 800 కోట్లు

19-04-2024 01:31:34 AM

18 రోజుల్లో రూ. 310 కోట్లు వసూలు

5 శాతం రాయితీతో ఈనెల 30వరకు గడువు


హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 12 (విజయక్రాంతి) : బల్దియాలో ఆర్థిక ఇబ్బందులను అధిగమించేందుకు కొన్నేళ్లుగా ఎర్లీ బర్డ్ పథకాన్ని అమలు చేస్తున్నారు. ప్రతి ఆర్థిక సంవత్సరం చివరినాటికి చెల్లించాల్సిన ఆస్తి పన్నును, ఈ ఏడాది ప్రారంభంలోనే చెల్లింపుదారుల నుంచి జీహెచ్‌ఎంసీ వసూలు చేస్తోంది. ట్యాక్స్ ముందస్తుగా చెల్లించిన వారికి ఆస్తిపన్నులో 5శాతం రాయితీ సౌకర్యాన్ని కల్పిస్తోంది. ఎర్లీబర్డ్ ద్వారా గతేడాది రూ. 700కోట్లు వసూలయ్యాయి. వీటి ద్వారా జీహెచ్‌ఎంసీ పాలక మండలి నిర్వహణ, ఉద్యోగుల, పెన్షనర్ల వేతనాలు, పలు అభివృద్ధి కార్యక్రమాలకు కేటాయిస్తున్నారు. ఈ స్కీం బల్దియాకు ఆర్థిక కష్టాలను గట్టెక్కించేందుకు ఊరటనిస్తుండటంతో ఈ ఏడాది కూడా ఎర్లీ బర్డ్ ద్వారా ఆస్తిపన్ను వసూలు చేయాలని బల్దియా భావించింది. ఈ నెల 30వరకూ 5శాతం రాయితీ సదుపాయంతో జీహెచ్‌ఎంసీ గడువును విధించింది. 

ఈ ఏడాది రూ. 800 కోట్ల టార్గెట్

గ్రేటర్ హైదరాబాద్‌లో దాదాపు  19లక్షల నిర్మాణదారుల నుంచి ఆస్తిపన్ను వసూలు అవుతోంది. గతేడాది 2022 మొత్తం ఆస్తిపన్ను రూ. 1660.38కోట్లను వసూలు చేసింది. 2023 ఏడాది లో రూ. 2100కోట్ల వసూలును టార్గెట్ పెట్టుకోగా, రూ. 1947.87కోట్లు వసూలయ్యాయి. జీహెచ్‌ఎంసీ ఇప్పటి దాకా వసూలైన ఆస్తిపన్ను వసూళ్లలో ఇది రికార్డ్. అంతే కాకుండా, ఈ మొత్తం 2022 వసూలైన రూ. 1660కోట్ల కంటే రూ. 254.49కోట్లు అదనం. 2023 ఆర్థిక ఏడాది ప్రారంభం (ఏప్రిల్ నెల)లోనే ఎర్లీ బర్డ్ ద్వారా రూ. 700కోట్లు వసూలు చేయగా, ఒక్క మార్చి నెలలోనే రూ. 500కోట్లు వసలు చేశారు. ఆర్థిక సంవత్సరం ఆఖరి రోజు 2024 మార్చి 31న రూ. 123కోట్లు కలెక్షన్ అయ్యాయి. వన్‌టైం సెటిల్మెంట్ ద్వారా మరో రూ. 319.59కోట్లు వసూలు అయ్యాయి. ఇదిలా ఉండగా, 2024 25సంవత్సరానికి రూ. 2500కోట్లను ఆస్తిపన్ను వసూలు చేయాలని జీహెచ్‌ఎంసీ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ మొత్తంలో కేవలం ఎర్లీబర్డ్ స్కీం ద్వారానే చెల్లింపుదారుల నుంచి ఆర్థిక సంవత్సరం ప్రారంభంలోనే రూ. 800కోట్లు వసూళ్లు చేయాలని నిర్ధేశించుకుంది. 

18 రోజుల్లో  రూ. 310  కోట్లు వసూలు 

బల్దియాలో ప్రతి ఏడాది 5శాతం రాయితీతో అమలు చేస్తున్న ఎర్లీబర్డ్ పథకంతో ఆశించిన ఫలితాలు వస్తున్నట్టుగా జీహెచ్‌ఎంసీ భావిస్తోంది. దీంతో ఎర్లీ బర్డ్ పథకాన్ని ఈ ఆర్థిక సంవత్సరం కూడా అమలు చేయాలని నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా గతేడాది ఎర్లీ బర్డ్ ద్వారా వసూలైన రూ. 700కోట్ల కంటే మరో రూ. 100కోట్లను అదనంగా చేర్చి మొత్తం రూ. 800కోట్లను వసూలు చేయాలని లక్ష్యంగా ఎంచుకున్నారు. దీంతో 2024 ఆర్థిక ఏడాది ప్రారంభమైన ఏప్రిల్ 1నుంచి 30వరకూ ఎర్లీబర్డ్ ద్వారా 5శాతం రాయితీ సదుపాయంతో ఆస్తిపన్ను సేకరిస్తున్నారు. ఇప్పటి వరకూ 18రోజుల్లో మొత్తం రూ. 3120కోట్లు ఆస్తిపన్ను వసూలైనట్టు అధికారులు చెబుతున్నారు. ఈసారి ఏప్రిల్ మాసంలో అత్యధిక ప్రభుత్వ సెలవులు రావడంతో ఈ పథకం ద్వారా నిర్దేశించిన లక్ష్యాన్ని జీహెచ్‌ఎంసీ చేరుతుందా లేదో చూడాల్సి ఉంది. ఇప్పటికే రూ. 310కోట్లు వసూలు చేసిన జీహెచ్‌ఎంసీకి మిగతా రూ. 490కోట్లు వసూలు చేయడానికి ఇంకా 11రోజుల గడువు మాత్రమే ఉంది. ఈ 11రోజుల్లోనూ 4సెలవులు ఉన్నాయి. దీంతో ఈ ఏడాది ఎర్లీ బర్డ్ టార్గెట్‌ను బల్దియా రీచ్ అవుతోందా లేదా చూడాల్సి ఉంది. ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకుని 5శాతం పన్ను రాయితీని చెల్లింపుదారులు సద్వినియోగం చేసుకోవాలని జీహెచ్‌ఎంసీ కోరుతోంది.