కూలిపోయే ప్రాజెక్ట్‌పై కమీషన్ తిన్నవ్!
- దబాయించుడు తప్ప పనిచేయడం చేతకాదు
- పదివేల కోట్లు దోచుకున్న దొంగ హరీశ్‌రావు
- రోడ్ల నిర్మాణంపై బీఆర్‌ఎస్‌కు ఆలోచనే లేదు
- అసెంబ్లీలో మంత్రి కోమటిరెడ్డి ఫైర్
హైదరాబాద్, డిసెంబర్ 18 (విజయక్రాంతి): గత ప్రభుత్వానికి పైసలొచ్చే ప్రాజె క్టులపై తప్ప రోడ్ల అభివృద్ధిపై ఆలోచనే లేద ని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పదేళ్లలో రాష్ట్రంలోని రోడ్లను విధ్వంసం చేశారని విమర్శించారు. బుధవారం అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సందర్భంగా కరీంనగర్ రహదారిని జాతీయ రహదారిగా మార్చడంపై ఎమ్మెల్యే మదన్‌మోహన్‌రావు అడిగిన ప్రశ్నకు మంత్రి మాట్లాడారు.
ఈ రహదారికి సంబంధించి కేంద్రానికి ప్రతిపాదనలు పంపామని తెలిపారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా రాష్ట్రంలో గుంతల్లేని రోడ్లే లేవని ఎద్దేవా చేశారు. ఉప్పల్‌లోని ఏడు కిలోమీటర్ల ఫ్లుఓవర్‌ను పూర్తి చేయకుండా ఏళ్ల తరబడి దాటవేశారని విమర్శించారు. మాజీ సీఎం కేసీ ఆర్ ఫాం హౌస్‌కు మాత్రం రూ.700 కోట్ల తో ఆరు లేన్ల ఎక్స్‌ప్రెస్ హైవే వేసుకున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో 98 శాతం రోడ్ల పనులు తామే పూర్తి చేశామని మాజీ మంత్రి ప్రశాంత్‌రెడ్డి చెప్పగా.. 98 శాతం మీరే చేస్తే మాకేం పని ఉంటుందని మంత్రి ఎద్దేవా చేశారు.
హరీశ్‌రావుకు దబాయించడం తప్ప పనిచేయడం రాదన్నారు. కూలి పోయే కాళేశ్వరం ప్రాజెక్టుపై కమిషన్ తీసుకున్న చరిత్ర మీదని హరీశ్‌రావును ఉద్దేశించి సంచలన ఆరోపణలు చేశారు. ఓఆర్‌ఆర్ నిర్మించి హైదరాబాద్‌ను ప్రపంచపటంలో పెట్టిందే కాంగ్రెస్ ప్రభుత్వమని స్పష్టం చేశా రు. తమ హయాంలో నిర్మించిన ఓఆర్‌ఆర్ ను బీఆర్‌ఎస్ నాయకులు అమ్ముకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వాస్తవాలు చెబితే ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు.
ట్రిపుల్ ఆర్‌ను నాలుగేళ్లలో పూర్తిచేసే లక్ష్యంగా పనిచేస్తున్నామని తెలిపారు. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు రోజుకో వేషం కడుతున్నా రని.. బేడీలు వేసేందుకు పోలీసులున్నారని, ఇబ్బంది పడాల్సిన పనిలేదన్నారు. అయినా వేసుకోవాల్సిన ఇద్దరు కాకుండా మిగిలిన ఎమ్మెల్యేలు బేడీలు వేసుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. ప్రస్తుతం అసెంబ్లీలో బీఆర్‌ఎస్ పార్టీకి చెందిన చిన్న పిల్లలతో మాట్లాడేది లేదని, ప్రతిపక్ష నేతతో మాత్రమే తాము మాట్లాడతామని స్పష్టం చేశారు. కమీషన్ల పేరిట రూ.10 వేలకోట్లు దోచుకున్న దొంగ అని హరీశ్‌రావు ఉద్దేశించి వ్యాఖ్యానించారు.






