గిరిజనుల అభివృద్ధికి కాంగ్రెస్ చేసిన కృషి చిరస్మరణీయం
- ప్రతి తండాకు లింక్ రోడ్లు నిర్మించి అభివృద్ధి చేస్తాం
- బాలానగర్ మండలానికి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్, నవోదయ విద్యాలయం తీసుకొచ్చాం
- ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి
బాలానగర్, జూన్ 28, ఆనాటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ నాయకత్వంలో గిరిజనులకు (ఎస్టీ) రాజ్యాంగబద్ధమైన రిజర్వేషన్లు అమలులోకి వచ్చి 50 సంవత్సరాలు పూర్తున సందర్భంగా, టీపీసీసీ ఆదివాసీ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘ఇందిరమ్మ ఆశీర్వాద బస్సు యాత్ర‘ కార్యక్రమం ను బాలానగర్ మండలంలోని మేడిగడ్డ తండాలో ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మహబూబాబాద్ ఎంపీ బలరాం నాయక్, ఎమ్మెల్సీ శంకర్ నాయక్, జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి, ఎమ్మెల్యేలు రామచంద్ర నాయక్, బిల్యా నాయక్, తెలంగాణ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఒబేదుల్లా కొత్వాల్, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు సంజీవ్ ముదిరాజ్ గారు తదితరులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి మాట్లాడుతూ.. గిరిజనులకు ఎస్టీ రిజర్వేషన్లు కల్పించి సామాజిక న్యాయానికి బాటలు వేసిన మహానేత ఇందిరాగాంధీ సేవలను స్మరించుకుంటూ ఈ బస్సు యాత్రను నిర్వహిస్తున్నామని తెలిపారు. ఇందిరాగాంధీ తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయాల వల్లే నేడు గిరిజనులు విద్య, ఉద్యోగాలు, రాజకీయాలు సహా అన్ని రంగాల్లో ముందుకు సాగుతున్నారని పేర్కొన్నారు. మేడిగడ్డ తండాతో తమ కుటుంబానికి దశాబ్దాల అనుబంధం ఉందని, సామాజికంగా, సాంస్కృతికంగా రెండు ప్రాంతాల ప్రజల మధ్య ఉన్న ఆత్మీయ బంధం ఎంతో ప్రత్యేకమని గుర్తు చేశారు. గిరిజన సమాజంపై తనకు ప్రత్యేకమైన అభిమానముందని, వారి సమస్యలను శాసనసభలో ఎప్పటికప్పుడు ప్రస్తావిస్తూ న్యాయం జరిగేలా కృషి చేస్తున్నానని తెలిపారు.
ఇటీవల అసెంబ్లీలో గిరిజనుల జీవన విధానానికి ప్రతీక అయిన ఇప్పపువ్వు అంశాన్ని ప్రస్తావించి రాష్ట్రవ్యాప్తంగా చర్చకు తీసుకువచ్చిన విషయాన్ని గుర్తుచేశారు.బాలానగర్ మండలంలోని ప్రతి తండాకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించేందుకు అన్ని తండాలను లింకు రోడ్లతో అనుసంధానం చేసి అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. మండల విద్యాభివృద్ధికి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్తో పాటు నవోదయ విద్యాలయం మంజూరుకు కృషి చేసి సాధించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, గిరిజన ప్రజాప్రతినిధులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.






