అమృతస్వరూపిణి
10-05-2026 12:00 AM
అమ్మ అనగానే
అక్షరాలకు ప్రాణం వస్తుంది,
మాటలకు మాధుర్యం
చేరుతుంది,
మనసులకు
మమకారం
అంటుకుంటుంది ॥
పసిబిడ్డ పలుకులలో
అమ్మనే ప్రథమ స్వరం,
పదం పలకకముందే
ప్రేమను పంచే దైవం ॥
నిద్రలేని రాత్రుల్లో
నెత్తిన వేళ్లతో వెన్నెల వెదజల్లే
శివశేఖరం,
కన్నీటి చినుకుల్లో కన్నుల్ని తుడిచే
కరుణాసాగర తరంగం॥
ఆమె చేతుల్లోనే
జీవితపు మొదటి అక్షరాభ్యాసం,
ఆమె చూపుల్లోనే
ప్రపంచమంతా పరిమళించే
సౌందర్యం ॥
అమ్మ ఒక మాట కాదు
అద్భుతమైన ఒక మంత్రం...
ఆమె ఒక మనిషి కాదు
అమూల్యమైన
ఒక సత్త్వం ॥
మాతృ దినోత్సవం
ఒక రోజే కాదు
ప్రతి రోజు ఆమె
పాదాల పూజే కావాలి,
ప్రతి శ్వాసలో ఆమె స్మరణే ఉండాలి,
ప్రతి విజయానికి
ఆమె కేంద్రం కావాలి ॥
గుండ్లపల్లి
రాజేంద్రప్రసాద్






