10-12-2025 12:51:01 AM
గ్రామాల్లో ఏరులై పారుతున్న మద్యం డబ్బు
కనిపించని అధికారుల పర్యవేక్షణ
కల్వకుర్తి, డిసెంబర్ 9: గ్రామపంచాయతీ తొలి విడత ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ప్రచార కార్యక్రమాలకు గురువారం నుంచి పూర్తిగా ముగింపు పలికారు. పోలింగ్కు 48 గంటల ముందు ప్రచారం నిలిపివేయాల్సిన ఎలక్షన్ కోడ్ అమల్లోకి రావడంతో రాజకీయ చైతన్యం ఒక్కసారిగా తగ్గిపోయింది. గత వారం రోజులుగా ప్రతి అభ్యర్థి తమ అనుచరులతో కలిసి ర్యాలీలు, సమావేశాలు నిర్వహిస్తూ ఓటర్లను ఆకర్షించేందుకు బిజీగా గడిపారు.
ముఖ్యంగా చివరి రోజు మంగళవారం భారీగా ర్యాలీలు నిర్వహించారు. కల్వకుర్తి నియోజకవర్గం కల్వకుర్తి, వెల్దండ మండల పరిధిలోని మొత్తం 56 గ్రామపంచాయతీలో గాని ఇప్పటికే ఏడు పంచాయతీల సర్పంచ్ల ఎన్నిక ఏకగ్రీవం అయ్యాయి.
రెండు రోజులే కీలకం..
ప్రచారం ముగిసిన తర్వాత 48 గంటల్లో ఓటర్లను ప్రభావితం చేసేందుకు కొందరు అభ్యర్థులు భారీగా మద్యం, డబ్బులు సరఫరా చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. మద్యం దుకాణాల నుండి నేరుగా గ్రామాలకు వాహనాల్లో తరలిస్తున్నారు. పల్లెల్లో మద్యం రవాణా ఎక్కువైందనే సమాచారం ఉన్నప్పటికీ, అప్కారీ శాఖ, ఎన్నికల అధికారులు, పోలీసులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నా రని ఆరోపణలు వస్తున్నాయి. గతంలో ఎన్నికల సమయంలో భారీగా తనిఖీలు చేసి మద్యం, నగదును సీజ్ చేయడం సాధారణం.
అయితే, ఈసారి అలాంటి కఠిన చర్యలు ఎక్కడ కనిపించడం లేదు. ఇప్పటికే గ్రామాల్లో మద్యం నిలువలు భారీగా చేశారు. రెండు రోజుల్లో వార్డుల వారిగా ఓటర్లను తమ వైపు మలుపుకునేందుకు వార్డుల వారీగా, కులాల వారీగా మద్యం డబ్బు పంచేందుకు ప్రణాళికలు చేశారు. రెండు రాత్రులు పల్లెల్లో మద్యం ఏరులై పారున్నట్లు తెలుస్తుంది. ప్రధానంగా జర్నల్ వచ్చిన గ్రామాల్లో ఇలాంటి పరిస్థితి ఎక్కువ కనిపిస్తుంది. అధికారులు ఎన్నికల నిబంధనలను అమలు చేస్తూ మద్యం నగదు పంపిణీ చేస్తున్న వారిపై చర్యలు తీసుకుంటారో లేదో వేచి చూడాలి.