విశ్వ శక్తి స్వరూపం
సద్గురు జగ్గీ వాసుదేవ్
భారతదేశంలో మన దేవుళ్ళు నాట్యమాడి తీరాల్సిందే. నాట్యమాడ లేకపోతే అసలు వాళ్ళు దేవుళ్లే కాదు! ఇలా ఎందుకంటే, ఈ సృష్టి ప్రక్రియకు మనం ఇవ్వగల అతి దగ్గరి ఉపమానం ఏమిటంటే, అదొక నాట్యం వంటిదని చెప్పొచ్చు. ఈ రోజుల్లో, ఆధునిక శాస్త్రవేత్తలు కూడా, ఈ సృష్టి నాట్యమాడుతున్నట్టుగా కనబడుతుందంటూ అలాంటి పదాలనే వాడుతున్నారు.
మనం నృత్యాన్ని పైపైన గమనించినప్పుడు, ఆ కదలికల మధ్య పెద్దగా సమన్వయం ఏమీ లేదన్నట్టు అనిపిస్తుంది. కానీ, మనం కనుక తగినంత లోతుగా పరిశీలిస్తే, ఆ కదలికల వెనకాల ఓ గొప్ప వ్యవస్థ ఉందని తెలుస్తుంది. ఉదా॥కి మనం భారతీయ శాస్త్రీయ నృత్యం తీసుకుంటే, ఆ నృత్యంలో వాళ్ళు కాళ్ళు చేతులని యాదృచ్ఛికంగా ఎలా పడితే అలా కదుపుతున్నారని అనిపిస్తుంది. పైపైన చూసినప్పుడు అందులో పెద్ద విషయం ఏమీ లేదనిపిస్తుంది.
కానీ, తగినంత లోతుగా పరిశీలిస్తే, వారి కదలికల మధ్య ఓ లోతైన సమన్వయం ఉంటుంది. ఆ సమన్వయం గనుక లేకపోతే, ఆ నృత్యం అంత మనోరంజకంగా ఉండదు. ఈ విధంగా, కాళ్లు చేతులను ఎలా పడితే అలా కదుపుతున్నట్టు చేస్తూనే, వారు వర్ణించాలనుకున్న దాని గురించి పూర్తి సమన్వయాన్ని కలిగి ఉండటం అనేది ఎన్నో ఏళ్ల శిక్షణ, ఇంకా సాధనతోనే వస్తుంది. నృత్యంలో ఉండే ఆ జ్యామితి సౌందర్యం, చూసేవారికి ఆ కథ గురించి గానీ, ఆ నాట్యం గురించి గానీ ఏమీ తెలియక పోయినా, అది వారిని ఓ విధంగా ప్రభావితం చేస్తుంది. సంగీతం విషయంలో కూడా మరో రకంగా ఇదే జరుగుతుంది.
భౌతిక శాస్త్రవేత్తలు కూడా ఇదే అంటున్నారు. ఈ సృ ష్టి చూడటానికి పూర్తిగా యాదృచ్చికంగా ఇంకా యధాలాపంగా జరిగే విషయంలా కనబడుతుంది. కానీ, లో తుగా పరిశీలించినప్పుడు అన్నింటి మధ్యా ఓ విధమైన సమన్వయం ఉందని తెలుస్తుందంటున్నారు. అన్నింటికీ మధ్య ఒక విధమైన సమన్వయం ఏదో ఉంది, కానీ అదేంటో వాళ్లిప్పటికీ కనుక్కోలేక పోతున్నారు. యోగా విషయంలో కూడా, వ్యక్తిగత జీవమైన మనకీ, ఇంకా అతిపెద్ద అభివ్యక్తీకరణ అయిన ఈ సృష్టికీ మధ్య ఓ సమన్వయం ఉన్న ఏకైక కారణంగానే ‘యోగా’ అనేది సాధ్యపడుతుంది. ఈ సమన్వయం గనుక ఉండి ఉండకపోతే, మీరు ఐక్యం అవ్వలేరు. సమన్వయమే లేకపోతే, అసలు ఐక్యం అవ్వడమనే సంభావ్యత ఉండేదే కాదు.
శివుడు - భౌతికశాస్త్రం
శాస్త్రవేత్తలు గత కొన్ని సంవత్సరాలగా constructal theory అనేదాన్ని ప్రతిపాదిస్తున్నారు. వాళ్ళు ఏమంటున్నారంటే మనం ఓ అణువును తీసుకున్నా, మనిషిని తీసుకున్నా, ఏనుగుని తీసుకున్నా లేదా ఈ విశ్వాన్నే తీసుకున్నా వాటి ప్రాథమిక నమూనా ఒక్కటే. అధునాతననుబట్టి మారేది కేవలం వాటిలోని సంక్లిష్టత ఒక్కటి మాత్రమే.
దీన్నే మనం యోగాలో ఎప్పటి నుండో చెబుతున్నాం. ‘అండపిండ బ్రహ్మాండాలు’ అంటారు. అంటే ఈ జీవం, వ్యక్తులు, ఇంకా విశ్వం అన్నీ కూడా ఒకే పదార్థంతో చేయబడ్డాయి. ఇవన్నీ అదే పదార్థానికి చెందిన మూడు విభిన్నమైన అభివ్యక్తీకరణలు. అవన్నీ ఓ సమన్వయంలో ఉన్నాయి. అలాగే, వాటి ఉద్దేశం ఒక్కటే కావడం వల్లనే, మనం ఓ దాన్ని మరో దానిలో కలపగలుగుతున్నాం. మీరు ఓ క్యారెట్ ముక్కను తిని దాన్ని ఓ మనిషిగా చేయొచ్చు. రెండింటి రూపకల్పన ఒకటే కావడం వల్లనే ఇది సాధ్యపడుతుంది.
ఈ విశ్వం నడుస్తున్న విధానానికి మనం ఇవ్వగల అతిదగ్గరి ఉపమానం ఇంకా అతి దగ్గరి వివరణ ఏంటంటే, అదొక తాండవం అనొచ్చు. ఎందుకంటే, విశ్వంలో అన్నీ యాదృచ్ఛికంగా జరుగుతున్నట్టు కనపడతాయి. కానీ ప్రతి దాని వెనుక ఓ ఖచ్చితమైన వ్యవస్థీకరణ, ఇంకా సమన్వయం ఉంటుంది. కాకపోతే, విషయం ఏంటంటే చాలామంది వ్యవస్థీకరణ అంటే అది మేధోపరమైందని, ఇంకా విభజనలు చేయడమని అనుకుంటారు. ఉదా॥కు ఓ చక్కటి తోటని, ఇంకా ఓ అడవిని తీసుకుందాం. తోట చక్కగా, పద్ధతిగా ఉంటుందని, అడవిలో మాత్రం ఎటువంటి పద్ధతి ఉండదని మనం అనుకుంటాం. కానీ, మీరు ఓ మూడు నెలలపాటు తోటను చూసుకోకపోతే అది పాడైపోతుంది. కానీ, ఓ అడవి మీ సంరక్షణ లేకుండా కొన్ని కోట్ల ఏళ్ల వరకూ కుడా కొనసాగగలదు. అలాంటప్పుడు వీటిలో దేనికి మెరుగైన వ్యవస్థీకరణ ఉందంటారు?
చిదంబరం ఆలయంలో, నాట్యం చేసే దేవుడైన నటరాజుగా శివుని మూర్తి ఉంటుంది. నర్తకుడు నటరాజు అనేది శివునికి చెందిన అత్యంత ముఖ్యమైన రూపాలలో ఒకటి. నేను స్విట్జర్లాండ్లోని CERN ను సందర్శించాను. ఈ గ్రహం మీద ఇదే అతిపెద్ద భౌతిక ప్రయోగశాల, అక్కడే అణువులను ఢీ కొట్టించి విచ్ఛిన్నం చేయడం వంటివి చేస్తారు. అక్కడ ప్రవేశద్వారం ముందు నటరాజ విగ్రహం ఉండడాన్ని నేను గమనించాను. ఎందుకంటే, ప్రస్తుతం వాళ్ళు ఏదయితే చేస్తున్నారో దానికి దగ్గరగా ఇది తప్ప, మానవ సంస్కృతులలో మరేదీ లేదు.






