ఆత్మ దర్శనం
ఉపనిషత్ సుధ
బయటి ప్రపంచం అనుభవాన్నిస్తే నిజానికి అంతర ప్రపంచం అనుభూతిని అందిస్తుంది. అనుభవం అనుభూతిగా మారాలంటే అంతరంగ ప్రయాణం చేయాలి. ఆ ప్రయాణం ప్రాపంచిక అనుభవాలకంటే ఉదాత్తమైన వాటిని కలిగించి, దృష్టిని లోపలకు మరల్చి, లోచూపును ప్రసాదిస్తుంది. దీనినే ‘అంతర్నేత్రం’ అని, ‘మూడో కన్ను’ అని యోగశాస్త్రం అభివర్ణిస్తున్నది.
ఇంద్రియాలను అధిగమించి ప్రయాణించగల మనస్సు ఈ స్థితిని సునాయాసంగా అందుకుంటుంది. అప్పటి వరకు తెలిసిన ప్రాపంచిక విలువలు తమను తాము ఆవిష్కరించుకుంటూ మనసును అంటే మన ఆలోచనలను అంతర్ము ఖం చేస్తయ్. అవి భౌతిక, ఆదిభౌతిక స్థితులను దాటిన అధ్యాత్మ విలువలు.
ఈ విలువల ఆచరణ నిజానికి ఎదురీతే. ఏటవాలు ప్రయాణం మాత్రం కాదు. అయినా, ఆధ్యాత్మిక విలువలను అందించే తృప్తి, సమర్పణ, వినయం, విచక్షణ, విశ్లేషణ వంటి నిర్ణయాత్మక భావనలు ఎదురీ తకు మనిషిని సిద్ధం చేస్తయ్. ఈ సందర్భంలో ఎదురీత కష్టాన్ని కలిగించకపోగా నిర్భయత్వాన్ని, ధైర్యాన్ని ప్రసాదిస్తుంది. సముద్రంలో ఎగసి పడుతున్న కెరటాలను చూస్తున్నట్లుగా సాక్షీభూత స్థితి అలవడుతుంది. ఇది నిరాశకు, నిర్వేదానికి తావు లేని అద్భుత స్థితి. ఇక్కడే చింతన ప్రారంభమవుతుంది. స్థూలశరీర పరిస్థితిని దాటి మనసు సూక్ష్మశరీరాన్ని గురించిన ఆలోచన చేయటం మొదలుపెడుతుంది.
మన ఆలోచనలు, మన జ్ఞాపకాలు, అ హంకారం, మమకారం, వాసనలు, మూల వాసనలు... అన్నీ కలిసి ‘సూక్ష్మ శరీరం’ ఏర్పడుతుంది. దీని ఆధారంగా పునర్జన్మ సిద్ధాంతం రూపు దిద్దుకొని, కాల పరీక్షకు నిలబడి ఎందరెందరినో అధ్యయనం చేసిన తరువాత పునర్జన్మ ఉన్నదన్న భావన స్థిరపడుతుంది. కాల గమనంలో అది సిద్ధాంతమై బహుళ జనామోదాన్ని పొంది నిలబడుతుంది.
కనుక, దేహం పోయినా ఆత్మ ఉంటుంది. ఆత్మ మళ్లీ మరొక శరీరాన్ని పొంది స్థూలం నుండి సూక్ష్మం వైపు; సూక్ష్మం నుండి అంతర్ముఖత్వం వైపు; ఆపై అనంత ఆద్యంతరహిత స్థితిని పొందే దశకు చేరుకుంటుంది. ఇదొక నిరంతర ప్రక్రియ. ఈ విషయమంతా వాదానికి, తర్కానికి లోబడేది కాదు. సత్యాన్వేషణ కు ఇది చుక్కాని. ఈ అనుభవం లేకుండా సత్యసాక్షాత్కరం కలగదు. కలిగినా, అవునో కాదో అన్న సంశయం మాత్రం మిగిలిపోతుంది. సాక్షాత్కారం పొందాలన్న నిశ్చయ బుద్ధి కలవాడికి ఇది దోహదకారియై, సందేహ సందోహాలను తరిమి కొట్టి, సాక్షాత్కార అనుభూతిని వరదానం చేస్తుంది.
“నచికేతా! గురువు శిష్యుడు, ఉపాధ్యాయుడు -విద్యార్థి, ఆచార్యుడు అంతేవాసి వంటివారు కలసి జీవిస్తే తమ సర్వశక్తులను జ్ఞానం పొందటంలోనే వినియోగిస్తారు. ఈ ప్రయత్నం అగాధ జలధిలో, ఆలుచిప్పలలో దాగిన ముత్యాలను పట్టుకోవటం వంటిది. లోక గురువులు విషయాన్ని తెలియజేస్తే, సమర్థ గురువులు విషయాన్ని విపులంగా వివరిస్తారు. మోచక గురువులు మోక్షమార్గాన్ని సూచిస్తారు. ఇక, సద్గురువులు సత్యం వైపు నడిపిస్తారు. వీరందరూ తమ తమ బోధను, ప్రయత్నాన్ని కొనసాగిస్తూ సాధకుణ్ణి ఆతడి అంతరంగం వైపు నడిపించాలి. సామాన్య, సాధారణ గురువులకు ఇది తలకు మించిన పని!
కనుక, సమర్థ సద్గురువుకై తపించాలి. అహంకారం ఉంటే గురువు దొరకడు. గురువు దొరికితే అహంకారం ఉండదు, ఉండకూడదు. మూఢ విశ్వాసాలను దాటి సక్రమ యదార్థ సాధన చేయాలి. తర్కం, వివాదం విడనాడాలి. గురుబోధను, శాస్త్రాన్ని ప్రమాణం చేసుకొని సాధన చేయాలి. మనస్సును పూర్తిగా తెరచి ఉంచాలి. బుద్ధిని వికాసమానం చేయాలి. చిత్తవృత్తులను నిరోధించాలి. అహంకారాన్ని వదులుకోవాలి. అహం స్ఫురణను వెలిగించుకోవాలి. అది ఆత్మ దర్శనానికి దారి తీస్తుంది. అంతటితో అన్వేషణ ముగుస్తుంది.
ఈ అనుభూతియే మన అంతరంగాన్ని ప్రకాశమానం చేస్తుంది. అదే స్వస్వరూపాను సంధానం. తేలిక మాటల్లో ‘ఆత్మ దర్శనం” అన్నాడు యమధర్మరాజు. నచికేతసుడు నమస్కరించాడు భక్తితో, కృతజ్ఞతతో!
- వీయస్‌ఆర్ మూర్తి






