శిథిలావస్థకు చేరిన బేల తహసీల్దార్ కార్యాలయం
బేల,జూలై 06 (విజయక్రాంతి): ఆదిలాబాద్ జిల్లా బేల మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయ(Bela Tahsildar office) భవనం శిథిలావస్థకు చేరుకుంది. భవనం గోడలు పగుళ్లతో కనిపిస్తుండగా, పైకప్పు పలుచోట్ల దెబ్బతిన్న పరిస్థితి నెలకొంది. వర్షాకాలంలో నీరు కారడంతో అధికారులు, సిబ్బంది, ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ప్రతిరోజూ వందలాది మంది ప్రజలు రెవెన్యూ సేవల కోసం ఈ కార్యాలయానికి వస్తుంటారు. అయితే భవనం దయనీయ స్థితిలో ఉండటంతో ఎప్పుడైనా ప్రమాదం సంభవించే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత ఉన్నతాధికారులు స్పందించి పాత భవనాన్ని మరమ్మతులు చేయడం లేదా నూతన కార్యాలయ భవన(New Tahsildar office building) నిర్మాణానికి చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. ప్రజల భద్రత దృష్ట్యా తక్షణ చర్యలు తీసుకోవాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు.






