ఇకపై అంగన్‌వాడీల్లో ఆకస్మిక తనిఖీలు
- 4వ తేదీ నుంచి జిల్లాల్లో పర్యటన, సమీక్ష
- టేక్ హోం రేషన్ విషయంలో మరింత జాగ్రత్త
- విధుల్లో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవు
- వీడియో కాన్ఫరెన్స్‌లో మంత్రి సీతక్క
హైదరాబాద్, ఆగస్టు 29 (విజయ క్రాంతి): ఇకపై అంగన్‌వాడీ కేంద్రాల్లో ఆకస్మిక తనిఖీలుంటాయని, సీఎం, మంత్రులు సైతం సందర్శిస్తారని మంత్రి సీతక్క స్పష్టం చేశారు. మహిళా,శిశు సంక్షేమ శాఖపై సచివాలయంలో జిల్లా అధికారులతో గురువారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అంగన్‌వాడీ టీచర్లకు ప్రతినెలా ఇస్తున్న శిక్షణ కార్యక్రమాలను ఆయాలకు కూడా వర్తింపచేయడం ద్వారా కొన్ని సమస్యలను పరిష్కరించవ చ్చన్నారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో సేవలను మరింత విస్తృతపరచాలని సూచించారు.
చిన్నారులకు ఇస్తున్న కోడిగుడ్డును రెండు ముక్కలు చేసి ఇస్తే తినడానికి అనువుగా ఉంటుందన్నారు. ఆహార పదార్థాలను నిల్వ చేసుకునే పాత్రలను, కోడిగుడ్లను భద్రపరిచే రాక్‌లను అందజేస్తామన్నారు. టేక్‌హోం రేషన్‌లో భాగంగా ఇస్తు న్న వస్తువుల నాణ్యతను లబ్ధిదారుల నుంచి లిఖితపూ ర్వకంగా ధ్రువీకరించుకోవాలని సూచించారు. ప్రతికూల పరిస్థితులున్న ప్రాంతాల్లో టేక్‌హోం రేషన్‌ను వారింటికి తీసుకెళ్లి ఇవ్వాలని చెప్పారు. ఎక్కడైనా సమస్యలు ఏర్పడితే బాధ్యులపై చర్యలు తీసుకోవడానికి వీలుంటుందన్నారు. ఉన్నతాధికారులు అంగన్‌వాడీ కేంద్రాలను సందర్శించాలని ఆదేశాలు జారీ చేశారు.
అలసత్వాన్ని ఉపేక్షించం..
విధుల పట్ల అలసత్వం వహిస్తే ఉపేక్షించేది లేదని, మొదట వార్నింగ్ ఇచ్చి తర్వాత విధుల నుంచి తప్పిస్తామని మంత్రి సీతక్క హెచ్చరించారు. కేంద్రాల ద్వారా నాణ్యమైన భోజనం అందించే బాధ్యత సంబంధిత అధికారులదేనని, ఎక్కడ తప్పు జరిగినా అక్కడి అధికారులపై చర్యలు తప్పవని తేల్చి చెప్పారు. వచ్చే నెల 4వ తేదీ నుంచి జిల్లాల్లో పర్యటించి పథకాల అమలు తీరు, పనుల పురోగతిని సమీక్షిస్తామని తెలిపారు. పూర్వ ప్రాథమిక పాఠాలను బోధించేలా అంగన్‌వాడీ కేంద్రాలను సమాయత్తం చేయాలని ఆదేశించారు. దేశానికి ఆదర్శంగా మన అంగన్‌వాడీ పాఠశాలలు ఉండాలని.. ఆ దిశలో టీచర్లకు శిక్షణ ఇస్తున్నామని వెల్లడించారు.






