ఫ్యూచర్ సీఎం బీసీయే!

16-09-2026 | 05:10am

క్యాబినెట్‌లోనూ వారికే పెద్దపీట

ఉద్యమ నేతగా కేసీఆర్‌(KCR)పై గౌరవం.. సీఎంగా ఆయన ఫెయిల్

వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తా 

మీడియా చిట్‌చాట్‌లో పీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్‌గౌడ్

హైదరాబాద్, సెప్టెంబర్ 15 (విజయక్రాంతి): ‘తెలంగాణ(Telangana)లో కాంగ్రెస్ పార్టీ(Congress Party) మరోసారి అధికారంలోకి రావ డం ఖాయం. భవిష్యత్తులో బీసీ వ్యక్తి ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. క్యాబినెట్‌లో బీసీల ప్రాతినిథ్యం మరింత పెరగాలి. కనీసం నాలుగు నుంచి ఐదుగురికి మంత్రి పదవులు(Ministerial posts) దక్కాలి’ అని టీ పీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్‌గౌడ్(Mahesh Kumar Goud) స్పష్టం చేశారు. ‘సీఎం రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy)కి, నాకు మధ్య ఎలాంటి గ్యాప్ లేదు. చిన్నచిన్న భిన్నాభిప్రాయాలు వచ్చినా వాటిని పరిష్కరించుకుంటూ జోడెద్దుల్లా సమన్వయంతో ముందుకు సాగుతున్నాం’ అని పేర్కొన్నారు.

పీసీసీ అధ్యక్షుడి(PCC President)గా రెండేళ్లు పూర్తయిన సందర్భంగా మంగళవారం సీఎల్పీ కార్యాలయంలో మీడియాతో చిట్‌చాట్ నిర్వహించారు. రెండేళ్ల పదవీకాలం సంతృప్తినిచ్చిందని పేర్కొన్నారు.రాహుల్‌గాంధీని ప్రధాన మంత్రిని చేయడమే మా ఇద్దరి లక్ష్యమని, అందుకు రాష్ట్రం నుంచి 15 ఎంపీ సీట్లు గెలిపించుకునేందుకు ఇప్పటి నుంచే  కార్యాచరణ రూపొందిస్తున్నామని తెలిపారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో  తాను  నిజామాబాద్ జిల్లాలో ఏదో ఒక నియోజక వర్గం నుంచి పోటీ చేస్తానని.. ఎక్కడ అనేది అధిష్ఠానం నిర్ణయిస్తుందన్నారు.

తనకు క్యాబినెట్‌లోకి పోవాలనే ఆలోచన లేదన్నారు. సీఎం రెడ్డి బిడ్డ అయినప్పటికీ.. కులగణన సర్వే పకడ్బందీగా చేయించాలరని పేర్కొన్నారు. బిహార్, కర్ణాటకలో కులగణ చేసినా, టేబుల్ చేయలేకపోయారని.. తెలంగాణ అసెంబ్లీలో చర్చకు పెట్టి కేంద్రానికి పంపించామని తెలిపారు. ఓబీసీని అని చెప్పుకునే ప్రధాని మోదీ.. బీసీ బిల్లును ఆమోదానికి ఎందుకు సహకరించడం లేదని ప్రశ్నించారు. రాహుల్‌గాంధీ ప్రధానమంత్రి అయితనే బీసీలకు న్యాయం జరుగుతుందన్నారు.

వచ్చే ఎన్నికల్లో జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్షుల ప్రతిపాదన లేనిదే పేర్లు పరిశీలనలోకి రావన్నారు. నామినేటెడ్ పదవుల విషయంలోనూ డీసీసీల నుంచి సలహాలు, సూచనలు తీసుకుంటామని స్పష్టం చేశారు. డీసీసీల అధికారాలను పునరుద్ధరించామని, రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరూ డీసీసీల వద్దే పేర్లు నమోదు చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుందని తెలిపారు. డీసీసీ అధ్యక్షులకు ప్రొటోకాల్ కల్పించే అంశంపైన ఆలోచన చేస్తున్నామని వెల్లడించారు. కేసీఆర్‌ను ఉద్యమ నాయకుడిగా గౌరవిస్తామని, అయితే సీఎంగా ఆయన ఫెయిల్ అయ్యారని మహేష్‌కుమార్‌గౌడ్ అన్నారు. ఆయన చేసిన తప్పులు, అప్పులను తాము భారం మోస్తున్నామన్నారు. 

గాంధీభవన్‌లో మంత్రుల ముఖాముఖి కార్యక్రమాన్ని ప్రారంభించడం తన హయాంలో మైలురాయిగా నిలిచిందని మహేష్‌కుమార్ గౌడ్ పేర్కొన్నారు. మంత్రులే స్వయంగా గాంధీభవన్‌కు వచ్చి ప్రజా సమస్యలు వినడం గతంలో జరగలేదని, ప్రజల నుంచి వచ్చిన వినతులను తానే స్వయంగా నోట్ చేసుకుని పరిష్కారం కోసం అధికారుల దృష్టికి తీసుకెళ్తున్నానని చెప్పారు.

దార్శనికత కలిగిన నాయకుడైన రేవంత్‌రెడ్డి ఆధునిక సదుపాయాలతో ఫోర్త్ సిటీ’ని తీర్చిదిద్దుతుంటే బీఆర్‌ఎస్ నాయకులు కేటీఆర్, హరీశ్ రావులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ ప్రభుత్వం ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వకుండా పేదలకు ద్రోహం చేసిందన్నారు. తమ పాలనలో సన్న బియ్యం, ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం, రూ.500లకే గ్యాస్, 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్, ఇందిరమ్మ ఇళ్లతో పాటు అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నట్లు తెలిపారు.

హైడ్రా రాకతో ఆక్రమణదారుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయన్నారు. పీసీసీ అధ్యక్ష పదవి బాధ్యత కలిగినదని మహేష్‌కుమార్‌గౌడ్ పేర్కొన్నారు. తన రెండేళ్ల పదవీ కాలంలో పార్టీకి బలాన్ని, కార్యకర్తలకు ఆత్మస్థైర్యం ఇచ్చానని చెప్పారు. పార్టీ ఇన్‌చార్జ్‌లుగా వచ్చిన దీపాదాస్ మున్షీ, మీనాక్షినటరాజన్  ఇద్దరూ తనకు ఎంతో సహకరించారని పేర్కొన్నారు. గాంధీభవన్ నుంచి మెసేజ్ ఇస్తే లక్షల మందికి వెళ్లే వ్యవస్థను ఏర్పాటు చేశానని చెప్పారు.  

పూర్తి కార్యవర్గం వేయలేకపోయా..

‘పీసీసీ పూర్తి కార్యవర్గం వేయలేక పోయాననే అసంతృప్తి ఉంది. వర్కింగ్ ప్రెసిడెంట్ నియామకం కూడా ఆలస్యమైంది. కార్పొరేషన్ చైర్మన్లను కూడా సకాలంలో నియమించలేకపోయాం. ఈ నెలాఖరుకి నామినేటెడ్ పోస్టులు భర్తీ చేస్తాం’ అని మహేశ్‌కుమార్‌గౌడ్ పేర్కొన్నారు. పరిపాలన, పథకాల అమలు, అభివృద్ధి విషయంలో తెలంగాణ దేశంలోనే  నంబర్ వన్ స్థానంలో ఉందని, ఏఐసీసీ రేటింగ్ కూడా రేటింగ్ ఇచ్చిందన్నారు. సర్పంచ్ ఎన్నికలో ్ల బీసీలు 60 శాతం సీట్లు, మున్సిపల్ ఎన్నికల్లో 50 శాతానికి పైగా సీట్లు ఇచ్చి గెలిపించుకున్నామని చెప్పారు. పార్టీని గ్రామస్థాయికి తీసుకెళ్లడంతో పాటు సామాజిక న్యాయం చేయగలిగానని పేర్కొన్నారు.  

బాధ అనిపించింది..

కొండా సురేఖను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేసినప్పుడు బాధ అనిపించిందని మహేష్‌కుమార్‌గౌడ్ పేర్కొన్నారు. ‘కొండా సురేఖ బీసీ మంత్రినే కాకుండా మహిళా కూడా. అధిష్ఠానం నిర్ణయం మేరకు చర్యలు తీసుకోవాల్సి వచ్చింది’ కార్పొరేషన్ చైర్మన్ పదవుల విషయంలో కొందరికి రెన్యువల్ చేస్తామని  తెలిపారు. అధికార యంత్రాంగం అత్యుత్సాహం వల్ల 22 ఏ జాబితాలో పొరపాట్లు జరిగాయని చెప్పారు. ఈ విషయంపై అసెంబ్లీలో కూడా ప్రభుత్వం క్లారిటీ ఇచ్చిందని, కొందరు కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు.

మరిన్ని వార్తలు