3 August, 2026 | 6:40 PM

చెలిమె నీళ్లే గంగాజలం

18-02-2025 12:58 AM
  1. ఎండలు ముదరకముందే గొంతెండుతున్న ఏజెన్సీలు 
  2. పలు గ్రామాల్లో నీటి సరఫరా సమస్యలు
  3. లొద్దనూరు గ్రామంలో నాలుగు నెలలుగా పనిచేయని సోలార్ పంప్
  4. మూడు కిలోమీటర్ల దూరంలోని వాగు నుంచి నీటిని తెచ్చుకుంటున్న మహిళలు
  5. అధికారులు స్పందించకుంటే ఆదివాసీలకు గుక్కెడు నీళ్లు దొరకని దుస్థితి

* ఆదివాసీలు దాహార్తిని తీర్చుకునేందుకు వాగుల్లోని చెలిమెల నీళ్లపైనే ఆధారపడా ల్సిన  దుస్థితి నెలకొంది. లొద్దిగూడ గ్రామంలో సోలార్ పంపు పనిచేయక మహిళలు ఇబ్బందిపడుతున్నారు.

కుమ్రంభీం ఆసిఫాబాద్, ఫిబ్రవరి 17 (విజయక్రాంతి): ఎండాకాలం ఇంకా రాకముందే ఏజెన్సీ గ్రామాల్లో నీటి కటకట మొదలైంది. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని పలు గ్రామాల్లో ఆదివాసీలు తాగునీటి కోసం కిలోమీటర్ల దూరం నడుచుకుంటూ వెళ్లి నీటిని తీసుకొచ్చుకునే పరిస్థితులు మళ్లీ వచ్చాయి.

జిల్లాలోని జైనూర్ మండలం లొద్దిగూడ గ్రామంలో నాలుగు నెలలుగా సోలార్ పంపు పని చేయకపోవడంతో గ్రామస్థులు మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న వాగుకు కాలినడకన వెళ్లి చెలిమెల్లో నీటిని తోడుకుని తీసుకొచ్చుకుంటున్నారు. వేసవి కాలం ఇంకా ప్రారంభం కాకముందే గిరిజనులు వాగుల్లోని చెలిమెల నీళ్లపై అధాపడాల్సిన పరిస్థితి వచ్చిందని వాపోతున్నారు.

దాహార్తిని తీర్చుకునేందుకు ప్రతీ రోజు కిలోమీటర్ల దూరం నడుచుకుంటు వెళ్లాల్సిన దుస్థితి నెలకొందని వాపోతున్నారు. ఇప్పుడే పరిస్థితి ఇలా ఉంటే వచ్చే వేసవిలో ఇంకెంత కష్టపడాల్సి వస్తుందోనని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లొద్ది గూడ గ్రామంలో దాదాపు 200 కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ నల్లాలు బిగించారు.

పైప్‌లైన్ వేయడంలో కొన్ని సమస్యలు రావడంతో  నీటిని అందించడం వీలు కాలేదు. దీంతో గ్రామంలో సోలార్ పంపు ఏర్పాటు చేసి వాగు ద్వారా నీరు అందిస్తున్నారు.  అయితే నాలుగు నెలల కింద సోలార్ పంపు పాడైపోయింది. ఇప్పటికీ మరమ్మతు చేయకపోవడంతో గ్రామస్తులు ఇబ్బందులు పడాల్సి వస్తోంది.

ముందస్తు చర్యలు తీసుకోవాలి..

ఏజెన్సీ మండలాలు అయిన తిర్యాణి, లింగాపూర్, జైనూర్, సిర్పూర్(యు), కెరమెరి మండలాల్లో వేసవిలో తాగునీటి సమస్యలు తీవ్రంగా ఉంటాయి. వీటిపై అధికారులు ముందస్తుగానే పరిష్కార చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. లేకుంటే ప్రజల గుక్కెడు నీటి కోసం అల్లాడాల్సిన పరిస్థితులు ఎదురుకానున్నాయి. 

నీటి కోసం ఇబ్బందులు పడుతున్నాం

గ్రామంలో సోలార్ పంపు చెడిపోయి నాలుగు నెలలైంది.. రోజూ మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న వాగుకు నడుచు కుంట వెళ్లి చెలిమె  నుంచి నీళ్లు తోడుకుని తీసుకొచ్చుకుంటున్నం. ఇప్పుడే ఇలాంటి పరిస్థితి ఉంటే ఎండాకాలంలో ఇంకెంత ఇబ్బంది పడాల్నో భయమైతాంది. అధికారులు స్పందించి తాగునీటి సమస్యను పరిష్కరించాలె. 

 ఆత్రం జంగుబాయి, లొద్దిగూడ, జైనూర్