29 June, 2026 | 2:04 AM

పోలియో రహిత సమాజమే లక్ష్యం

29-06-2026 12:00 AM

మహబూబ్నగర్ టౌన్, జూన్ 28 : మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ప్రభుత్వ బస్టాండ్ ప్రాంగణంలో ఐదు సంవత్సరాల లోపు చిన్నారులందరికీ పోలియో చుక్కలు వేసే ‘పల్స్ పోలియో‘ కార్యక్రమాన్ని ఆదివారం  నగర పాలక సంస్థ మేయర్  గుమ్మల మమత శ్రీనివాస్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా. ఏ.శ్రీనివాసులు, ప్రారంభించారు.

ఈ సందర్భంగా మేయర్  మాట్లాడుతూ, పిల్లల ఉజ్వలమైన మరియు ఆరోగ్యకరమైన భవిష్యత్తు కోసం ప్రతి ఒక్కరూ బాధ్యతగా తమ పిల్లలకు పోలియో చుక్కలు వేయించాలని పిలుపునిచ్చారు. ‘రెండు చుక్కల జీవం  పిల్లల జీవితానికి శ్రీరామరక్ష‘ అని పేర్కొంటూ, 5 సంవత్సరాల లోపు ఉన్న ప్రతి ఒక్క చిన్నారికి ఈ ఉచిత పోలియో చుక్కలను వేయించి, మన దేశాన్ని పోలియో రహిత భారతంగా మార్చడంలో భాగస్వాములు కావాలని కోరారు. అనంతరం మైనార్టీ పాఠశాల-2లో ఏర్పాటు చేసిన పల్స్ పోలియో కార్యక్రమంలో జిల్లా అదన కలెక్టర్ పాల్గొని పల్స్ పోలియో చుక్కలను చిన్నారులకు వేశారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ చైర్మన్ నటరాజ్ ,వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది, మున్సిపల్ అధికారులు, ప్రజా ప్రతినిధులు తదితరులు ఉన్నారు.