మహిళా శిశు సంక్షేమమే లక్ష్యం
- అంగన్‌వాడీల్లో త్వరలో బ్రేక్ ఫాస్ట్ స్కీం
- డీడబ్ల్యూఓల సమీక్షలో మంత్రి సీతక్క
హైదరాబాద్, ఫిబ్రవరి 27 (విజయక్రాంతి): మహిళల గౌరవం, పిల్ల ల ఆరోగ్యం, భద్రత, విద్యపై ప్రభు త్వం కట్టుబడి పనిచేస్తోందని, వీరి సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి సీతక్క అన్నారు. తెలంగాణను మహిళలు, పిల్లల సంక్షేమంలో దేశానికి ఆదర్శంగా నిలబెట్టేందుకు నిరం తరం కృషి చేస్తామని మంత్రి సీతక్క తెలిపారు. మధురానగర్‌లోని మహిళా శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్ కార్యాలయంలో శుక్రవారం రాష్ట్ర మహి ళా శిశు సంక్షేమ శాఖపై జిల్లా డీడబ్ల్యూఓలతో మంత్రి సీతక్క సమగ్ర సమీక్ష నిర్వహించారు.
ఈ సమావేశంలో బడ్జెట్ కేటాయింపులు, చేసిన ఖర్చులు, అమలవుతున్న పథకాలు, వచ్చే ఆర్థిక సంవత్సరంలో అమలు చేయబోయే పథకాలు, అంగన్వాడీ భవనాల నిర్మాణం, అంగన్వాడీ కేంద్రాలకు ఉచిత విద్య సరఫరా, హాజరు శాతం, ప్రీస్కూల్ యాక్టివిటీ, మిషన్ శక్తి, మిషన్ వాత్సల్య తదితర అంశాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ... అంగన్వాడీ భవనాల నిర్మాణ పనుల్లో మరింత వేగం పెంచాలని అధికారులను ఆదేశించారు. 2,199 అంగన్వాడీ భవనాలు మంజూరు చేస్తే ఇప్పటివరకు కేవలం 500 భవనాలే పూర్తయ్యాయని..
మిగిలిన భవనాలను త్వరలో పూర్తి చేయాలని ఆదేశించారు. సాక్ష్యం అంగన్వాడీ కింద రాష్ట్రంలోని ఆంగన్వాడీ కేంద్రాల్లో పోషకాహారం, ప్రీ-స్కూల్ విద్య, పరిశుభ్రమైన, సానుకూల వాతావరణం ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి తెలిపారు. మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ‘అమ్మ మాట అంగన్వాడీ బాట’ అనే నినాదంతో కార్యక్రమాలు ప్రారంభించామని,
దీని ఫలితంగా అంగన్వాడీ కేంద్రాలకు చిన్నారుల హాజరు శాతం గణనీయంగా పెరిగిందని పేర్కొన్నారు. త్వరలో రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడీ చిన్నారులకు బ్రేక్ ఫాస్ట్ స్కీమును ప్రారంభిస్తామని తెలిపారు. ములుగు జిల్లాలో పైలెట్ ప్రాజెక్టు కింద అంగన్వాడీ చిన్నారులకు రోజుకు 100 ఎంఎల్ విజయ పాలు సరఫరా చేస్తున్నామని చెప్పారు. కౌమార బాలికల్లో రక్తహీనత తగ్గించేందుకు ఆదివాసీలు అధికంగా ఉన్న మూడు జిల్లాల్లో పల్లి, చిరుధాన్యాల చిక్కిలను అందిస్తున్నామని తెలిపారు.
మిషన్ వాత్సల్య కింద బాలల రక్షణ వ్యవస్థను బలోపేతం చేస్తున్నామని, మిషన్ శక్తి ద్వారా మహిళల భద్రతకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నామని మంత్రి తెలిపారు. అమ్మాయిల భద్రత విషయంలో రాజీ పడబోమని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో టీజీ ఫుడ్స్ చైర్మన్ ఫహీం, మహిళా శిశు సంక్షేమ శాఖ సెక్రటరీ అనితా రామచంద్రన్, డైరెక్టర్ శృతి ఓజా, టీజీ ఫుడ్స్ ఎండీ చంద్రశేఖర్ రెడ్డి పాల్గొన్నారు.




