11 July, 2026 | 1:44 AM

బాధితులకు భరోసా కల్పించడమే లక్ష్యం

11-07-2026 12:35 AM

అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలి

మహబూబాబాద్, జులై 10 (విజయక్రాంతి): బాధితులకు సత్వర న్యాయం, రక్షణ, పునరావాసం కల్పించడంలో అన్ని ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పనిచేయాలని మహబూబాబాద్ జిల్లా ఎస్పీ డాక్టర్ శబరీష్ అన్నారు. శుక్రవారం మహబూబాబాద్ టౌన్ పోలీస్ స్టేషన్ కాన్ఫరెన్స్ హాల్ లో అన్ని శాఖల అధికారులు, వివిధ ప్రభుత్వ విభాగాల ప్రతినిధులతో కలిసి నిర్వహించిన భరోసా  సమన్వయ సమావేశంలో పాల్గొని అధికారులకు పలు సూచనలు చేశారు.

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ బాధితులకు న్యాయ, వైద్య, మానసిక పరామర్శ, రక్షణ సేవలు అందించడంలో ఎలాంటి జాప్యం లేకుండా అన్ని శాఖలు సమిష్టిగా పనిచేయాలని సూచించారు. క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న సమస్యలు, సవాళ్లను అధికారులను అడిగి తెలుసుకుని, సేవలను మరింత సమర్థవంతంగా అందించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు.

పిల్లలపై లైంగిక వేధింపులు, బాల్య వివాహాల నివారణకు పాఠశాల స్థాయిలోనే పోక్సో చట్టంపై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఎస్పీ ఆదేశించారు. ప్రతి విద్యార్థికి తమ హక్కులు, రక్షణ చట్టాలు, గుడ్ టచ్, బ్యాడ్ టచ్ వంటి అంశాలపై స్పష్టమైన అవగాహన ఉండేలా చర్యలు చేపట్టాలని సూచించారు. భరోసా కేంద్రానికి వచ్చే ప్రతి బాధితుడికి ప్రభుత్వం అండగా ఉందనే విశ్వాసం కలిగేలా అన్ని శాఖలు పరస్పర సహకారంతో పని చేయాలని, మహిళలు, చిన్నారుల భద్రత, సంక్షేమం విషయంలో ప్రతి శాఖ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఎస్పీ తెలిపారు.

అధికారులందరూ సమన్వయంతో పని చేసినప్పుడే బాధితులకు నిజమైన న్యాయం అందుతుందని,ప్రతి శాఖ ఒకరికొకరు సహకరిస్తూ ఒకే లక్ష్యంతో ముందుకు సాగాలని అన్నారు . అలాగే సమాజంలో శాశ్వత మార్పు కోసం పాఠశాల స్థాయిలోనే పిల్లలకు పోక్సో చట్టాలపై అవగాహన కల్పించడం అత్యంత అవసరం అని పేర్కొన్నారు.

ఈ సమావేశంలో చైల్ వెల్ఫేర్ కమిటీ చైర్ పర్సన్ డాక్టర్ నాగవాణి, డిస్టిక్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ సత్య నారాయణ మూర్తి, జిల్లా మెడికల్ సూపరింటెండెంట్ గవర్నమెంట్ హాస్పిటల్ డాక్టర్ శ్రీనివాస్ , బాల రక్షక్ భవన్ కోఆర్డినేటర్ చైతన్య , డి.ఎల్.ఎస్.ఏ అడ్వకేట్ రాజ్ కృష్ణ, భరోసా కేంద్రం, సఖీ కేంద్రం, షీ టీమ్స్, ఇతర అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.