16 July, 2026 | 1:04 AM

మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యం

16-07-2026 12:51 AM

ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి

కల్వకుర్తి జులై 15: కల్వకుర్తి నియోజకవర్గ ప్రజలకు స్థానికంగానే మెరుగైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో కల్వకుర్తి ప్రభుత్వ ఆసుపత్రిలో నూతనంగా రెండు డయాలసిస్ యూనిట్లను ఏర్పాటు చేయడం జరిగిందని ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. బుధవారం నూతన యూనిట్లను ప్రారంభించి మాట్లాడారు.

రెండు యూనిట్ల ప్రారంభంతో ఆసుపత్రిలో మొత్తం డయాలసిస్ యూనిట్ల సంఖ్య ఏడుకు చేరిందని దీంతో కిడ్నీ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న రోగులకు మరింత వేగంగా, నాణ్యమైన డయాలసిస్ సేవలు అందుబాటులోకి రానున్నాయన్నారు. స్థానికంగానే మెరుగైన వైద్య సేవలు లభించడం వల్ల రోగులపై ప్రయాణ భారం, ఆర్థిక భారం తగ్గుతుందన్నారు. అనంతరం ఎమ్మెల్యే ఆసుపత్రిలోని వివిధ విభాగాలను సందర్శించి వైద్య సేవల నిర్వహణపై సమీక్ష నిర్వహించారు.

వైద్యులు, సిబ్బందితో మాట్లాడి రోగులకు అందుతున్న చికిత్స, మౌలిక సదుపాయాలు, సేవల గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ రత్నమాల, ఆసుపత్రి సూపరిండెంట్ డాక్టర్ శివరాం, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులను స్వయంగా పరామర్శించిన ఎమ్మెల్యే వారి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకొని, వారికి అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. ప్రజలకు సకాలంలో నాణ్యమైన వైద్య సేవలు అందేలా అధికారులు, వైద్యులు, సిబ్బంది అంకితభావంతో పనిచేయాలని సూచించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో సౌకర్యాలను మరింత విస్తరించి, ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్యే ఈ సందర్భంగా పేర్కొన్నారు.