ప్రజలకు మెరుగైన సేవలే లక్ష్యం
రోడ్డు ప్రమాదాల నివారణకు అరైవ్ అండ్ అలైవ్‌ను ఉద్యమంగా కొనసాగించాలి
సాంకేతికత వినియోగంతో భద్రత మరింత కట్టుదిట్టం
కన్నెపల్లిలో పోలీస్ స్టేషన్, గోదావరిఖనిలో పోలీస్ క్వార్టర్స్‌ను ప్రారంభించిన -డీజీపీ శివధర్ రెడ్డి
భీమిని/పెద్దపల్లి, ఏప్రిల్ 12 (విజయక్రాంతి): శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా ప్రజలకు మరింత చేరువగా ఉండి మెరుగైన సేవలు అందించాలనే లక్ష్యంతోనే పోలీసులు పని చేస్తున్నారని తెలంగాణ రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ) బి. శివధర్ రెడ్డి అన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అరైవ్ అండ్ అలైవ్ కార్యక్రమాన్ని ఒక ఉద్యమంగా కొనసాగించాలన్నారు. రోడ్డు ప్రమాదాలు ఒక సామా జిక సమస్యగా మారాయని, వాటిపై విస్తృత అవగాహన కల్పించడం అత్యవసరమని డీజీపీ తెలిపారు.
ఆదిలాబాద్ మంచిర్యాల జిల్లా కన్నెపల్లి మండలంలో నూతనంగా నిర్మించిన పోలీస్ స్టేషన్‌ను బెల్లంపల్లి ఎంఎల్‌ఏ గడ్డం వినోద్, మల్టీజోన్- ఐజీ చంద్రశేఖర్ రెడ్డి, రామగుండం సీపీ అంబర్ కిశోర్ ఝా, మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్, డీసీపీ ఎగ్గడి భాస్కర్ లతో కలిసి ప్రారంభించారు. గోదావరిఖని ఐబీ కాలనీలో పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో రూ. 12.29 కోట్ల వ్యయంతో నిర్మించిన నూతన పోలీస్ క్వార్టర్స్‌ను ప్రా రంభించారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ.. ప్రజా రక్షణలో సాంకేతికతను విని యోగించి భద్రతను మరింత కట్టుదిట్టం చేయడం కోసమే ఈ అత్యాధునిక భవనాన్ని నిర్మించామని స్పష్టం చేశారు.
నూతన భవ నం ద్వారా మెరుగైన పోలీసింగ్, ప్రజలకు సేవలు వేగవంతంగా అందించడం సాధ్యమవుతుందని, శాంతిభద్రతలు మరింత బలోపే తం అవుతాయని పేర్కొన్నారు. నూతన పోలీస్ స్టేషన్లో ఎస్‌ఐ భాస్కర్ రావును కుర్చీలో కూర్చోబెట్టి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పోలీస్ స్టేషన్ ఆవరణలో పోలీస్ అధికారులతో కలిసి మొక్కలను నాటారు. అంతకు ముందు పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి ఏసీపీ కిరణ్ కుమార్, సీఐలు, ఎస్‌ఐలు పాల్గొన్నారు.
సైబర్ నేరాలపై అవగాహన ఉండాలి..
రామగుండం పోలీస్ కమిషనరేట్‌కు విచ్చేసిన రాష్ట్ర డీజీపీ బి.శివధర్ రెడ్డిని పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాలకు చెందిన పోలీస్ అధికారులు సాదరంగా ఆహ్వానించారు. కమిషనరేట్ సాయుధ పోలీసు సిబ్బంది గౌరవవందనం సమర్పించి డీజీపీకి స్వాగతం పలికారు. అనంతరం పోలీస్ అధికారులతో కలిసి కమిషనర్ అంబర్ కిషోర్ ఝా అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో పాల్గొన్నారు. రోడ్డు ప్రమాదాల వల్ల జరిగే మరణాలను తగ్గించడం అత్యవసరమన్నారు. ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు తీసుకోవడం, ట్రాఫిక్ నియమాలపై ప్రజల్లో అవగాహన పెంపొందించాలన్నారు. ప్రతినెలా చివరి వారంలో అరైవ్ అండ్ అలైవ్ కార్యక్రమంలో ప్రజలను భాగస్వామ్యం చేయాలని అధికారులను ఆదేశించారు.
ప్రతి అధికారి సైబర్ నేరాలపై అవగాహన కలిగి ఉండడంతో పాటు ప్రజల్లో కూడా అవగాహన పెంపొందించడం అవసరమని పేర్కొన్నారు. రామగుం డం కమిషనరేట్ పోలీసులు ప్రజాసేవలో మరింత నిబద్ధతతో పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మల్టీజోన్ ఐజీ చంద్రశేఖర్ రెడ్డి, రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా, టీజీపీఐసీఎస్ చైర్మన్ గుర్నాథ్ రెడ్డి, పెద్దపల్లి డీసీపీ బి.రామ్‌రెడ్డి, మంచిర్యాల డీసీపీ ఏ. భాస్కర్, కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ అలాం, జగిత్యాల ఎస్పీ అశోక్ కుమార్, రాజన్న సిరిసిల్ల ఎస్పీ మహేష్ బి గీత్, ఎసీపీలు, సీఐలు, ఇన్‌స్పెక్టర్లు, ఎస్‌ఐలు పాల్గొన్నారు.




