29 July, 2026 | 2:21 PM

నాణ్యమైన విద్యనందించడమే లక్ష్యం

03-09-2025 01:32 AM
  1. బడుగు, బలహీన వర్గాల విద్యార్థుల కోసమే ‘యంగ్ ఇండియా స్కూళ్లు’
  2. మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

కోదాడ/ హుజూర్ నగర్, సెప్టెంబర్ 2 : గ్రామీణ ప్రాంతాలకు చెందిన బడుగు, బలహీన వర్గాల విద్యార్థులకు నాణ్యమైన విద్య నందించడమే రాష్ర్ట ప్రభుత్వ లక్ష్యమని రాష్ర్ట నీటిపారుదల, పౌర సరఫరాల శాఖామంత్రి నలమాద ఉత్తమ్ కుమార్‌రెడ్డి అన్నా రు. మంగళవారం కోదాడ నియోజకవర్గం లోని చిలుకూరు మండలం సీతారామపురం వద్ద 167 జాతీయ రహదారి నుంచి యంగ్ ఇండియా ఇంటర్‌నేషనల్ రెసిడెన్షియల్ పాఠశాల వరకు రూ.10 కోట్లతో నిర్మించే రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రోడ్డు సక్రమంగా లేని కారణంగా యంగ్ ఇండియా ఇంటర్‌నేషనల్ స్కూల్ నిర్మాణ పనులు మందకోడిగా సాగుతుండడంతో రూ.10 కోట్ల రూపాయలు మంజూరు చేసి రోడ్డు ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. తదుపరి కోదాడ పట్టణంలో  రూ.54.03 కోట్లతో రాజీవ్ నగర్ రాజీవ్ శాంతినగర్ లిఫ్ట్ ఇరిగేషన్ పనులకు, రూ.5.10 కోట్లతో నిర్మించే నీటిపారుదల శాఖ సర్కిల్ ఆఫీస్ డివిజన్ 4 సమీకృత కార్యాలయం నూతన భవన నిర్మాణ పనులకు జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ తో కలిసి శంకుస్థాపన చేశారు.

అనంతరం కోదాడ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటుచేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ కోదాడ నియోజకవర్గంలో 2.29 లక్షల ఎకరాలకు సాగునీరును పర్యవేక్షించే అధికారులకు నాలుగు అంతస్తులతో పన్నెండు వేల చదరపు అడుగుల్లో కార్యాలయం నిర్మించనున్నట్లు తెలిపారు.  వచ్చే జూన్ నాటికి. నిర్మాణం పూర్తి చేయాలని కాంట్రాక్టర్, అధికారులను ఆదేశించారు.

తదుపరి హుజూర్ నగర్ పట్టణంలో రాజీవ్ గాంధీ విగ్రహం నుంచి మోడల్ కాలనీ వరకు డబుల్ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. పట్టణంలో మగ్దూం నగర్ నుంచి లక్కవరం వరకు బీటీ రోడ్డు నిర్మాణ పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమాల్లో జిల్లా ఎస్పీ కే. నరసింహ, గ్రంథాలయ సంస్థ చైర్మన్ వంగవీటి రామారావు,ఆర్డీఓ సూర్యనారాయణ,ఆర్ అండ్‌బీ ఈఈ సీతారామయ్య, డీఈ పవన్, తహసీల్దార్ ధ్రువ కుమార్ అధికారులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.