జూబ్లీహిల్స్‌లో 3.92 లక్షల ఓటర్లు
- ఓటరు ముసాయిదా జాబితా విడుదల
- మార్పులు, చేర్పులకు ఈ నెల 17 వరకు అవకాశం
- 30న తుది జాబితా: ఎన్నికల అధికారి కర్ణన్
హైదరాబాద్ సిటీ బ్యూరో, సెప్టెంబర్ 2 (విజయక్రాంతి): జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించిన ముసాయిదా ఓటర్ల జాబితాను కేంద్ర ఎన్నికల సంఘం మంగళవారం విడుదల చేసింది. ఈ జాబితా ప్రకారం, నియోజకవర్గంలో మొత్తం 3,92,669 మంది ఓటర్లు ఉన్నట్లు హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి ఆర్.వి. కర్ణన్ ప్రకటనలో వెల్లడించారు. ఈ ముసాయిదా జాబితాపై అభ్యంతరాలు, మార్పు లు, చేర్పుల కోసం ఈ నెల 17వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని ఆయన తెలిపారు.
ముసాయిదా జాబితా ప్రకారం జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని 139 ప్రాంతాలలో ఏర్పాటు చేసిన 407 పోలింగ్ కేంద్రాల పరిధిలో మొత్తం 3,92,669 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో పురుష ఓటర్లు 2,04,288 మంది ఉండగా, మహిళా ఓటర్లు 1,88,356 మంది ఉన్నారు. మరో 25 మంది ఇతరులు థర్డ్ జెండర్ జాబితాలో నమోదయ్యారు.
ఈ ఏడాది జూలై 1 నాటికి 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకునేందుకు ఈ నెల 17వ తేదీ వరకు అవకాశం ఉందని ఎన్నికల అధికారి కర్ణన్ స్పష్టం చేశారు. ముసాయిదా జాబితాలో పేర్లలో తప్పుల సవరణ, చిరునామా మార్పులు, మరణించిన వారి పేర్ల తొలగింపు, పోలింగ్ కేంద్రాల మార్పు వంటి వాటి కోసం కూడా నిర్దేశిత ఫారాలలో దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. ఈ నెల 30వ తేదీన తుది ఓటర్ల జాబితాను అధికారికంగా ప్రకటించనున్నట్లు తెలిపారు.






