సమస్యల పరిష్కారమే లక్ష్యం
మహేశ్వరం, మే 26 : ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని మాజీ మంత్రి, మహేశ్వరం నియోజకవర్గం ఎమ్మెల్యే పటోళ్ల సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. ఆదివారం జల్‌పల్లి మున్సిపాలిటీ కార్పొరేషన్ పరిధిలో నబీల్ కాలనీలో ఆమె పర్యటించారు. ఈ సందర్భంగా స్థానికులు తాము ఎదుర్కొంటున్న సమస్యలను ఆమె దృష్టికి తీసుకెళ్లారు.
గతంలో నాలుగు కోట్ల రూపాయాల నిధులతో చేపట్టిన ఎస్‌ఎన్‌డీపీ నాలా పనులు నత్తనడకన కొనసాగుతున్నాయని, పనులను వెంటనే పూర్తి చేసి రెండో దశ పనులు ప్రారంభించేలా కృషి చేయాలని కోరారు. అధికారులు పట్టించుకోవడం లేదని, కాంట్రాక్టర్లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆమె దృష్టికి తీసుకెళ్లారు. దీంతో, పనులు వెంటనే పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జల్‌పల్లి మున్సిపాలిటీ చైర్మన్ అబ్దుల్లా సాధి, కౌన్సిలర్ హైమ్మద్ ఖాసాని, బీఆర్‌ఎస్ నాయకులు కైసర్‌బామ్, జనార్థన్, అబ్దుల్ గాలిబ్ తదితరులు పాల్గొన్నారు.
సరూర్‌నగర్ ఆత్మీయ సమ్మేళనంలో..
ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా సరే ప్రజా సమస్యలు పరిష్కరించేందుకు ముం దుంటానని సబితా ఇంద్రారెడ్డి హామీ ఇచ్చారు. ఆదివారం సరూర్‌నగర్ డివిజన్ పోచమ్మబాగ్ కాలనీలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళన కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మీకు ఏ సమస్య ఉన్నా నాకు ఫోన్ చేయండి. ఇరవై నాలుగు గంటలు మీకు అందుబాటులో ఉంటానన్నారు. కార్యక్రమంలో పలువురు ప్రతినిథు లతో పాటు స్థానికులు పాల్గొన్నారు.
మృతుడి కుటుంబానికి పరామర్శ
మీర్‌పేట్, మే 26 : మీర్‌పేట్ మున్సిపల్ కార్పొరేషన్ జిల్లెలగూడ పరిధిలో సీతహోంలో నివసించే శివరాజ్ మథుర్ కుమారుడు శ్రీకర్ మహారాష్ట్రలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడనే విషయం తెలుసుకున్న మహేశ్వరం ఎమ్మెల్యే పి.సబితా ఇంద్రారెడ్డి ఆదివారం మృతుడి కుటుంబ సభ్యులను కలుసుకొని పరామర్శించారు. కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. పరామర్శించిన వారిలో మీర్‌పేట్ కార్పొరేషన్ అధ్యక్షుడు అర్కల కామేష్‌రెడ్డి, ఫ్లోర్ లీడర్ అర్కల భూపాల్‌రెడ్డి, కార్పొరేటర్లు సిద్దాల లావణ్య, బీరప్ప, బొక్క రాజేందర్‌రెడ్డి, మేకల రవీందర్‌రెడ్డి తదితరులు ఉన్నారు.






