గ్రేటర్‌లో ఫుడ్ ఇన్‌స్పెక్టర్ల కొరత
30 సర్కిళ్లకు 14 మంది మాత్రమే ఇన్‌స్పెక్టర్లు
సర్కిల్ నుంచి జోనల్‌కు ఎఫ్‌ఎస్‌ఓల అటాచ్
బల్దియాలో కొరవడుతున్న శాఖల మధ్య సమన్వయ లోపం
హైదరాబాద్ సిటీబ్యూరో, మే 26 (విజయక్రాంతి) : నగరంలో పెరుగుతున్న జనాభా, హోటళ్లు, రెస్టారెంట్లకు అనుగుణంగా ఫుడ్ సేఫ్టీ అధికారులు లేకపోవడంతో హోటళ్ల యాజమాన్యాలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. గ్రేటర్ వ్యాప్తంగా 1.30 కోట్లకు పైగా జనాభా ఉన్న జీహెచ్‌ఎంసీ పరిధిలో ఫుడ్ తయారీ కేంద్రాలు వేలాదిగా ఉన్నాయి. కానీ, అందుకు అనుగుణంగా ఫుడ్ ఇన్‌స్పెక్టర్లు లేకపోవడం గమనార్హం.
బల్దియాలో 14 మంది మాత్రమే
దాదాపు 1.30 కోట్లకు పైగా జనాభా కలిగిన హైదరాబాద్‌లో ఎక్కువ మంది ప్రజలు హోటళ్లు, రెస్టారెంట్లలో తయారయ్యే ఆహారంపై ఆధారపడుతుంటారు. నగరంలో దాదాపు 20 వేల హోటళ్లు, రెస్టారెంట్లు ఉంటాయని అధికారులు చెబుతు న్నారు. వీటికి తోడు స్ట్రీట్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్, బేకరీలు ఇలా అన్ని రకాల ఫుడ్ తయారీ కేంద్రాలు మరో 30 వేలకు పైగా ఉంటాయని అంచనా వేస్తున్నారు. ఇలా జీహెచ్ ఎంసీ పరిధిలో మొత్తం 50 వేలకు పైగా ఆహార విక్రయ కేంద్రాలు, హోటళ్లు ఉన్నట్టుగా అధికారులు చెబుతున్నారు.
గ్రేటర్ లో గల 30 సర్కిళ్లలో ఆహార కల్తీ నివారణకు వందలాది మంది అధికారులు, సిబ్బంది అవసరం ఉండగా, కేవలం 14 మంది ఫుడ్ ఇన్‌స్పెక్టర్లతో పాటు ఒక ఏఎఫ్‌సి (అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్) మాత్రమే కొనసాగుతున్నారు. ఈ మొత్తానికి ఒకే ఒక మొబైల్ ల్యాబ్ ఉండటం గమనార్హం. వాస్తవానికి గ్రేటర్‌లో 26 మంది ఫుడ్ సేఫ్టీ అధికారులు ఉండాలి. కానీ, వారిలో ఒకరు పోస్టులో జాయిన్ కాకపోగా, మరొకరు ట్రైనింగ్‌లో, ఇద్దరు లీవ్‌లో ఉన్నారు.
మరొకరు రిజైన్ చేసినట్టు తెలుస్తోంది. ఎలాంటి సమాచారం లేకుండా లాంగ్‌లీవ్ పెట్టిన నలుగురు ఎఫ్‌ఎస్‌ఓలను కమిషనర్ ఇటీవలే సస్పెండ్ చేశారు. మిగతా వారిలో ముగ్గురు ఎఫ్‌ఎస్‌ఓలు నిరంతరం సెక్రటేరియట్‌లో వీఐపీ డ్యూటీ చేస్తుంటారు. వీరందరినీ మినహాయిస్తే.. ప్రస్తుతం జీహెచ్‌ఎంసీ పరిధిలో కేవలం 14 మంది ఎఫ్‌ఎస్‌ఓలు పనిచేస్తున్నారు. దీంతో బల్దియాలో ఫుడ్ సేఫ్టి ఎంత దారుణంగా తయారైందో అర్థం చేసుకోవచ్చు. జీహెచ్‌ఎంసీ అధికారిక వెబ్‌సైట్‌లోనూ అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ పేరు లేకపోవడం ఆ శాఖ అలసత్వానికి తార్కాణం.
శాఖల మధ్య సమన్వయ లోపం
జీహెచ్‌ఎంసీలోని అన్ని విభాగాల్లో కెల్లా హెల్త్ విభాగం చాలా ముఖ్యమైనది. అయితే, అధికారుల మధ్య ఉన్న ఇగో సమస్యల కారణంగా ఈ విభాగం కాస్తా శానిటేషన్, ఫుడ్ సేఫ్టి విభాగాలుగా విడిపోయింది. గతంలో అసిస్టెం ట్ మెడికల్ ఆఫీసర్ ఆఫ్ హెల్త్ (ఏఎంఓహెచ్) పరిధిలోనే శానిటేషన్, ఫుడ్ సేఫ్టీ విభాగం ఉండేది. ఇటీవల నూతనంగా ఎంపికైన ఫుడ్ ఇన్‌స్పెక్టర్లు.. సర్కిల్ స్థాయిలో మేం పనిచేయమంటూ భీష్మించుకోవడంతో చేసేదేమీ లేక కమిషనర్ వారిని సర్కిల్ కార్యాలయం నుంచి జోనల్ కార్యాలయా లకు బదలాయించారు.
దీంతో క్షేత్ర స్థాయిలో ఫుడ్ సేఫ్టీ, హెల్త్, శానిటేషన్ విభాగాల మధ్య సమన్వయ లోపం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. ఏదైనా హోటల్స్, రెస్టారెంట్లను తనిఖీలు చేసిన అనంతరం ఎఫ్‌ఎస్‌ఓలు స్థానిక డిప్యూటీ కమిషనర్‌కు సంబంధం లేకుండా జోనల్ కమిషనర్‌కు నేరుగా నివేదిక ఇవ్వడం కారణంగా సర్కిల్ స్థాయిలో డమ్మీలుగా మారిపోతున్నామనే భావనలో డిప్యూటీ కమిషనర్లు, ఏఎంఓహెచ్‌లు ఉంటున్నారు.






