మెట్రో విస్తరణలో ఇబ్బందులను అధిగమించేందుకే ప్రభుత్వ స్వాధీనం
- నగరానికి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చేలా ప్రణాళికలు
- ఏకగ్రీవ తీర్మానానికి సభ్యులంతా ఆమోదం తెలపాలి
- అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి
హైదరాబాద్, మార్చి 28 (విజయక్రాంతి): మెట్రో విస్తరణకు ఎదురవుతున్న ఇబ్బందులు అధిగమించేందుకే ఎల్‌అండ్‌టీ సంస్థను మెట్రో రైల్ నిర్వహణను ప్రభుత్వం స్వాధీనం చేసుకున్నట్టు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పష్టంచేశారు. ప్రజా రవాణా సౌకర్యా న్ని మరింత మెరుగు పరిచి, మెట్రో నగరానికి అంతర్జాతీయస్థాయిలో గుర్తింపు తీసు కొచ్చేందుకు కావాల్సిన ప్రణాళికలను రచించామని చెప్పారు.
ఎల్‌అండ్‌టీ నుంచి మె ట్రోను స్వాధీనం చేసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు ప్రకటించి దీనిపై శనివారం అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. విశాల ప్రజా ప్రయోజనాల దృష్ట్యా హైదరాబాద్ కోర్ అర్బన్ రీజియన్(క్యూర్)కు మెట్రో నెట్‌వర్క్ విస్తరించాలనే వివిధవర్గాల డిమాండ్ మేరకు మెట్రో విస్తరణకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నదని పేర్కొన్నారు.
విస్తరణకు ఉన్న అడ్డంకులను, ఎదు రవుతున్న ఇబ్బందులను లోతుగా సమీక్షించిందని తెలిపారు. ప్రస్తుతమున్న మెట్రో ఫేజ్-1 మొత్తం 69 కిలోమీటర్లు ఉందని, ఫేజ్-2(ఏ) 76.4 కిలోమీటర్లు, ఫేజ్ 86.1 కిలోమీటర్ల మేర విస్తరణ ప్రతిపాదనలను కేంద్ర ప్రభుత్వానికి సమర్పించినట్టు వెల్లడించారు. హైదరాబాద్ మెట్రో విస్తరణకు ప్రస్తుతం ఉన్న ప్రత్యేక పరిస్థితిని సభ ముంచుంచిందని తెలిపారు.
ఫేజ్-1 ప్రైవేట్ నిర్వహణలో ఉండగా, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త భాగస్వామ్యంతో ఫేజ్--2 ప్రభుత్వ ప్రాజెక్టుగా చేపట్టేందుకు ఎదురవుతున్న సాంకేతిక, చట్టపరమైన, నిర్వహణ సమస్యలను దృష్టిలోకి తీసుకుందని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం లేవనెత్తిన ఆంశాలను పరిష్కరించేందుకు ఎల్‌అండ్‌టీ నుంచి మెట్రో ఫేజ్-1 నెట్‌వర్క్‌ను రాష్ట్ర ప్రభుత్వం హెచ్‌ఎంఆర్‌ఎల్ ద్వారా స్వాధీనం చేసుకునే నిర్ణయాన్ని ఈ సభ ఆమోదించాలని, ఈ ఏకగ్రీవ తీర్మానానికి సభ్యులంతా ఆమోదం తెలపాలని కోరారు.




