calender_icon.png 9 November, 2025 | 6:26 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజల ఆకాంక్షలే ప్రభుత్వ అజెండా

09-11-2025 12:45:21 AM

ప్రతి అడుగు భావితరాల భవిష్యత్తు కోసమే

ప్రతిపక్షాలవి కేవలం దుష్ప్రచారాలే : మంత్రి శ్రీధర్‌బాబు

హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 8 (విజయక్రాంతి): తెలంగాణ ప్రజల ఆశలు, ఆకాంక్షలే తమ ప్రభుత్వ అజెండా అని, తాము వేసే ప్రతి అడుగూ భావితరాల భవిష్యత్తు, రాష్ట్రాభివృద్ధి కోసమేనని ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు స్పష్టం చేశారు. కేవలం ఉపఎన్నికలో రాజకీయ లబ్ధి పొందేందుకే ప్రతిపక్షాలైన బీఆర్‌ఎస్, బీజేపీలు తమ ప్రభుత్వంపై నిరాధారమైన దుష్ప్రచారం చేస్తున్నాయని ఆయన మండిపడ్డారు.

జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్‌యాదవ్‌కు మద్దతుగా శనివారం ఆయన శ్రీనగర్ కాలనీ, ఎల్లారెడ్డిగూడలోని పలు కాలనీల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీధర్‌బాబు మాట్లాడుతూ.. గత రెండేళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులను, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను, అలాగే గత బీఆర్‌ఎస్ పాలనలో దొర్లిన తప్పులను సరిదిద్దేందుకు తీసుకుంటున్న చర్యలను ఓటర్లకు ఓపికగా వివరించారు.

అన్ని వర్గాల సంక్షేమం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుంది. ఒక్కసారి విజ్ఞతతో ఆలోచించి, మీ భవిష్యత్తుకు భరోసానిచ్చే ప్రభుత్వాన్ని ఆదరించండి అని ఆయన కోరారు. బీఆర్‌ఎస్ పాలనలో జూబ్లీహిల్స్ నియోజకవర్గం తీవ్ర నిర్లక్ష్యానికి గురైందని మంత్రి విమర్శించారు. చాలా కాలనీలు, బస్తీల్లో నేటికీ పూర్తిస్థాయిలో మౌలిక సదుపాయాలు లేవన్నారు. పదేళ్ల పాటు అధికారంలో ఉండి కూడా ఈ ప్రాంతాన్ని పట్టించుకోని ఆ పార్టీ నాయకులు, ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడుగుతున్నారో మీరే నిలదీయాలి అని స్థానికులకు విజ్ఞప్తి చేశారు.

ఎల్లవేళలా మీకు అందుబాటులో ఉంటూ, స్థానిక సమస్యలపై పూర్తి అవగాహన ఉన్న నవీన్ యాదవ్‌ను గెలిపించు కోవాలని కోరారు. రాబోయే రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఈ నియోజకవర్గం అభివృద్ధికి అన్ని రకాలుగా అండగా ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ డాక్టర్ రియాజ్ పాల్గొన్నారు.