09-11-2025 12:46:13 AM
ముషీరాబాద్, నవంబర్ 8 (విజయక్రాంతి): గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం చేసిన తప్పులను కాంగ్రెస్ ప్రభుత్వం చేయకూడదని ప్రజలు ఆ పార్టీకి ఓట్లు వేసి గెలి పించారని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ప్రైవేటు కళాశాలల యజమాన్యాలను ప్రభుత్వం భయపెట్టి కళాశాలలు తెరిపించిందని ఆయన ఆరోపించారు. ఈ మేరకు శనివారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో తెలంగాణ బీసీ విద్యార్థి సంఘం అధ్యక్షుడు వేముల రామకృష్ణ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో శ్రీనివాస్ గౌడ్ పాల్గొని ఫీజు పోరు వాల్ పోస్టర్‌ను ఆవిష్కరించి మాట్లాడారు.
విద్యార్థులకు అన్యాయం చేసిన ఏ పార్టీ అయిన ఒక్కటే అని శ్రీనివాస్ గౌడ్ విమర్శించారు. బీఆర్‌ఎస్ కంటే మెరుగ్గా పాలన అందిస్తారనే ప్రజలు అధికారాన్ని కట్టబెట్టారు. గత బీఆర్‌ఎస్ పదేళ్ళ పాలనలో ఎన్ని బకాయిలు ఉన్నాయో, ఈ రెండేళ్ల కాంగ్రెస్ హయాంలో ఎన్ని బకాయిలు పెండింగ్ ఉన్నాయో లెక్కలు బయటపెట్టాలని డిమాండ్ చేశారు. ప్రేవేట్ కళాశాల యాజమాన్యాలు డోనేషన్ల పేరుతో కోట్లు దోచుకుంటున్నారని సీఎం చేసిన వ్యాఖ్యలు నిజమే కావొచ్చునని, ఆ మాటలకు భయపడే యాజమాన్యాలు కళాశాలలను ఓపెన్ చేశాయని శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు.
యాజమాన్యాలు బకాయిల పేరుతో విద్యార్థులను, సిబ్బందిని వేధిస్తే తాము చూస్తూ ఉండమని హెచ్చరించారు. ఈనెల 15న ఫీజు పోరు పేరిట విద్యార్థి సంఘాలు, రాజకీయ పార్టీ నాయకులతో అఖిలపక్షం సమావేశం నిర్వహిస్తామని శ్రీనివాస్ గౌడ్ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ కన్వీనర్ గుజ్జ కృష్ణ, పలు యూనివర్సిటీ నేతలు సంజయ్, హరికృష్ణ, సాహిత్, గణేష్, పాపారావు , జూనియర్ న్యాయవాదుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు జక్కుల వంశీకృష్ణ, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నందగోపాల్, జగదీష్, రాహుల్, ప్రణీత్ తదితరులు పాల్గొన్నారు.