రాష్ట్రంలో శాంతిభద్రతలు గాలికి వదిలేసిన ప్రభుత్వం
మాజీ ఎంపీ మాలోత్ కవిత
మహబూబాబాద్, మే 10 (విజయక్రాంతి): రాష్ట్రంలో శాంతిభద్రతలను రాష్ట్ర ప్రభుత్వం గాలికి వదిలేసి చోద్యం చూస్తోందని మాజీ ఎంపీ, మహబూబాబాద్ జిల్లా బీఆర్‌ఎస్ అధ్యక్షురాలు మాలోత్ కవిత ఆరోపించారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని తన క్యాంపు కార్యాలయంలో కవిత, మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, జడ్పీ మాజీ చైర్ పర్సన్ అంగోత్ బిందుతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ గణాంకాల ప్రకారం క్రైమ్ రేట్ లో ముందు వరుసలో నిలబెట్టిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కుతుందన్నారు. రైసింగ్ తెలంగాణ నినాదాలు చేస్తూ, తెలంగాణ కీర్తిని బొంద పెట్టె కార్యక్ర మంలో సీఎం రేవంత్ ప్రభుత్వం నిమగ్నం అయ్యిందని ఆరోపించారు.
భారత దేశ చరిత్రలో హోమ్ మంత్రి లేని రాష్ట్రం మన తెలంగాణ రాష్ట్రం మాత్రమే అని గుర్తు చేసారు. ముఖ్యమంత్రే హోమ్ శాఖను నిర్వహిస్తూ శాంతి భద్రతలను తుంగలో తొక్కుతూ ఎన్నడు లేని విధంగా హత్యలు ,అత్యా చారాలు, దోపిడీలు విపరీతంగా పెరిగి పోయి తెలంగాణను మరో బీహార్ లాగా మార్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వంనీ దేనన్నారు.
మొన్న కరీంనగర్ లో జరిగిన బంగారు దుకాణంలో జరిగిన సంఘటన, హైదరాబాద్ నడి బొడ్డులో సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ సతీమణి హత్య ఉదంతం, ఈ రెండు సంఘటనలు చూస్తే అర్థం అవుతుంది మనం ఎలాంటి వాతావరణంలో బ్రతుకుతున్నామని విమర్శించారు. కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు ఒక మైనర్ బాలికను మత్తు మందు ఇచ్చి అత్యచారం చేస్తే కేసు నమోదు చేయడానికి 3 నెలలుగా పోలీసు స్టేషన్ చుట్టూ బాధితులు తిరిగిన ఫలితం శూన్యంగా మారిందన్నారు.
బాధితులు చేస్తున్న పోరాటానికి భయపడి చివరకు నిన్న పోక్సో కేసు నమోదు చేశారని, కేంద్ర మంత్రి బండి సంజయ్ ని వెంటనే మంత్రి పదవి నుండి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేసారు. బాధితురాలుకి న్యాయం జరిగేలా చూడాలని ,బండి సంజయ్ కుమారుడు భగీరథ్ ను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. బాధితురాలుకి న్యాయం జరిగేవరకు వారి పక్షాన పోరాడతామని ఆమె స్పష్టం చేశారు.






