4 August, 2026 | 1:50 AM

గీతన్నలకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలి

04-08-2026 12:00 AM

కేజీకేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు రమణ

కేసముద్రం, ఆగస్టు 3 (విజయక్రాంతి): గీత కార్మికుల హక్కులు, సంక్షేమం, సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం తక్షణం పరిష్కరించాలని కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు ఎం.వి. రమణ, బెల్లంకొండ వెంకటేశ్వర్లు ప్రభుత్వాన్ని కోరారు. గీత కార్మికుల సమస్యల పరిష్కారం కోసం చేపట్టిన ‘అమరుల యాదిలో.. గీతన్నల చైతన్య యాత్ర’ కేసముద్రంలో జనసంద్రంగా కొనసాగింది. మండల అధ్యక్షులు బబ్బూరి ఉప్పలయ్య, కార్యదర్శి మోడెమ్ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో గోపా డివిజన్ అధ్యక్షులు సమ్మి గౌడ్ అధ్యక్షతన కేసముద్రం మండలంలో 1000 మోటార్ సైకిళ్లతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నికలకు ముందు గీత కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేయడంతో పాటు వారి సంక్షేమం కోసం ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని, గీత కార్మికుల సమస్యలను గ్రామస్థాయి నుంచి తెలుసుకుని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకే ఈ చైతన్య యాత్ర చేపట్టినట్లు తెలిపారు.

గీత కార్మికుల ఎక్స్గ్రేషియాను రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచుతామని గతంలో ఇచ్చిన హామీని వెంటనే అమలు చేయాలని, ప్రమాదవశాత్తు మృతి చెందిన గీత కార్మికుల కుటుంబాలకు పెండింగ్లో ఉన్న ఎక్స్గ్రేషియా బకాయిలను వెంటనే విడుదల చేయాలని కోరారు. గీత కార్మికులకు తాటి, ఈత చెట్లు ఎక్కడానికి అవసరమైన రక్షణ కిట్లు, భద్రతా పరికరాలను పూర్తిస్థాయిలో అందించాలని, జనగామ జిల్లాకు సర్దార్ పాపన్న పేరును అమోదించాలని డిమాండ్ చేశారు. 

గౌడ సమాజ చారిత్రక వారసత్వానికి ప్రతీక అయిన శ్రీ శ్రీ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహాన్ని హైదరాబాద్ ట్యాంక్బండ్ మీద వెంటనే ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు. గోపా డివిజన్ అధ్యక్షులు, చిలువేరు సమ్మయ్య గౌడ్ మాట్లాడుతూ గీత కార్మికుల హక్కులు, సంక్షేమం, సమస్యల పరిష్కారం కోసం ప్రతిపాదించిన న్యాయపరమైన డిమాండ్లను స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ భూక్యా మురళి నాయక్, మహబూబాబాద్ ఎంపీ పోరిక బలరాం నాయక్, డీసీసీ అధ్యక్షురాలు ఉమ మురళి నాయక్ సహకారంతో, రాజ్యసభ సభ్యులు వేం నరేందర్ రెడ్డి గారి దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పారు.