27 May, 2026 | 1:42 AM

దివ్యాంగుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి

27-05-2026 12:56 AM

దివ్యాంగుల కార్పొరేషన్ చైర్మన్ ముత్తినేని వీరయ్య

45 మందికి స్కూటీలు, వీల్ చైర్లు పంపిణీ

సంగారెడ్డి, మే 26 (విజయక్రాంతి): దివ్యాంగుల సంక్షేమానికి, వారిలో ఆత్మవిశ్వాసం పెంపొందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోందని తెలంగాణ దివ్యాంగుల కార్పొరేషన్ చైర్మన్ ముత్తినేని వీరయ్య పేర్కొన్నారు. మంగళవారం జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ప్రాంగణంలో నిర్వహించిన కార్యక్రమంలో టీజీఐసీ చైర్పర్సన్ నిర్మల జగ్గారెడ్డితో కలిసి దివ్యాంగులకు ఉచిత సహాయ ఉపకరణాలు, స్కూటీలు, బ్యాటరీ వీల్ చైర్లను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా 30 మందికి స్కూటీలు, 15 మంది లబ్ధిదారులకు బ్యాటరీ వీల్ చైర్లు ఉచితంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ముత్తినేని వీరయ్య మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగుల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందన్నారు. దివ్యాంగులు స్వయం ఆధారితంగా జీవించేందుకు అవసరమైన సహాయ ఉపకరణాలు, ఉపాధి అవకాశాలు, సంక్షేమ పథకాలు అందుబాటులోకి తీసుకువస్తోందని తెలిపారు.

గ్రామీణ ప్రాంతాల దివ్యాంగులు కూడా ప్రభుత్వ సేవలు సులభంగా పొందేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. టీజీఐసీ చైర్పర్సన్ నిర్మల జగ్గారెడ్డి మాట్లాడుతూ పట్టుదల, మనోధైర్యం ఉంటే జీవితంలో ఏదైనా సాధించవచ్చని అన్నారు. దివ్యాంగులు సవ్యాంగులకు దీటుగా అన్ని రంగాల్లో రాణిస్తూ తమ ప్రత్యేకతను చాటుకుంటున్నారని కొనియాడారు.

జిల్లా అదనపు కలెక్టర్ పాండు మాట్లాడుతూ దివ్యాంగులు, సీనియర్ సిటిజన్స్, ట్రాన్స్జెండర్ల సంక్షేమం కోసం జిల్లా సంక్షేమ శాఖ ప్రత్యేక కృషి చేస్తోందన్నారు. వారికి అత్యుత్తమ సేవలు అందించేందుకు అధికారులు సమన్వయంతో పనిచేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంజయ్య, జిల్లా సంక్షేమ అధికారి లలిత కుమారి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ వసంతరావు, షఫీ, నర్సింలు, రాయకోటి నరసింహులు, తదితరులు పాల్గొన్నారు.