27 May, 2026 | 1:41 AM

బీఆర్‌ఎస్ పని అయిపోయింది

27-05-2026 12:56 AM
  1. రాష్ట్రంలో బీజేపీ వచ్చే అవకాశం లేదు 
  2. పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ 

కామారెడ్డి, మే 26 (విజయక్రాంతి): రాష్ట్రంలో బీఆర్‌ఎస్ పని అయిపోయిందని, బీజేపీ అసలే రాదని పీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేశ్‌కుమార్‌గౌడ్ అన్నారు. మంగళవారం కామారెడ్డి జిల్లా కేంద్రంలో జిల్లా ముఖ్య కాంగ్రెస్ నాయకుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి కార్యకర్త ప్రభుత్వ సంక్షేమ పథకాలను గడప గడపకు వెళ్లి వివరించాలన్నారు. కెసిఆర్ ప్రభుత్వం 8 లక్షల కోట్ల అప్పు చూపినా తాము ప్రభుత్వ సంక్షేమ పథకాలను ఆపడం లేదన్నారు.

10 సంవత్సరాల బిఆర్‌ఎస్ పరిపాలనలో 50వేల ఉద్యోగాలు కూడా కల్పించలేదన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన రెండున్నర ఏళ్లలో 80 వేల ఉద్యోగాలను భర్తీ చేసిందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విజన్ తో రాష్ట్రానికి 6 వేల కోట్ల విదేశీ పెట్టుబడులను తెచ్చారన్నారు. పెట్రోల్ డీజిల్ ధరలను పెంచి పేద ప్రజలకు న్యాయం చేయలేని స్థితిలో బిజెపి ప్రభుత్వం ఉందన్నారు. కేవలం బడా వ్యాపారుల కోసమే బిజెపి ప్రభుత్వం పని చేస్తుందన్నారు.

కార్యక్రమంలో డిసిసి అధ్యక్షుడు ఏలే మల్లికార్జున్, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు, జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు, టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి, కామారెడ్డి మాజీ ఎమ్మెల్యే యూసుఫ్ అలీ, కామారెడ్డి మున్సిపల్ చైర్పర్సన్ ఇప్ప ఉమారాణి, బిచ్కుంద మున్సిపల్ చైర్మన్ సీమా షెట్కార్, మాజీ డిసిసి అధ్యక్షుడు కైలా శ్రీనివాసరావు, మాజీ జెడ్పిటిసిలు, ఎంపీపీలు, జిల్లా కాంగ్రెస్ కమిటీ ప్రతినిధులు పాల్గొన్నారు.