16 May, 2026 | 2:11 AM

చివరి గింజ వరకు మద్దతు ధరతో ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది

16-05-2026 12:57 AM

ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్

దేవరకొండ, మే 15 :  రైతులు పండించిన ధాన్యం చివరి గింజ వరకు మద్దతు ధరతో ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్. అన్నారు. శుక్రవారం దేవరకొండ పట్టణంలోని ఎమ్మెల్యే నివాసంలో ధాన్యం క కొనుగోళ్లపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేశ చరిత్రలోనే అత్యధికంగా వరి ధాన్యాన్ని తెలంగాణ రైతులు పండించారన్నారు. రైతులు పండించిన ధాన్యాన్ని అమ్ముకునేందుకు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రభుత్వం చివరి గింజ వరకు మద్దతు ధరతో కొనుగోలు చేస్తుందని హామీ ఇచ్చారు.

ధాన్యం సేకరణలో తాలు, చెత్త పేరుతో రైతులను ఇబ్బంది పెడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియలో తూకం పారదర్శకంగా ఉండాలని, గోనె సంచుల లభ్యతను నిర్ధారించాలని, కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెంటనే మిల్లులకు తరలించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. లారీల కొరత ఉన్న చోట ఇతర వాహనాలను వినియోగించి ధాన్యం తరలింపును వేగవంతం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్డిఓ రమణారెడ్డి డీఎస్పీ శ్రీనివాసరావు డివిజన్ స్థాయి అధికారులు తదితరులు పాల్గొన్నారు.