06-12-2025 07:35:45 PM
వర్ధంతి సందర్భంగా అంబేద్కర్ కు నివాళులర్పించిన ఎంపీ, ఎమ్మెల్యే..
ఆదిలాబాద్ (విజయక్రాంతి): ప్రపంచంలోనే అతి గొప్ప రాజ్యాంగాన్ని భారతదేశానికి అందించిన మహానుభావుడు అంబేడ్కర్ అని ఎంపీ గోడం నగేష్, ఎమ్మెల్యే పాయల్ శంకర్ కొనియాడారు. రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ 69వ వర్ధంతి సందర్భంగా శనివారం ఆదిలాబాద్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి ఎంపీ, ఎమ్మెల్యేలతో పాటు పలువురు దళిత సంఘాల నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ మేరకు ఎంపీ, ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఏ దేశంలో లేనటువంటి ఎన్నో భిన్న సంస్కృతులు, భాషలు ఉన్న దేశానికి అన్ని వర్గాలకు న్యాయం రాజ్యాంగాన్ని అందించారన్నారు. ఆ రాజ్యాంగం స్ఫూర్తితోనే ప్రస్తుతం భారతదేశం ప్రపంచానికి నాయకత్వం వహించే దిశగా పయనిస్తుందన్నారు. ఆయన చూపిన మార్గంలోనే ప్రస్తుత మోడీ ప్రభుత్వం నడుస్తూ పంచశీల తీర్థాల అభివృద్ధికి, ఆయన ఆశయ సాధనకు పాటుపడుతోందని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ అంబేద్కర్ అడుగుజాడల్లో నడుస్తూ రాజ్యాంగ హక్కులను పొందాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పలువురు బీజేపీ నాయకులు, దళిత సంఘాల నేతలు పాల్గొన్నారు.