25 March, 2026 | 2:36 AM

హైదరాబాద్ హైవేను 6 లైన్లుగా విస్తరించాలి

25-03-2026 01:03 AM

అసెంబ్లీలో ఎమ్మెల్యే కసిరెడ్డి డిమాండ్

ఆమనగల్లు, మార్చి 24( విజయక్రాంతి): నిత్యం వేలాది వాహనాలతో రద్దీగా ఉండే హైదరాబాద్ - శ్రీశైలం జాతీయ రహదారిని వెంటనే 6 లైన్ల రహదారిగా విస్తరించాలని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. మంగళవారం అసెంబ్లీలో జరిగిన చర్చలో భాగంగా ఆయన ఈ రహదారిపై జరుగుతున్న ప్రమాదాలు, ప్రయాణికుల ఇబ్బందులను సభ దృష్టికి తీసుకువచ్చారు.

శ్రీశైలం హైదరాబాద్ హైవే పై నిత్యం 20 వేలకు పైగా వాహనాలు రాకపోకలుసాగిస్తున్నాయని, రోడ్డు ఇరుకుగా ఉండటంతో తరచూ ఘోర ప్రమాదాలు జరుగుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.వాహనాలు మితిమీరిన వేగంతో వెళ్లడం, ఓవర్టేక్ చేసే క్రమంలో ఎడమ వైపు నుంచి దూసుకురావడంతో ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారని ఎమ్మెల్యే గుర్తు చేశారు.గతంలోనే ఈ రహదారి విస్తరణ గురించి సీఎం రేవంత్ రెడ్డి,మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిల కి, ఉన్నతాధికారులకు విన్నవించానని ఆయన తెలిపారు.

ఈ రహదారి విస్తరణకు సంబంధించిన ప్రతిపాదనలు ఇప్పటికే కేంద్ర మంత్రికి పంపించామని గతంలో మంత్రి చెప్పారు. మరి ఆ ప్రతిపాదనలు ప్రస్తుతం ఏ దశలో ఉన్నాయి?‘ అని కసిరెడ్డి నిలదీశారు.కడ్తాల్ - తలకొండపల్లి వెళ్లే మార్గంలో సుమారు ఒక కిలోమీటర్ మేర అటవీ భూములు ఉండటం వల్ల రోడ్డు విస్తరణ పనులకు ఆటంకం కలుగుతోందని ఆయన మంత్రి దృష్టికి తెచ్చారు.

ఈ మార్గంలో మూడు కీలక వంతెనలు నిర్మించాల్సి ఉందని, అటవీ శాఖ నుంచి త్వరితగతిన క్లియరెన్స్ వచ్చేలా చూడాలని కోరారు.తద్వారా పనులు త్వరగా పూర్తయి, ప్రయాణికులకు ప్రమాదాల భయం లేకుండా ప్రయాణించే వీలు కలుగుతుందని ఆయన విజ్ఞప్తి చేశారు.