24 May, 2026 | 1:59 AM

జూన్ 20 నుంచి టీజీ20 లీగ్

24-05-2026 01:25 AM

ఫ్రాంచైజీలు ప్రకటించిన హెచ్‌సీఏ

హైదరాబాద్‌తో సహా 8 జట్లు

హైదరాబాద్, మే 23 : తెలంగాణ వ్యాప్తంగా యువక్రికెటర్లను ప్రోత్సహించేందుకు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ తీసుకొస్తున్న టీజీ20 లీగ్ తొలి సీజన్ జూన్ 20 నుంచి మొదలు కానుంది. ఈ సీజన్‌కు సంబంధించి ఫ్రాంచైజీల బిడ్లను హెచ్‌సీఏ తెరిచింది. హైదరాబాద్‌తో సహా మొత్తం 8 జట్లు లీగ్‌లో పోటీపడనున్నాయి. జూలై 11న ఫైనల్ జరగనుంది.

హెచ్‌సీఏ రిజిస్టర్ ప్లేయర్స్‌ను వేలంలో కొనుగోలు చేయనున్నారు. త్వరలోనే వేలం ప్రక్రియ కూడా నిర్వహించనున్నట్టు హెచ్‌సీఏ సెక్రటరీ జీవన్‌రెడ్డి చెప్పారు. గ్రామీణ ప్రాంతాలకు చెందిన యువ ఆటగాళ్లకు ఇది చక్కని వేదికగా చెప్పుకొచ్చారు. ఫ్రాంచైజీల కోసం మంచి స్పందన వచ్చిందని, అత్యధిక బిడ్డింగ్ వేసిన కంపెనీలను ఎంపిక చేసి పారదర్శకంగా కేటాయించినట్టు తెలిపారు.

ప్రతీ టీమ్‌లో 20 మంది ప్లేయర్స్ ఉంటారని వెల్లడించారు. తెలంగాణ ఆటగాళ్లకు మాత్రమే ఈ టోర్నీలో ఆడే అవకాశం ఉంటుందని స్పష్టం చేశారు. టీజీ20 లీగ్ ద్వారా తెలంగాణ వ్యాప్తంగా నైపుణ్యమున్న యువ ఆటగాళ్లను వెలికితీసి ఐపీఎల్‌లో ఆడే అవకాశం లభిస్తుందని గవర్నింగ్ కౌన్సిల్ ఛైర్మన్ ఆగమ్‌రావు అన్నారు. కాగా 8 ఫ్రాంచైజీలను దక్కించుకున్న కంపెనీల వివరాలను అధికారికంగా ప్రకటించారు.